Chronological
బేతేలులో యాకోబు
35 “బేతేలు పట్టణం వెళ్లు. అక్కడ నివసించి, ఆరాధనకు బలిపీఠం నిర్మించు. నీవు నీ అన్న ఏశావు దగ్గర్నుండి పారిపోతున్నప్పుడు నీకు అక్కడ ప్రత్యక్షమైన ఏల్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బలిపీఠం తయారు చేసుకో” అని దేవుడు యాకోబుతో చెప్పాడు.
2 కనుక యాకోబు తన కుటుంబం అంతటితో, సేవకులందరితో ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న చెక్క, లోహములతో చేయబడిన ఆ తప్పుడు దేవతలన్నిటిని నాశనం చేయండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుభ్రమైన వస్త్రాలను ధరించండి. 3 మనం యిక్కడ్నుండి బేతేలుకు వెళ్లిపోవాలి. ఆ స్థలంలో నాకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసినటువంటి దేవునికి బలిపీఠం కట్టాను. ఆ దేవుడే నేను వెళ్లిన ప్రతి చోటా నాతో ఉన్నాడు.”
4 కనుక ప్రజలు వారి దగ్గర ఉన్న అసత్య దేవతలన్నిటిని యాకోబుకు ఇచ్చివేశారు. వారంతా వారి చెవులకు ధరించిన నగలను యాకోబుకు ఇచ్చివేశారు. షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం క్రింద యాకోబు వీటన్నిటిని పాతి పెట్టాడు.
5 యాకోబు, అతని కుమారులు ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. ఆ ఊరి ప్రజలు వీరిని వెంబడించి, చంపాలనుకొన్నారు. అయినా వారు చాలా భయపడి,[a] యాకోబును వెంబడించలేదు. 6 కనుక యాకోబు, అతని వాళ్లంతా లూజు వెళ్లారు. లూజు ఇప్పుడు బేతేలు అని పిలువబడుతోంది. అది కనాను దేశంలో ఉంది. 7 అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు ఈ పేరును నిర్ణయించాడు.
8 రిబ్కా దాది దెబోరా అక్కడే చనిపోయింది. బేతేలులో సింధూర వృక్షం క్రింద ఆమెను వారు పాతిపెట్టారు. ఆ స్థలానికి అల్లోను బాకూత్ అని వారు పేరు పెట్టారు.
యాకోబు క్రొత్త పేరు
9 పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా, దేవుడు మరల అతనికి ప్రత్యక్షమయి, యాకోబును యిలా ఆశీర్వదించాడు. 10 “నీ పేరు యాకోబు. కాని, ఆ పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు అని పిలువబడవు. నీ క్రొత్త పేరు ‘ఇశ్రాయేలు’ అని ఉంటుంది.” కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
11 అతనితో దేవుడన్నాడు: “నేను సర్వశక్తిమంతుడనైన దేవుణ్ణి. కనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను: నీకు చాలా సంతోషం కలిగి, ఒక గొప్ప జనాంగంగా పెరుగుదువు! మరిన్ని జనాంగాలు, మరికొందరు రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు. 12 అబ్రాహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను.” 13 అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు. 14-15 ఈ స్థలంలో ఒక స్మారక శిల[b] యాకోబు నిలబెట్టాడు. ద్రాక్షారసం, తైలం పోసి ఆ బండను పవిత్రం చేశాడు యాకోబు. ఆ స్థలంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు గనుక ఇది ఒక ప్రత్యేక స్థలం. యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు.
రాహేలు ప్రసవిస్తూ చనిపోవుట
16 యాకోబు, అతని వాళ్లు బేతేలు నుండి ప్రయాణమయ్యారు. ఇంక వారు ఎఫ్రాతా (బెత్లెహేం) చేరుతారనగా, రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమయింది. 17 అయితే ఈ కాన్పులో రాహేలు చాలా కష్టపడుతోంది. ఆమె విపరీతంగా బాధపడుతోంది. రాహేలు పనిమనిషి ఇది చూసి, “రాహేలూ, భయపడకు. నీవు మరో కుమారుణ్ణి కంటున్నావు” అని చెప్పింది.
