Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 తిమోతికి 1-4

పౌలు నుండి నా ప్రియమైన కుమారుడు తిమోతికి వ్రాయడమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు కృప, దయ, శాంతి లభించుగాక!

నేను దైవేచ్ఛానుసారం యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.

దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము యేసు క్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా నేను అపొస్తలుడనయ్యాను.

విశ్వాసంలో ఉండండి

నేను నిష్కల్మష హృదయంతో నా పూర్వికుల దేవునికి సేవచేస్తూ కృతజ్ఞుడనై యున్నాను. రాత్రింబగళ్ళు నిన్ను జ్ఞాపకము పెట్టుకొని నీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. నీలాంటివాణ్ణి నాకు యిచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూసాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది. నీలో ఉన్న నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉంది. నీ తల్లి యునీకేలో కూడా ఉంది. నీలో కూడా అలాంటిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అందుకోసం, నా చేతులు నీ తలపై ఉంచడం వల్ల నీకు దేవుడు యిచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ ఉండమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, స్వయం క్రమశిక్షణ గల ఆత్మనిచ్చాడు.

కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకు. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించు.

దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. 10 కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు.

11 ఈ సువార్తను ప్రకటించటానికి నన్ను వార్తాహరునిగానూ, అపొస్తలునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమించాడు. 12 ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే, నేను విశ్వసించినవాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించినదాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.

13 నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసు క్రీస్తులో విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో. 14 దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు.

15 ఆసియ ప్రాంతములో ఉన్నవాళ్ళంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపొయ్యారని నీకు తెలుసు. “పుగెల్లు” “హెర్మొగెనే” కూడా నన్ను వదిలి వెళ్ళిపొయ్యారు. 16 నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక “ఒనేసిఫోరు” ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక! 17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు. 18 ఆ “రానున్న రోజున” కనికరము పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక! నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్ని విధాల సహాయం చేసాడో నీకు బాగా తెలుసు.

క్రీస్తు యేసు యొక్క విధేయ సైనికుడు

నా కుమారుడా! యేసు క్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు. నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగలవాళ్ళకు, యితరులకు బోధించగల సామర్థ్యము ఉన్నవాళ్ళకు అప్పగించు. యేసు క్రీస్తుకు మంచి సైనికునివలే, మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించు. సైనికునిగా పని చేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో తలదూర్చడు. గాని అతడు, తన సైన్యాధిపతిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు. కష్టించి పని చేసే రైతుకు, వచ్చిన పంటలో భాగము అందరికన్నా ముందు లభిస్తుంది. నేను చెప్పేవాటిని గురించి ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి తెలుసుకొనే జ్ఞానం కల్గిస్తాడు.

దావీదు వంశానికి చెందిన యేసు క్రీస్తు బ్రతికింపబడ్డాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను బోధించే సువార్త. ఈ సువార్త బోధించటం వల్ల నేను సంకెళ్ళతో నేరస్తునివలె కష్టాలు అనుభవిస్తున్నాను. కాని దేవుని సందేశానికి సంకెళ్ళు లేవు. 10 కనుకనే, దేవుడు ఎన్నుకొన్నవాళ్ళ కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ, వాళ్ళకు కూడా లభించాలని నా అభిలాష.

11 ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది:

మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం.
12 మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం!
మనం ఆయన్ని కాదంటే ఆయన మనల్ని కాదంటాడు.
13 మనం నమ్మతగనివాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు.
    తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.

దేవుడు సమ్మతించిన పనివాడు

14 వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను హెచ్చరించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది. 15 దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.

16 విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటివాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు. 17 వీళ్ళ బోధ పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనై, ఫిలేతు ఈ గుంపుకు చెందినవాళ్ళు. 18 వీళ్ళు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు.

19 అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు.(A) ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలివెయ్యాలి” అని వ్రాయబడి ఉంది.

20 గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో, మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి. 21 దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు.

22 యౌవనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచేవాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు. 23 కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. 24 అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. 25 తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి. 26 అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చి సాతాను వేసిన వలనుండి తప్పించుకోగల్గుతారు. ఎందుకంటే సాతాను వాళ్ళను తన యిచ్ఛ నెరవేర్చటానికి బంధించి పెట్టాడు.

చివరి కాలపు సంగతులు

ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి. మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, అపవిత్రత, ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం, ద్రోహబుద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటె సుఖాన్ని ప్రేమించటం. పైకి భక్తిపరుల్లా ఉండి దాని శక్తిని అంగీకరించకుండటం ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండు.

వాళ్ళు ఇళ్ళల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకు పోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకొంటారు. ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకొంటారు. కాని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. యన్నే మరియు యంబ్రే అనువారు మోషేను ఎదిరించిన విధంగా వీళ్ళ బుద్ధులు పాడై సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. వీళ్ళు ముందుకు పోలేరు. మోషేను ఎదిరించినవాళ్ళలాగే వీళ్ళ అవివేకం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.

