Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 19-21

లోతు అతిథులు

19 ఆ సాయంకాలం, ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణానికి చేరుకున్నారు. పట్టణ ద్వారం దగ్గర కూర్చొని ఉన్న లోతు ఆ దేవదూతల్ని చూశాడు. లోతు లేచి, దేవదూతల దగ్గరకు వెళ్లి, సాష్టాంగ పడ్డాడు. లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. ఆ తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.”

“లేదు. ఈ రాత్రికి మేము ఈ ఖాళీ స్థలంలో బస చేస్తాం” అన్నారు దేవదూతలు.

కాని, వారిని తన ఇంటికి రమ్మని లోతు బలవంతము చేశాడు. అందుచేత లోతు ఇంటికి వెళ్లడానికి దేవదూతలు ఒప్పుకొన్నారు. వారు ఇంటికి వెళ్లగానే, వారు తినేందుకు లోతు భోజనం తయారు చేశాడు, వాళ్ల కోసం రొట్టెలు చేశాడు. లోతు వండిన భోజనం దేవదూతలు తిన్నారు.

ఆ రాత్రి పండుకొనక ముందు, పట్టణం నలుమూలల నుండి పురుషులు చిన్నలూ, పెద్దలూ లోతు ఇంటికి వచ్చారు. సొదొమ ప్రజలు లోతు ఇంటిని చుట్టుముట్టి, లోతును పిల్చారు. “ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) ఎక్కడ? వాళ్లను బయటకు మా దగ్గరకు తీసుకురా. మేము వాళ్లను సంభోగించాలి” అన్నారు.

లోతు బయటకు వెళ్లి, తన వెనుకగా తలుపు మూశాడు. “వద్దు, నా సోదరులారా, దయచేసి ఈ చెడ్డపని మీరు చేయవద్దని బ్రతిమలాడుతున్నాను” అని ఆ మనుష్యులతో చెప్పాడు. “చూడండి, నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఇదివరకు ఎన్నడూ ఏ పురుషునివద్ద పడుకోలేదు. నా కూతుళ్లను మీకు ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్లు వాళ్లను చేసుకోండి. కాని దయచేసి ఈ మనుష్యులను మాత్రం ఏమీ చేయకండి. వీళ్లు నా ఇంటికి వచ్చారు, నేను వాళ్లను కాపాడాలి” అని లోతు ఆ మనుష్యులతో అన్నాడు.

“దారిలోనుంచి తప్పుకో” అంటూ ఇంటి చుట్టూ ఉన్నవాళ్లంతా అరిచారు. “ఈ లోతు ఒక యాత్రికుడుగా మన పట్టణం వచ్చాడు. ఇప్పుడు మనకే నీతులు చెబుతున్నాడు” అని వాళ్లలో వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు వాళ్లు లోతుతో, “వాళ్లకు చేసే వాటికంటే ఎక్కువ కీడు నీకు చేస్తాం” అని చెప్పి, లోతుకు మరింత సమీపంగా వెళ్లి, తలుపు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు.

10 అయితే లోతు ఇంటిలో వున్న ఆ యిద్దరు మనుష్యులు తలుపు తెరచి లోతును లోపలికి లాగేశారు. తర్వాత వాళ్లు తలుపు మూసేశారు. 11 ద్వారమునకు వెలుపల ఉన్న మనుష్యులు గ్రుడ్డివాళ్లు అయ్యేటట్లు ఆ దేవదూతలు చేశారు. కనుక ఇంటిలోనికి ప్రవేశించాలని ప్రయత్నించిన ఆ మనుష్యులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అందరు గ్రుడ్డివాళ్లయిపోయి ద్వారం ఎక్కడుందో కనుక్కోలేక పోయారు.

సొదొమ నుండి తప్పించుకోవటం

12 “మీ కుటుంబాలకు చెందినవాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉన్నారా? అల్లుళ్లు, కుమారులు, కుమార్తెలు, లేక ఇంకెవరైనా మీ కుటుంబంలో ఉన్నారా? మీ కుటుంబానికి చెందినవాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉంటే, వాళ్లను ఇప్పుడే ఈ చోటు విడిచిపెట్టమని చెప్పాలి. 13 మేము ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి యెహోవా అంతా చూశాడు. కనుక ఈ పట్టణాన్ని నాశనం చేయటానికి యెహోవా మమ్మల్ని పంపించాడు” అని ఆ ఇద్దరు మనుష్యులు లోతుకు చెప్పారు.