18 కుమారుని కంటుండగా రాహేలు చనిపోయింది. చనిపోక ముందు ఆ పిల్లవాడికి బెనోని[c] అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను[d] అని పేరు పెట్టాడు.
19 ఎఫ్రాతా మార్గంలో రాహేలు సమాధి చేయబడింది (ఎఫ్రాతా అంటే బెత్లెహేం). 20 రాహేలు గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ఆ ప్రత్యేక బండ నేటికీ అక్కడ ఉంది. 21 అప్పుడు ఇశ్రాయేలు (యాకోబు) తన ప్రయాణం కొనసాగించాడు. ఏదెరు శిఖరానికి కొద్దిగా దక్షిణంగా అతడు శిబిరం వేశాడు.
22 ఇశ్రాయేలు అక్కడ కొన్నాళ్లపాటు ఉండిపోయాడు. అతడు అక్కడ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు దాసి బిల్హాతో రూబేను శయనించాడు. ఇశ్రాయేలు ఇది విని చాలా కోపగించుకొన్నాడు.
ఇశ్రాయేలు (యాకోబు) కుటుంబం
యాకోబుకు (ఇశ్రాయేలుకు) 12 మంది కుమారులు.
23 అతని భార్య లేయా మూలంగా అతనికి ఆరుగురు కుమారులు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలును.
24 అతని భార్య రాహేలు మూలంగా అతనికి ఇద్దరు కుమారులున్నారు. యోసేపు, బెన్యామీను.
25 రాహేలు పనిమనిషి బిల్హా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాను, నఫ్తాలి.
26 లేయా పనిమనిషి జిల్ఫా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు.
వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయేలుకు) పుట్టిన కుమారులు.
27 కిర్యతర్బాలోని (హెబ్రోను) మమ్రేలోనున్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన చోటు ఇది. 28 ఇస్సాకు 180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. 29 ఇస్సాకు చాలకాలం నిండు జీవితాన్ని జీవించాడు. అతడు చనిపోయినప్పుడు వృద్ధుడు. అతని తండ్రి సమాధి చేయబడిన చోటనే, అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతణ్ణి కూడ సమాధి చేశారు.
ఏశావు కుటుంబం
36 ఏశావు (ఎదోము అని కూడ అతనికి పేరు) కుటుంబ జాబితా ఇది: ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. 2 ఏశావు భార్యలు ఎవరంటే: హిత్తీవాడైన ఏలోను కుమార్తె ఆదా, హివ్వీవాడైన సిబ్యోను కుమారుడు అనా కుమార్తె అహోలీబామా, 3 ఇశ్మాయేలు కుమార్తెయు నెబాయోతు సోదరియైన బాశెమతు. 4 ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది. 5 అహోలీబామా ఏశావుకు ముగ్గురు కుమారులను కన్నది: యూషు, యాలాము, కోరహు. వీరు ఏశావు కుమారులు. వీరు కనాను దేశంలో పుట్టారు.
6-8 ఏశావు కుటుంబం, యాకోబు కుటుంబం కలిసి ఒకే చోట నివసించటం వల్ల ఆ ప్రాంతం వాళ్ల పోషణకు చాలలేదు. కనుక ఏశావు కనాను విడిచిపెట్టి తన సోదరుడు యాకోబుకు దూరంగా మరో దేశం వెళ్లిపోయాడు. ఏశావు తనకు కలిగినదంతా తనతోబాటు తీసుకొని పోయాడు. ఇవన్నీ అతడు కనానులో నివసించినప్పుడు సంపాదించుకొన్నాడు. కనుక తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన బానిసలందరిని, పశువులను, ఇతర జంతువులను ఏశావు తనతో కూడ తెచ్చుకొన్నాడు. కనుక ఏశావు శేయీరు కొండ ప్రాంతానికి తరలి పోయాడు. (ఏశావుకు ఎదోము అని కూడ పేరు. మరియు ఎదోము, శేయీరు దేశానికి మరో పేరు.)
