Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 48-50

మనష్షే, ఎఫ్రాయిములకు ఆశీర్వాదాలు

48 కొంత కాలం తర్వాత, తన తండ్రి చాలా అస్వస్థతగా ఉన్నాడని యోసేపుకు తెలిసింది. కనుక మనష్షే, ఎఫ్రాయిము అనే తన యిద్దరు కుమారులను తీసుకొని, యోసేపు తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. యోసేపు వచ్చినప్పుడు ఎవరో ఇశ్రాయేలుతో చెప్పారు, “నీ కుమారుడు యోసేపు నిన్ను చూడటానికి వచ్చాడు” అని. ఇశ్రాయేలు చాలా బలహీనంగా ఉన్నాడు, అయినప్పటికీ కష్టంగా ప్రయత్నించి తన పడకమీద కూర్చున్నాడు.

అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు, “కనాను దేశంలోని ఊజు వద్ద సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నాతో చెప్పాడు: ‘నిన్ను ఒక గొప్ప వంశంగా నేను చేస్తాను. నీకు అనేకమంది పిల్లలను నేను ఇస్తాను, మీరు గొప్ప జనం అవుతారు. మీ వంశీకులు ఈ భూమిని శాశ్వతంగా స్వంతం చేసుకుంటారు.’ ఇప్పుడు నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నేను రాకముందు యిక్కడ ఈజిప్టు దేశంలో ఈ ఇద్దరు కుమారులు పుట్టారు. ఎఫ్రాయిము, మనష్షే అనే నీ యిద్దరు కుమారులు నా స్వంత కుమారుల్లాగే ఉంటారు. రూబేను, షిమ్యోనులు నాకెలాగో వారు కూడ నాకు అంతే. కనుక ఈ ఇద్దరు బాలురు నా కుమారులే. నాకు ఉన్న దానంతటిలో వారికి కూడ భాగం ఉంది. అయితే నీకు ఇంకా కుమారులు పుడితే, వాళ్లు నీ స్వంత కుమారులుగా ఉంటారు. అయితే వారు ఎఫ్రాయిము మనష్షేలకు కుమారులుగా ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎఫ్రాయిము, మనష్షేలు కలిగి ఉండే దానంతటిలో వాళ్లూ భాగస్థులవుతారు. పద్దనరాము నుండి చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది. ఇది నాకు చాలా దుఃఖం కలిగించింది. ఆమె కనాను దేశంలో చనిపోయింది. అప్పటికి మేము ఇంకా ఎఫ్రాతా (ఎఫ్రాతా బెత్లెహేము) వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎఫ్రాతా పోయే మార్గంలో నేను ఆమెను సమాధి చేశాను.”

అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.

యోసేపు తన తండ్రితో, “వీళ్లు నా కుమారులు. దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్లే” అని చెప్పాడు.

“నీ కుమారులను నా దగ్గరకు తీసుకొని రా! నేను వారిని ఆశీర్వదిస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.

10 ఇశ్రాయేలు వృద్ధుడు గనుక అతని చూపు సరిగ్గా లేదు. అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు వారిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 11 అప్పుడు ఇశ్రాయేలు, “నీ ముఖం మళ్లీ చూస్తానని నేను ఎన్నడూ అనుకోలేదు. అయితే చూడు! నిన్ను, నీ పిల్లలను కూడ దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు యోసేపుతో.

12 అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు ఒడిలోనుండి దించగా, వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు.

13 ఎఫ్రాయిమును తన కుడి ప్రక్కను, మనష్షేను తన ఎడమ ప్రక్కను యోసేపు ఉంచాడు. (కనుక ఇశ్రాయేలుకు ఎడమ ప్రక్క ఎఫ్రాయిము, కుడి ప్రక్క మనష్షే ఉన్నారు). 14 కానీ ఇశ్రాయేలు తన చేతులను అటుయిటు మార్చి చిన్న పిల్లవాడు ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు పెద్దపిల్లవాడు మనష్షే తలమీద తన ఎడమ చేతిని పెట్టాడు. మనష్షే జ్యేష్ఠుడైనప్పటికి అతడు తన ఎడమ చేతిని మనష్షే మీద ఉంచాడు. 15 మరియు ఇశ్రాయేలు యోసేపును ఆశీర్వదించి ఇలా చెప్పాడు:

“నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు మన దేవుణ్ణి ఆరాధించారు.
    ఆ దేవుడే నా జీవితమంతా నన్ను నడిపించాడు.
16 ఆయనే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన దూత.
    ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది. మన పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకుల పేర్లు వారికి ఉంటాయి.
    వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన.”

