Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
రోమీయులకు 8-10

ఆత్మ ద్వారా జీవము

అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు. దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాపస్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాపస్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము.

ప్రాపంచికంగా జీవించేవాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి. ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు. ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు.

దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. 10 ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. 11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు.

12 అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. 13 ఎందుకంటే, ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మద్వారా రూపు మాపితే మీరు జీవిస్తారు.

14 దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు. 15 మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి, “అబ్బా! తండ్రీ!” అని పిలుస్తున్నాము 16 మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. 17 మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి.

రానున్న తేజస్సు

18 మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. 19 దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. 20 సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. 21 బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది.

22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. 23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. 24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? 25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము.

26 అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. 27 ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.

28 దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. 29 దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. 30 దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.

క్రీస్తు యేసులో దేవుని ప్రేమ

31 మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? 32 మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? 33 దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. 34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? 36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము,
    మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”(A)

37 ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.

దేవుడు, తాను ఎన్నుకొన్న ప్రజలు

క్రీస్తు పేరట నేను నిజం చెపుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. నా జాతికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు వాళ్ళను తన పుత్రులుగా చేసుకొని మహిమను, ఒడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేసాడు. మూల పురుషులు వీళ్ళ వంశానికి చెందినవాళ్ళు. క్రీస్తు వీళ్ళ వంశంలో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక! ఆమేన్!

ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళందర్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు. లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.”(B) ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింపబడుతుంది. ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.”(C)

10 అంతేకాదు. రిబ్కాకు, మన మూలపురుషుడైన ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు. 11-12 కాని దేవుడు ఒక్కణ్ణే ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరాలని, రిబ్కాతో, “పెద్దవాడు, చిన్నవానికి సేవ చేస్తాడు”(D) అని అన్నాడు. అప్పటికింకా ఈ కవలలు జన్మించలేదు కనుక వాళ్ళు మంచి, చెడు, చేసే ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం పిలిచాడు. కాని, ఈ పిలుపు వాళ్ళు చేసిన పనులపై ఆధారపడలేదన్న మాట. 13 ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.”(E)

14 మరి, మనమేమనాలి? దేవుడు అన్యాయం చేసాడా? లేదు. 15 ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు: “నాకిష్టం వచ్చిన వాళ్ళను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్ళపై దయ చూపిస్తాను.”(F) 16 అందువల్ల ఇది మానవుని అభీష్టంపై కాని, లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. ఇది దేవుని కనికరంపై ఆధారపడింది. 17 లేఖనము ఫరోతో ఈ విధంగా అంటుంది: “నీ ద్వారా నా శక్తి వ్యక్తం చెయ్యాలనీ, ప్రపంచమంతా నా పేరు ప్రకటింపబడాలనీ, నేను నిన్ను రాజుగా చేసాను.”(G) 18 అంటే, దేవుడు తనకిష్టమున్న వాళ్ళపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్న వాళ్ళపై కఠినత్వం చూపిస్తాడు.

19 మీరు నాతో, “మరి, దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు?” అని అనవచ్చు. 20 కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా? 21 కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా?

22 భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? 23 దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతర్లను సృష్టించాడంటే మనం ఏమనగలం? 24 యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. 25 హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు:

“నా ప్రజలు కాని వాళ్ళను
    నా ప్రజలని పిలుస్తాను.
నా ప్రియురాలు కాని జనాన్ని
    నా ప్రియురాలా అని పిలుస్తాను.”(H)

26 “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.”(I)

27 యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు:

“ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా,
    కొందరు మాత్రమే రక్షింపబడతారు.
28 ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు.”(J)

29 యెషయా జరుగుతుందని చెప్పినట్లు:

“సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని
మనకు వదిలి ఉండక పోయినట్లైతే
    మనం సొదొమ ప్రజలవలే,
    గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.”(K)

30 మరి మనమేమనాలి? నీతిమంతులు కావటానికి ప్రయత్నించని యూదులుకాని ప్రజలు నీతిమంతులయ్యారు. అది వాళ్ళల్లో విశ్వాసం ఉండటం వల్ల సంభవించింది. 31 కాని ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలని ప్రయత్నించిన ఇశ్రాయేలు వంశీయులు నీతిమంతులు కాలేదు. 32 ఎందుకు? వాళ్ళు విశ్వాసంతో కాకుండా కార్యాలు చేసి ప్రయత్నించారు. కనుక అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు. 33 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“నేను సీయోనులో ఒక రాయిని స్థాపించాను.
    దాని వల్ల కొందరు తొట్రుపడతారు. నేనొక శిలను స్థాపిస్తాను.
దాని వల్ల వాళ్ళు క్రింద పడతారు. ఆయన్ని నమ్మిన వానికెన్నడూ ఆశాభంగం కలుగదు.”(L)

10 సోదరులారా! దేవుడు ఇశ్రాయేలు వంశీయుల్ని రక్షించాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు. దేవుడు నీతిమంతులుగా చేసే విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని స్థాపించాలనుకొన్నారు. కనుక వాళ్ళు దేవుడు చెప్పిన విధానాన్ని అంగీకరించలేదు. నమ్మిన ప్రతి ఒక్కడూ నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం అంతమైపోయింది.

ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు”(M) కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలోకానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు రాగలరు? “అగాధంలోకి ఎవరు దిగుతారు?”(N) అని అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావునుండి పిలుచుకు రాగలరు?

మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.”(O) ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము. యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయినవారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. 10 ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము.

11 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.”(P) 12 యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. 13 దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు”(Q) అని వ్రాయబడి ఉంది.

14 మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు? 15 ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”(R)

16 కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. యెషయా ఈ విధంగా అన్నాడు: “ప్రభూ! మేము చెప్పినదాన్ని ఎవరు నమ్మారు?”(S) 17 తద్వారా, సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది.

18 “వాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది.
    వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి.”(T)

19 “ఇశ్రాయేలుకు ఈ విషయం తెలియదా?” అని నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును వారికి తెలిసింది. మోషే మొదట ఈ విధంగా అన్నాడు:

“జనాంగము కానివారి ద్వారా మీరు అసూయ పడేటట్లు చేస్తాను
    అర్థం చేసుకోలేని జనము ద్వారా మీరు కోపం చెందేటట్లు చేస్తాను.”(U)

20 యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు:

“నా కోసం వెదకనివాళ్ళు నన్ను కనుగొంటారు.
నా కోసం అడగని వాళ్ళకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను.”(V)

21 కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా అన్నాడు:

“అవిధేయతతో ఎదురుతిరిగి మాట్లాడుతున్న
    ప్రజల కోసం దినమంతా వేచియున్నాను.”(W)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International