9 ఎదోము ప్రజలకు ఏశావు తండ్రి. శేయీరు (ఎదోము) కొండ ప్రాంతంలో నివసిస్తోన్న ఏశావు కుటుంబంలోని వాళ్ల పేర్లు యివి:
10 ఏశావు కుమారులు: ఏశావు, ఆదాలకు పుట్టిన కుమారుడు ఎలీఫజు. ఏశావు, బాశెమతులకు పుట్టిన కుమారుడు రగుయేలు.
11 ఎలీఫజుకు అయిదుగురు కుమారులు: తేమాను, ఓమారు, సెపో, గాతాము మరియు కనజు.
12 ఎలీఫజుకు తిమ్నా అనే ఒక దాసి కూడ ఉంది. తిమ్నా, ఎలీఫజులకు అమాలేకు పుట్టాడు.
13 రగూయేలుకు ముగ్గురు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
వీరు బాశెమతు మూలంగా ఏశావుకు మనుమళ్లు.
14 అనా (సిబ్యోను కుమారుడు) కుమార్తె అహోలీబామా ఏశావుకు మూడవ భార్య. ఏశావు, అహోలీబామాలకు పుట్టిన పిల్లలు: యూషు, యాలాము, కోరహు.
15 ఏశావు ద్వారా వచ్చిన వంశాలు యివి:
ఏశావు మొదటి కుమారుడు ఎలీఫజు. ఎలీఫజుకు పుట్టిన వారు: తేమాను, ఓమారు, సెపో, కనజు. 16 కోరహు, గాతాము, అమాలేకు.
ఈ వంశాలన్నీ ఏశావు భార్య ఆదానుండి ఉద్భవించాయి
17 ఏశావు కుమారుడు రగూయేలు ఈ క్రింది కుటుంబాలకు తండ్రి: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
ఈ కుటుంబాలన్నీ ఏశావు భార్య బాశెమతు నుండి ఉద్భవించాయి.
18 అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామాకు యూషు, యగ్లాము, కోరహు పుట్టారు. ఈ ముగ్గురు వారికి పుట్టిన కుటుంబాలకు పెద్దలు.
19 ఈ కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భవించాయి.
20 ఏశావుకంటె ముందు హోరీవాడైన శేయీరు ఎదోములో నివసించాడు. శేయీరు కుమారులు వీరు:
లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, 21 దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఏశావు (ఎదోము) ప్రాంతంనుండి వచ్చిన హోరీయ కుటుంబ నాయకులు.
22 హోరీ, హేమీములకు లోతాను తండ్రి. (తిమ్నా లోతాను సోదరి.)
23 అల్వాన్, మానహదు, ఏబాలు, షపో, ఓనాముల తండ్రి శోబాలు.
24 సిబ్యోనుకు ఇద్దరు కుమారులు. అయ్యా, అనా. (అనా తన తండ్రి గాడిదలను కాస్తూ ఉండగా ఎడారిలో ఉష్ణధారలను కనుగొన్నవాడు.)
25 దిషోను, అహోలీబామా అనే వారికి అనా తండ్రి.
26 దిషోనుకు నలుగురు కుమారులు: హెన్దూను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
27 ఏసెరుకు ముగ్గురు కుమారులు: బిల్హాను, జవాను, అకాను.
28 దీషానుకు ఇద్దరు కుమారులు: ఊజు, అరాను.
29 హోరీ కుటుంబాల పెద్దల పేర్లు ఇవి: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, 30 దిషోను, ఏసెరు, దీషాను, శేయీరు (ఎదోము) దేశంలో నివసించిన కుటుంబాల పెద్దలు వీరంతాను.