14 కనుక లోతు బయటకు వెళ్లి, తన కుమార్తెలను పెళ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాట్లాడాడు. “త్వరగా ఈ పట్టణం వదిలిపెట్టిండి. యెహోవా దీన్ని త్వరగా నాశనం చేస్తాడు” అని లోతు అన్నాడు. అయితే లోతు పరిహాసం చేస్తున్నాడనుకొన్నారు వాళ్లు.

15 మర్నాడు సూర్యోదయాన దేవదూతలు లోతును తొందరపెట్టి ఈలాగన్నారు. “చూడు, ఈ పట్టణం శిక్షించబడుతుంది. కనుక ఇంక నీతో ఉన్న నీ భార్యను, నీ యిద్దరు కుమార్తెలను తోడుకొని ఈ స్థలం విడిచిపెట్టు. అప్పుడు ఈ పట్టణంతోబాటు నీవు నాశనంగాకుండా ఉంటావు.”

16 కాని, లోతు కలవరపడి, వెళ్లిపోయేందుకు త్వరపడలేదు. కనుక ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) లోతు, అతని భార్య, అతని యిద్దరు కుమార్తెల చేతులు పట్టుకొన్నారు. లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుంచి క్షేమంగా బయటకు నడిపించారు. లోతు, అతని కుటుంబం యెడల యెహోవా దయ చూపాడు. 17 అందుచేత లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. వారు బయటకు వచ్చాక, ఆ మనుష్యులలో ఒకరు ఇలా అన్నారు: “ఇప్పుడు మీ ప్రాణం కాపాడుకోవటానికి పారిపొండి. మళ్లీ వెనక్కు తిరిగి పట్టణం వైపు చూడకండి. లోయలో ఎక్కడా ఆగకండి. పర్వతాలు చేరేంత వరకు పరుగెత్తండి. అలా చేయకపోతే, పట్టణంతో పాటు మీరూ నాశనం అయిపోతారు.”

18 అయితే ఆ ఇద్దరు మనుష్యులతో లోతు ఇలా చెప్పాడు: “అయ్యలారా, అంత దూరం పరుగెత్తమని నన్ను బలవంతం చేయవద్దు. 19 మీ సేవకుడనైన నా మీద మీరు చాలా దయ చూపించారు. నన్ను రక్షించటం మీరు చూపించిన మహా గొప్ప దయ. కానీ, నేను పర్వతాల వరకు పరుగెత్తలేను. నేను మరీ నిదానమైతే, ఆ నగరానికి సంభవించవలసిన శిక్ష నాకు తగిలి నేను మరణిస్తాను. 20 అయితే చూడండి, ఇక్కడికి సమీపంలో ఒక చిన్న ఊరుంది. నన్ను ఆ ఊరికి పారిపోనివ్వండి, అక్కడ నా ప్రాణం రక్షించబడుతుంది.” 21 దేవదూత లోతుతో, “సరే మంచిది, అలాగే కానివ్వు. నీవు వెళ్తున్న ఆ ఊరిని నేను నాశనం చేయను. 22 అయితే అక్కడికి వేగంగా పరుగెత్తు. నీవు క్షేమంగా ఆ ఊరు చేరేంతవరకు, సొదొమను నేను నాశనం చేయను” అన్నాడు. (ఆ ఊరు చిన్నది గనుక అది సోయరు అని పిలువబడింది.)

సొదొమ, గొమొర్రాల నాశనం

23 సూర్యోదయం అయ్యేటప్పటికి లోతు సోయరులో ప్రవేశిస్తున్నాడు. 24 సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనం చేయటం మొదలు బెట్టాడు. ఆకాశం నుండి అగ్ని గంధక వర్షాన్ని యెహోవా పంపించాడు. 25 కనుక ఆ పట్టణాలను యెహోవా నాశనం చేశాడు, మరియు ఆ లోయను, ఆ నగరాల్లో నివసిస్తోన్న ప్రజలందరిని, చెట్లన్నింటిని ఆయన నాశనం చేశాడు.

26 వారు పారిపోతూ ఉండగా లోతు భార్య వెనుకకు తిరిగి ఆ పట్టణం వైపు చూసింది. ఆమె వెనుకకు తిరిగిచూడగానే ఉప్పుస్తంభం అయిపోయింది.