చివరి సలహాలు

10 కాని, నీకు నా ఉపదేశాలు, నా జీవితం, నా ఉద్దేశ్యం, నా విశ్వాసం, నా శాంతం, నా ప్రేమ, నా సహనం, 11 అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర పట్టణాల్లో నేను అనుభవించిన హింసలు, నా బాధలు, ఇవన్ని పూర్తిగా తెలుసు. ఇన్ని జరిగినా దేవుడు నన్ను వీటినుండి రక్షించాడు. 12 యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా జీవించాలనుకొన్న ప్రతీ ఒక్కడూ హింసింపబడతాడు. 13 దుష్టులు, వేషధారులు, మోసంచేస్తూ, మోసపోతూ ఉంటారు. ఇది రోజు రోజుకూ అధికమవుతుంది.

14 కాని, నీవు ఎవరినుండి నేర్చుకొన్నావో తెలుసు. కనుక, నీవు నేర్చుకొన్నవాటిని, విశ్వసించినవాటిని పాటిస్తూ ఉండు. 15 అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి పవిత్ర గ్రంథాలు తెలిసినవాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి. 16 లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయం తర్బీదు చేయటానికి ఉపయోగపడతాయి. 17 వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారుకాగలడు.

చనిపోయినవాళ్ళపై, బతికివున్నవాళ్ళపై తీర్పు చెప్పే దేవుని సమక్షంలో యేసు క్రీస్తు సమక్షంలో నీకొక ఆజ్ఞ యిస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కానున్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. దైవసందేశాన్ని ప్రకటించు. అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండు. తప్పులు సరిదిద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, ప్రోత్సాహమిస్తూ, సహనంతో బోధిస్తూ ఉండు.

ప్రజలు మంచి ఉపదేశాలు వినటం మానివేసే సమయం వస్తుంది. వాళ్ళు తమ యిష్టం వచ్చినట్లు చేస్తారు. తాము వినదల్చిన లౌకికమైన వాటిని చెప్పగలిగే పండితుల్ని తమ చుట్టూ ప్రోగుచేసుకొంటారు. సత్యం వినటం మాని, కల్పిత సంగతులు వింటారు. కాని అన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండు. కష్టాలు ఓర్చుకో. సువార్త ప్రచారం చెయ్యటానికి కష్టించి పనిచెయ్యి. నీ సేవా సంబంధంలో చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తిగా నిర్వర్తించు.

నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది. ఈ పోటీలో నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా పందెం ముగించాను. ఇప్పుడు “నీతి” అనే కీరీటం నా కోసం కాచుకొని ఉంది. నీతిగా తీర్పు చెప్పే ప్రభువు “ఆ రానున్న రోజు” దాన్ని నాకు బహుమతిగా యిస్తాడు. నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నవాళ్ళందరికీ ఆ బహుమతి లభిస్తుంది.

వ్యక్తిగత సలహాలు

నా దగ్గరకు త్వరలో రావటానికి సాధ్యమైనంత ప్రయత్నం చెయ్యి. 10 ఎందుకంటే, “దేమా” ప్రపంచం మీద వ్యామోహం వల్ల నన్ను వదిలి థెస్సలొనీకకు వెళ్ళిపొయ్యాడు. క్రేస్కే గలతీయకు వెళ్ళిపొయ్యాడు. తీతు దల్మతియకు వెళ్ళిపొయ్యాడు. 11 లూకా మాత్రము నాతో ఉన్నాడు. మార్కు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నీ వెంట పిలుచుకొని రా. నా ఈ సేవా కార్యక్రమంలో అతని సహాయం నాకు ఉపయోగపడుతుంది. 12 తుకికును ఎఫెసుకు పంపాను.

13 నేను త్రోయలో ఉన్నప్పుడు కర్పు ఇంట్లో నా అంగీ మరిచిపొయ్యాను. దాన్ని, గ్రంథాలను, ముఖ్యంగా తోలు కాగితాల గ్రంథాలను తీసుకొని రా.

14 కంచరి అలెక్సంద్రు నాకు చాలా అపకారం చేసాడు. అతడు చేసిన దానికి ప్రభువు అతనికి తగిన శిక్ష విధిస్తాడు. 15 అతడు మన సందేశాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తాడు కనుక, అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు.

16 నా విషయంలో మొదటి సారి విచారణ జరిగినప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. అందరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపొయ్యారు. దేవుడు వాళ్ళను క్షమించు గాక! 17 నా ద్వారా సువార్త ప్రకటింపబడాలని యూదులు కానివాళ్ళందరు వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి నాకు శక్తినిచ్చాడు. సింహాల నోటినుండి నన్ను కాపాడాడు. 18 ప్రభువు నాకు ఏ విధమైన కీడు సంభవించకుండా నన్ను కాపాడి, క్షేమంగా పరలోకంలో ఉన్న తన రాజ్యానికి పిలుచుకు వెళ్తాడు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.

19 ప్రిస్కిల్లను, అకులను, ఒనేసిఫోరు కుటుంబం వాళ్ళకు నా వందనాలు చెప్పు. 20 ఎరస్తు కొరింథులోనే ఉండిపొయ్యాడు. త్రోఫిము జబ్బుతో ఉండటం వల్ల అతణ్ణి మిలేతులో వదలవలసి వచ్చింది. 21 చలి కాలానికి ముందే నీవిక్కడికి రావటానికి గట్టిగా ప్రయత్నించు.

యుబూలు, పుదే, లిను, క్లౌదియ మరియు మిగతా సోదరులందరు నీకు వందనాలు చెప్పుచున్నారు.

22 ప్రభువు నీ ఆత్మకు తోడైయుండునుగాక! దైవానుగ్రహం నీపై ఉండుగాక!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International