31 అప్పట్లో, ఎదోములో రాజులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల రాజులకంటె చాలా ముందే ఎదోములో రాజులు ఉన్నారు.
32 బెయారు కుమారుడు బెల ఎదోమును పాలించిన ఒక రాజు. అతడు దిన్హాబా పట్టణమును పాలించాడు.
33 బెల చనిపోయినప్పుడు యోబాబు రాజయ్యాడు. యోబాబు బొస్రావాడైన జెరహు కుమారుడు.
34 యోబాబు చనిపోయినప్పుడు హుషాము పాలించాడు. హుషాము తేమాని ప్రజల దేశవాసి.
35 హుషాము చనిపోయాక హదదు ఆ ప్రాంతాన్ని పాలించాడు. బదదు కుమారుడు హదదు. (మోయాబు దేశంలో మిద్యానును జయించినవాడు హదదు.) హదదు అవీతు పట్టణంవాడు.
36 హదదు మరణించాక శమ్లా ఆ దేశాన్ని పాలించాడు. శమ్లా మశ్రేకనుండి వచ్చినవాడు.
37 శమ్లా మరణించాక షావూలు ఆ ప్రాంతాన్ని పాలించాడు. యూఫ్రటీసు నదీ ప్రాంతంలోని రహెబోతువాడు షావూలు.
38 షావూలు మరణానంతరం బయల్ హానాను ఆ దేశాన్ని పాలించాడు. అక్బోరు కుమారుడు బయల్ హనాను.
39 బయల్ హనాను మరణించాక హదదు (హదరు) ఆ దేశాన్ని పాలించాడు. హదదు పాయు నగరవాసి. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కుమార్తె. (మత్రేదు తండ్రి మేజాహాబు).
40-43 తిమ్నా, అల్వా, యతేతు, అహోలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము: ఈ ఎదోమీ కుటుంబాలకు పితరుడు ఏశావు. వీటిలో ఒక్కో కుటుంబం, తన కుటుంబం పేరుతోనే పిలువబడే ప్రాంతంలో నివసించింది.
కలలుగనే యోసేపు
37 యాకోబు కనాను దేశంలో ఉంటూ, అక్కడే నివసించాడు. ఇదీ, అతని తండ్రి నివసించినదీ ఒకటే దేశం. 2 ఇది యాకోబు కుటుంబ గాధ.
యోసేపు 17 సంవత్సరాల యువకుడు. గొర్రెల్ని, మేకల్ని కాయటం అతని పని. బిల్హా, జిల్ఫా కుమారులైన తన సోదరులతో కలిసి యోసేపు ఈ పని చేశాడు. (బిల్హా, జిల్ఫా అతని తండ్రి భార్యలు.) అతని సోదరులు చేసే చెడ్డ పనులను గూర్చి యోసేపు తన తండ్రితో చెప్పేవాడు. 3 అతని తండ్రి ఇశ్రాయేలు (యాకోబు) చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. కనుక ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తన కుమారునికి ఒక ప్రత్యేకతగల అంగీ ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా, అందంగా ఉంది. 4 యోసేపు సోదరులు వారి తండ్రి వారందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించటం గమనించారు. అందుచేత వారు వారి సోదరుణ్ణి ద్వేషించారు. వాళ్లు యోసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు.
5 ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతణ్ణి మరింతగా ద్వేషించారు.
6 “నాకో కల వచ్చింది, 7 మనమంతా పొలంలో పని చేస్తున్నాం. మనం గోధుమ పనలు కడ్తున్నాం. నా పన నిలబడింది, దాని చుట్టూ మీ పనలు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనలన్నీ నా పనకు సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు యోసేపు.
8 అతని సోదరులు, “అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా?” అని అడిగారు. వారిని గూర్చి యోసేపుకు వస్తోన్న కలల మూలంగా ఇప్పుడు వారు అతణ్ణి ఇంకా ఎక్కువగా ద్వేషించారు.