27 ఆ ఉదయమే పెందలకడ అబ్రాహాము లేచి నిన్న యెహోవా ఎదుట నిలిచిన స్థలానికి వెళ్లాడు. 28 అబ్రాహాము సొదొమ గొమొర్రాలవైపు క్రిందుగా చూశాడు. ఆ లోయ ప్రదేశమంతా అబ్రాహాము చూశాడు. ఆ చోటనుండి విస్తారమైన పొగలు రావటం చూశాడు. అది ఒక మహాగొప్ప మంటనుండి లేచిన పొగలా కనబడింది.

29 ఆ లోయలోని పట్టణాలను దేవుడు నాశనం చేశాడు. అయితే దేవుడు ఇది చేసినప్పుడు, అబ్రాహాము అడిగిన దానిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. లోతు ప్రాణాన్ని దేవుడు రక్షించాడు, కాని లోతు నివసించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేశాడు.

లోతు, అతని కుమార్తెలు

30 సోయరులో జీవితం గడిపేందుకు లోతు భయపడ్డాడు. కనుక అతడు, అతని ఇద్దరు కుమార్తెలు వెళ్లి పర్వతాల్లో నివాసం చేశారు. అక్కడ ఒక గుహలో వారు నివసించారు. 31 ఒక రోజున పెద్ద కుమార్తె చిన్న కుమార్తెతో ఇలా చెప్పింది: “భూమిమీద అంతటా స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకొని కుటుంబం కలిగి ఉంటారు. కానీ మనం పెళ్లి చేసుకొని పిల్లలు కలిగేందుకు ఇక్కడ ఎవ్వరూ మగవాళ్లు లేరు. మన తండ్రి ముసలివాడు. 32 కానీ మన కుటుంబం సాగాలి గనుక మనకు పిల్లలు పుట్టడం కోసం మనం మన తండ్రిని ఉపయోగించుకోవాలి. మనం మన తండ్రి దగ్గరకు వెళ్లి, ఆయనతో పాటు మధుపానం చేసి, ఆయనకు మత్తు కలిగిద్దాం. అప్పుడు మనం ఆయనతో పడుకోవచ్చు.”

33 ఆ రాత్రి ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రి దగ్గరకు వెళ్లి, అతనికి ద్రాక్షారసాన్ని త్రాగించి మత్తుగా చేశారు. అప్పుడు పెద్దమ్మాయి తన తండ్రి పడక మీదకు వెళ్లి, అతనితో లైంగికంగా కలిసికొన్నది. లోతు త్రాగిన మత్తులో ఉన్నాడు గనుక, ఆమె ఎప్పుడు తనతో పడుకొన్నదో, ఎప్పుడు లేచి వెళ్లినదో అతనికి తెలియలేదు.

34 మర్నాడు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో చెప్పింది: “గత రాత్రి నా తండ్రితో నేను పండుకొన్నాను. ఈ రాత్రి మళ్లీ మనం ఆయనకు ద్రాక్షారసముతో మత్తు కలిగిద్దాం. అప్పుడు నీవు ఆయన పడక మీదికి వెళ్లి ఆయనతో లైంగికంగా కలిసికొనవచ్చు. ఈ విధంగా మన కుటుంబం అంతం కాకుండా పిల్లలు పుట్టేందుకు మనం మన తండ్రిని ఉపయోగించుకోవచ్చు.” 35 కనుక ఆ రాత్రి తమ తండ్రికి మత్తు ఎక్కేంతవరకు ఆ ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రికి ద్రాక్షారసాన్ని త్రాగించారు. అప్పుడు చిన్నమ్మాయి అతని పడక మీదికి వెళ్లి అతనితో పడుకొన్నది. అతని కుమార్తె అతనితో పడుకొన్నట్లు లోతుకు మరల తెలియలేదు.

36 అందుచేత లోతు కుమార్తెలు ఇద్దరూ గర్భవతులయ్యారు. వారి తండ్రి వారి శిశువులకు తండ్రి. 37 పెద్ద కుమార్తెకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె ఆ కుమారునికి మోయాబు[a] అని పేరు పెట్టింది. నేటికీ జీవిస్తోన్న మోయాబీయులందరికీ అతడు తండ్రి. 38 చిన్న కుమార్తెకు కూడ ఒక కొడుకు పుట్టాడు. ఆమె తన కుమారునికి బెన్నమ్మి[b] అని పేరు పెట్టింది. నేటికీ జీవిస్తోన్న అమ్మోనీయులందరికీ బెన్నమ్మి తండ్రి.