9 అప్పుడు యోసేపుకు మళ్లీ ఒక కల వచ్చింది. ఈ కలను గూర్చి యోసేపు తన సోదరులకు చెప్పాడు. “నాకు ఇంకో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడటం నేను చూశాను” అంటూ చెప్పాడు యోసేపు.
10 ఈ కల విషయమై యోసేపు తన తండ్రితో కూడ చెప్పాడు. కాని అతని తండ్రి అతణ్ణి విమర్శించాడు. “ఇదేం కల? నేనూ, మీ అమ్మ, నీ సోదరులు అందరం నీకు సాష్టాంగపడతామని నీవు నమ్ముతున్నావా?” అన్నాడు అతని తండ్రి. 11 యోసేపు సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే ఉన్నారు. అయితే యోసేపు తండ్రి వీటన్నింటిని గూర్చి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ వున్నాడు.
12 ఒకరోజు, యోసేపు సోదరులు తమ తండ్రి గొర్రెల్ని మేపుకొనేందుకు షెకెం వెళ్లారు. 13 యాకోబు, “నీ సోదరులు షెకెంలో నా గొర్రెల్ని కాస్తున్నారు. నీవు అక్కడికి వెళ్లాలి” అని యోసేపుతో చెప్పాడు.
“అలాగే, నేను వెళ్తా,” అన్నాడు యోసేపు.
14 యోసేపు తండ్రి, “నీవు వెళ్లి నీ సోదరులు క్షేమంగా ఉన్నారో లేదో చూచి, మళ్లీ వచ్చి నా గొర్రెల క్షేమ సమాచారం నాకు చెప్పాలి” అన్నాడు. అందుచేత యోసేపు తండ్రి హెబ్రోను లోయనుండి షెకెముకు అతడ్ని పంపించాడు.
15 షెకెములో యోసేపు తప్పిపోయాడు. అతడు పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు. “ఏమిటి వెదుకుతున్నావు” అన్నాడు ఆ మనిషి.
16 “నేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు గొర్రెల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా?” అన్నాడు యోసేపు.
17 ఆ మనిషి “అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. వాళ్లు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను” అన్నాడు. కనుక యోసేపు తన సోదరులను వెంబడించి, దోతానులో వారిని చూడగలిగాడు.
బానిసగా యోసేపును అమ్ముట
18 యోసేపు రావటం అతని అన్నలు అంత దూరం నుంచే చూశారు. అతణ్ణి చంపేందుకు ఒక పథకం వేయాలని వారు తీర్మానించుకొన్నారు. 19 ఆ సోదరులు వాళ్లలో వారు ఇలా చెప్పుకొన్నారు, “కలలుకనే యోసేపు ఇక్కడికి వస్తున్నాడు. 20 ఇప్పుడు మనకు వీలైనప్పుడే మనం వాణ్ణి చంపివేయాలి. వాని శవాన్ని ఇక్కడే ఏదో ఖాళీ బావిలో పడవేస్తే సరిపోతుంది. అడవి మృగం ఏదో వాణ్ణి చంపేసిందని మన తండ్రితో మనం చెప్పొచ్చు. అప్పుడు అతని కలలన్నీ అర్థము లేనివని వానికి మనం చూపెట్టవచ్చు.”
21 కానీ రూబేను యోసేపును కాపాడాలి అనుకొన్నాడు, “వాణ్ణి మనం చంపొద్దు. 22 వానికి హాని చేయకుండానే ఒక బావిలో పడవేస్తే సరిపోతుంది” అని చెప్పాడు రూబేను. యోసేపును రక్షించి, అతని తండ్రి దగ్గరకు పంపించాలని రూబేను వేసిన పథకం ఇది. 23 యోసేపు తన సోదరుల దగ్గరకు వచ్చాడు. వారు అతని మీద పడి, అందమైన అతని పొడవాటి అంగీని చింపేసారు. 24 తర్వాత, ఎండిపోయి ఖాళీగా ఉన్న ఒక బావిలో అతణ్ణి పడవేశారు.