అబ్రాహాము గెరారుకు వెళ్లుట

20 అబ్రాహాము ఆ చోటు విడిచి నెగెబుకు ప్రయాణం కట్టాడు. కాదేషుకు, షూరుకు మధ్యనున్న గెరారుకు అబ్రాహాము వెళ్లాడు. గెరారులో ఉన్నప్పుడు శారా తన సోదరి అని అబ్రాహాము ప్రజలతో చెప్పాడు. గెరారు రాజు అబీమెలెకు ఇది విన్నాడు. అబీమెలెకు శారాను ఇష్టపడి, ఆమెను తీసుకుని వచ్చేందుకు కొందరు సేవకుల్ని పంపించాడు. అయితే ఆ రాత్రి దర్శనంలో అబీమెలెకుతో దేవుడు మాట్లాడి, “చూడు, నీవు చస్తావు. నీవు తెచ్చుకొన్న ఆ స్త్రీ వివాహితురాలు” అని చెప్పాడు.

కానీ అప్పటికి అబీమెలెకు శారాతో శయనించ లేదు. కనుక అబీమెలెకు, “ప్రభూ, నేను దోషిని కాను. నిర్దోషిని నీవు చంపుతావా? ‘ఈ స్త్రీ నా సోదరి’ అని అబ్రాహాము స్వయంగా నాతో చెప్పాడు. ఆ స్త్రీ కూడా ‘ఈ పురుషుడు నా సోదరుడు’ అని చెప్పింది. నేను నిర్దోషిని. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలియలేదు” అన్నాడు.

ఆ దర్శనంలో అబీమెలెకుతో దేవుడు ఇలా చెప్పాడు: “అవును, నాకు తెలుసు, నీవు నిర్దోషివి. నీవు చేస్తున్నది ఏమిటో నీకు తెలియదు అని నాకు తెలుసు. నేను నిన్ను కాపాడాను. నాకు వ్యతిరేకంగా నిన్ను నేను పాపం చేయనీయలేదు. నీవు ఆమెతో శయనించకుండా చేసింది నేనే. కనుక అబ్రాహాము భార్యను తిరిగి అతనికి అప్పగించు. అబ్రాహాము ఒక ప్రవక్త.[c] అతడు నీ కోసం ప్రార్థిస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుతావు. కానీ శారాను నీవు తిరిగి అబ్రాహాముకు ఇవ్వకపోతే, నీవు మరణించడం తప్పదు. నీతోబాటు నీ కుటుంబం అంతా మరణిస్తుంది.”

కనుక మర్నాడు వేకువనే, అబీమెలెకు తన సేవకులందరినీ పిల్చాడు. దర్శనంలో సంభవించిన సంగతులన్నీ అబీమెలెకు వారితో చెప్పాడు. సేవకులు చాలా భయపడ్డారు. అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిచి, అతనితో అన్నాడు: “నీవు మాకు ఎందుకు ఇలా చేశావు? నీకు నేను ఏమి అపకారం చేశాను? ఎందుకలా అబద్ధం చెప్పి, ఆమె నీ సోదరి అన్నావు? నా రాజ్యానికి నీవు చాలా చిక్కు తెచ్చిపెట్టావు. నాకు నీవు ఇలా చేయకుండా ఉండాల్సింది. 10 నీవు దేనికి ఇలా చేశావు?”

11 అందుకు అబ్రాహాము చెప్పాడు: “నేను భయపడ్డాను. దేవుడంటే ఇక్కడ ఎవరికీ భయము లేదని అనుకొన్నాను. శారాను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపేస్తారు అనుకొన్నాను. 12 ఆమె నా భార్య, అయితే నా సోదరి కూడాను. ఆమె నా తండ్రి కుమార్తె గాని, నా తల్లి కుమార్తె కాదు. 13 నా తండ్రి ఇంటినుండి దేవుడు నన్ను బయటకు నడిపించాడు. అనేక చోట్ల సంచారం చేసేటట్లు దేవుడు నన్ను నడిపించాడు. అలా జరిగినప్పుడు, ‘నీవు నా సోదరివని ప్రజలతో మనం వెళ్లిన చోటల్లా చెప్పు, నాకు ఈ మేలు చేయి’ అని నేను శారాతో చెప్పాను.”