25 యోసేపు బావిలో పడి ఉంటే, అతని సోదరులు భోజనం చేసేందుకు కూర్చున్నారు. అప్పుడు వారు చూడగా, గిలాదునుండి ఈజిప్టుకు ప్రయాణం చేస్తోన్న వ్యాపారస్తుల బృందం ఒకటి కనబడింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం, ఐశ్వర్యాలు మోస్తున్నాయి. 26 కనుక యూదా తన సోదరులతో “మనం మన సోదరున్ని చంపి, వాని మరణాన్ని దాచిపెడితే మనకేం లాభం? 27 ఈ వ్యాపారస్తులకు గనుక మనం వాణ్ణి అమ్మివేస్తే మనకు లాభం వస్తుంది. పైగా మన సొంత సోదరున్ని చంపిన అపరాధం మనమీద ఉండదు” అన్నాడు. మిగిలిన సోదరులు సమ్మతించారు. 28 మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, ఆ సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీశారు. 20 వెండి నాణాలకు వారతణ్ణి ఆ వ్యాపారవేత్తలకు అమ్మివేశారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు.
29 ఇంతసేపూ రూబేను అక్కడ తన సోదరులతో లేడు. యోసేపును వారు అమ్మివేసినట్లు అతనికి తెలియదు. రూబేను బావి దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు బావిలో లేడు. రూబేనుకు ఎక్కడ లేని విచారం కలిగింది. తన విషాదాన్ని తెలియజేయడానికి తన గుడ్డలను చింపివేసుకొన్నాడు. 30 రూబేను తన సోదరుల దగ్గరకు వెళ్లి, “పిల్లవాడు బావిలో లేడు, నేనేం చేయాలి?” అని అడిగాడు. 31 ఆ సోదరులు ఒక మేకను చంపి, దాని రక్తాన్ని యోసేపుయొక్క అందమైన అంగీకి పూశారు. 32 తర్వాత ఆ సోదరులు ఆ అంగీని తమ తండ్రికి చూపించారు. “ఈ అంగీ మాకు దొరికింది. ఇది యోసేపుదా?” అంటూ అడిగారు ఆ సోదరులు.
33 తండ్రి అంగీని చూచి, అది యోసేపుదేనని తెలుసుకొన్నాడు. “అవును, అది అతనిదే, ఒకవేళ అడవి మృగం ఏదైనా అతణ్ణి చంపివేసిందేమో. నా కుమారుడు యోసేపును అడవి మృగం ఏదో భక్షించి వేసింది!” అన్నాడు ఆ తండ్రి. 34 యాకోబు తన కుమారుని గూర్చిన దుఃఖంతో తన వస్త్రాలు చింపివేసుకున్నాడు. అతడు దుఃఖంలో ఉన్నట్లు వ్యక్తం చేసేందుకు ప్రత్యేక వస్త్రాలు యాకోబు ధరించాడు. యాకోబు తన కుమారుని విషయం చాలా కాలం దుఃఖంగానే ఉన్నాడు. 35 యాకోబు కుమారులు, కుమార్తెలు అందరూ అతణ్ణి ఓదార్చాలని ప్రయత్నించారు. అయినా యాకోబుకు ఎన్నడూ ఆదరణ కలుగలేదు. యాకోబు “నా మరణ దినంవరకు నా కుమారుని గూర్చి దుఃఖిస్తూనే ఉంటాను” అన్నాడు. అందుచేత అతని కుమారుడైన యోసేపు కోసం యాకోబు దుఃఖంలోనే కాలం గడుపుతూ ఉండిపోయాడు.
36 యోసేపును కొన్న మిద్యాను వ్యాపారవేత్తలు దరిమిలా అతణ్ణి ఈజిప్టులో ఫరో సంరక్షక సేనాధిపతి పోతీఫరుకు అమ్మివేశారు.
© 1997 Bible League International