14 అప్పుడు జరిగిందేమిటో అబీమెలెకు అర్థం చేసుకొన్నాడు. కనుక శారాను అబీమెలెకు తిరిగి అబ్రాహాముకు అప్పగించేశాడు. కొన్ని గొర్రెలు, పశువులు, కొందరు ఆడ, మగ బానిసలను కూడ అబీమెలెకు అబ్రాహాముకు ఇచ్చాడు. 15 మరియు “నీ చుట్టూ చూడు. ఇది నా దేశం. నీకు ఇష్టం వచ్చిన చోట నీవు ఉండవచ్చు” అని అబీమెలెకు అన్నాడు.

16 “చూడు, నీ సోదరుడైన అబ్రాహాముకు 1,000 వెండి నాణెములు ఇచ్చాను. జరిగినవాటి విషయమై నా పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి యిది చేశాను. నేను సక్రమంగా జరిగించినట్లు అందరూ చూడాలని నేను కోరుతున్నాను” అని అబీమెలెకు శారాతో చెప్పాడు.

17-18 అబీమెలెకు కుటుంబంలోని స్త్రీలను గొడ్రాళ్లుగా చేశాడు యెహోవా. అబ్రాహాము భార్య శారాను అబీమెలెకు తీసుకొన్నందుచేత దేవుడు ఇలా చేశాడు. అయితే అబ్రాహాము ప్రార్థించగా అబీమెలెకును, అతని భార్యను మరియు అతని దాసీలను దేవుడు స్వస్థపరచాడు.

చివరికి శారాకు ఒక శిశువు పుట్టుట

21 యెహోవా శారాకు కుమారున్ని అనుగ్రహిస్తానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్లే ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు. అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భవతి అయ్యింది, అతనికి ఒక కుమారుని కన్నది. ఈ సంగతులన్నీ సరిగ్గా దేవుడు వాగ్దానం చేసినట్టే జరిగాయి. శారా కుమారుని కన్నది, అబ్రాహాము వానికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు, ఇస్సాకుకు ఎనిమిది రోజులు నిండగానే అబ్రాహాము అతనికి సున్నతి చేశాడు.

తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు 100 సంవత్సరాలు. “దేవుడు నన్ను సంతోషపెట్టాడు. ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో సంతోషిస్తారు. నేను శారాను. అబ్రాహాము కుమారుణ్ణి పొందుతాడని ఏ ఒక్కరూ తలంచలేదు. కానీ ఆయన వృద్ధుడుగా ఉన్నప్పుడు అబ్రాహాముకు నేను ఒక కుమారుని కన్నాను” అంది శారా.

ఇంట్లో సమస్య

ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేశాడు. గతంలో ఈజిప్టు బానిస స్త్రీయైన హాగరు ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి కూడా అబ్రాహామే తండ్రి. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది. 10 కనుక “ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు” అంటూ శారా అబ్రాహాముతో చెప్పింది.

11 ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు. 12 కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు. 13 అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడూ నీ కుమారుడే, కనుక అతని వంశం నుండి గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను.”

14 మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లను తెచ్చాడు. అబ్రాహాము వాటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వాటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది.

15 కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. త్రాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది. 16 హాగరు కొంచెం దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తుంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది.

17 ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు. 18 వెళ్లి, పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి నేను అతణ్ణి తండ్రిగా చేస్తాను.”

19 అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్లు చేశాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి, తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు త్రాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది.

20 ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేటగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు. 21 అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు.

అబీమెలెకుతో అబ్రాహాము బేరం

22 అంతట అబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫీకోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు. 23 కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తానని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.”

24 “నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కూడా నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు అబ్రాహాము. 25 అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేశాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచినీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేశాడు.

26 కానీ అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు” అన్నాడు.

27 కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆ ఒడంబడికకు సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబ్రాహాము అబీమెలెకుకు ఇచ్చాడు. 28 ఏడు[d] ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబ్రాహాము అబీమెలెకు ఎదుట ఉంచాడు. 29 “ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును అడిగాడు.

30 “ఈ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్లు రుజువు అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.

31 కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా[e] అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు. 32 కనుక అబ్రాహాము, అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు అబీమెలెకు, అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిష్తీ ప్రజల దేశం వెళ్లిపోయారు.

33 బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు[f] నాటాడు. అప్పుడు అబ్రాహాము, ప్రభువును, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడునైన యెహోవాకు అక్కడ ప్రార్థన చేశాడు. 34 ఫిలిష్తీయుల దేశంలో అబ్రాహాము చాలాకాలం నివసించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International