17 తన తండ్రి కుడిచేయి ఎఫ్రాయిము మీద ఉంచినట్లు యోసేపు చూశాడు. ఇది యోసేపుకు సంతోషం కలిగించలేదు. యోసేపు తన తండ్రి చేయి తీసుకొని, ఎఫ్రాయిము తలమీదనుండి తీసి, మనష్షే తలమీద ఉంచాలనుకొన్నాడు. 18 యోసేపు తన తండ్రితో, “నీ కుడి చేయి సరైన వాడిమీద పెట్టలేదు. మనష్షే జ్యేష్ఠుడు” అని చెప్పాడు.

19 అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు, “నాకు తెలుసు కొడుకా, మనష్షే జ్యేష్ఠుడు. అతడు గొప్పవాడవుతాడు. అతడు అనేకమంది ప్రజలకు తండ్రి కూడ అవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడికంటె గొప్పవాడవుతాడు. మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది.”

20 అలా ఇశ్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు.

“ఇశ్రాయేలువారు ఆశీర్వదించుటకు
    నీ నామాన్ని ఉపయోగిస్తారు.
ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు ‘దేవుడు ఎఫ్రాయిము
    మరియు మనష్షేవలె చేయునుగాక అని వాళ్లంటారు’ అని అతడు చెప్పాడు.”

ఈ విధంగా మనష్షేకంటె ఎఫ్రాయిమును గొప్ప చేశాడు ఇశ్రాయేలు.

21 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు “చూడు, నా మరణ ఘడియ దాదాపు సమీపించింది. అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి ఆయన మిమ్మును నడిపిస్తాడు. 22 నీ సోదరులకు ఇవ్వనిది నేను నీకు ఇచ్చాను. అమోరీ ప్రజలనుండి నేను గెలుచుకొన్న పర్వతాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ పర్వతం కోసం నా కత్తితో, నా బాణంతో నేను ఆ మనుష్యులతో పోరాడి గెల్చాను.”

యాకోబు తన కుమారులను ఆశీర్వదించుట

49 అప్పుడు యాకోబు తన కుమారులందరినీ తన దగ్గరకు పిలిచాడు. అతడు చెప్పాడు: “నా కుమారులందరూ ఇక్కడ నా దగ్గరకు రండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు చెబుతాను.

“యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి.
మీ తండ్రి ఇశ్రాయేలు మాటలు వినండి.

“రూబేనూ, నీవు నా మొట్టమొదటి కుమారుడవు, నా బలం నీవు.
    పురుషునిగా నా శక్తికి మొదటి ఋజువు నీవే.
నా కుమారులందరిలోను గౌరవించదగినవాడివి, మహా బలశాలివి నీవు.
కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన ప్రవాహం వలే ఉన్నావు,
    కాబట్టి నీవు ఎక్కువ గౌరవించదగిన నా కుమారుడవు కావు
నీ తండ్రి పడకను నీవు ఎక్కావు.
    నీ తండ్రి భార్యలలో ఒకదానితో నీవు శయనించావు
నీవు నా పడకకు అవమానం తెచ్చావు,
    ఆ పడకపై నీవు శయనించావు.

“షిమ్యోను, లేవీ సోదరులు.
    తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి.
రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు.
    వారి పథకాలలో నా ఆత్మ భాగాన్ని కోరటం లేదు,
వారి రహస్య సమావేశాలను నేను అంగీకరించను,
    వారు వారి పగవారిని కోపంతో చంపారు. వారు కేవలం సరదాలకు పశువులకు హాని చేశారు.
వారి కోపం శాపం, అది చాల బలీయమయింది.
    వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు.
యాకోబు దేశంలో వారి వంశాలకు వారి స్వంత భూమి వారికి ఉండదు.
    ఇశ్రాయేలు అంతటిలో వారు చెదరి ఉంటారు.

“యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు.
    నీవు నీ శత్రువులను ఓడిస్తావు.
    నీ సోదరులు నీకు సాగిలపడ్తారు.
యూదా సింహంలాంటివాడు. కుమారుడా,
    తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు.
యూదా సింహంవంటి వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు.
    అతణ్ణి లేపుటకు ఎవరూ సాహసించరు.
10 యూదా వంశపు పురుషులు రాజులుగా ఉంటారు.
అతని కుటుంబం పరిపాలిస్తుంది అనే సూచన
    అసలైన రాజు వచ్చేంతవరకు[a] అతని కుటుంబాన్ని విడువదు.
అప్పుడు అనేక మంది అతనికి విధేయులై అతణ్ణి సేవిస్తారు.
11 అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు[b] శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు.
    అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు.
12 ద్రాక్షారసం త్రాగి అతని కళ్లు ఎరుపెక్కి ఉంటాయి.
    పాలు త్రాగి అతని పళ్లు తెల్లగా ఉంటాయి.

13 “జెబూలూను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు.
    అతని తీరం ఓడలకు క్షేమ స్థలంగా ఉంటుంది.
    అతని భూమి సీదోను వరకు విస్తరిస్తుంది.

14 “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు.
    భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు.
15 అతడు తన విశ్రాంతి స్థలం మంచిదిగా ఉండేటట్లు చూసుకొంటాడు
    తన భూమి రమ్యమైనదిగా ఉండేటట్లు అతడు చూసుకొంటాడు.
తర్వాత అతడు బరువులు మోయుటకు ఒప్పుకొంటాడు.
    బానిసగా పని చేసేందుకు అతడు ఒప్పుకొంటాడు.

16 “ఇతర ఇశ్రాయేలు వంశస్థుల్లాగే దాను
    తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు.
17 దారి ప్రక్కన ఉండే పామువలె దాను ఉండునుగాక.
    త్రోవ దగ్గర పొంచి ఉండే కట్లపామువలె అతడు ఉండుగాక.
ఆ పాము గుర్రపు మడిమెను కాటు వేస్తుంది.
    ఆ గుర్రంమీద స్వారీ చేసే మనిషి గుర్రం మీదనుండి పడిపోతాడు.

18 “యెహోవా, నీ రక్షణకోసం నేను కనిపెట్టుకొని ఉన్నాను.

19 “దొంగల గుంపు గాదు మీద పడ్తారు.
    కానీ గాదు వారిని తరిమివేస్తాడు.”

20 “ఆషేరు భూమి మంచి ఆహారాన్ని సమృధ్ధిగా పండిస్తుంది
    ఒక రాజుకు సరిపోయేలాంటి భోజనం అతనికి ఉంటుంది.”

21 “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు నఫ్తాలి.
    అతని మాటలు విన సొంపుగా ఉంటాయి.”

22 “యోసేపు చాలా విజయశాలి.
    నీళ్ల ఊట దగ్గర ఎదిగే ద్రాక్షావల్లిలా,
    కంచెమీద అల్లుకొనే ద్రాక్షా తీగెలా అతడు ఫలిస్తాడు.
23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు.
    బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు.
24 అయితే తన మహత్తర విల్లుతోను, నైపుణ్యంగల తన చేతులతోను
    అతడు పోరాటం గెల్చాడు.
తన శక్తిని యాకోబు యొక్క శక్తిమంతుని నుండి
    గొర్రెల కాపరినుండి, ఇశ్రాయేలు బండనుండి
25 నీకు సహాయకుడైన నీ తండ్రి దేవునినుండి అతడు పొందుతాడు.

“సర్వశక్తిమంతుడగు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక!
    పైన ఆకాశంనుండి ఆశీర్వాదములను, అగాధ స్థలములనుండి ఆశీర్వాదములను
ఆయన నీకు అనుగ్రహించునుగాక.
    స్తనముల దీవెనలు, గర్భపు దీవెనలు ఆయన నీకు ఇచ్చునుగాక.
26 నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి.
మరియు నీ తండ్రినైన నేను అంతకంటె ఎక్కువగ ఆశీర్వదించబడ్డాను.
    నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టారు.
అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ
    కొండంత ఎత్తుగా నీమీద క్రుమ్మరించబడతాయి.”

27 “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు.
    ఉదయాన అతడు చంపుకొని తింటాడు.
    మిగిలిన దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.”

28 ఇవి ఇశ్రాయేలు పండ్రెండు కుటుంబాలు. మరియు వారి తండ్రి వారితో చెప్పిన విషయాలు ఇవి. వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం అతడు వారికి ఇచ్చాడు. 29 తర్వాత ఇశ్రాయేలు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, “నేను మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరుచున్నాను. హిత్తీయుడగు ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకులతో బాటు పాతిపెట్టబడాలని కోరుతున్నాను. 30 ఆ గుహ మమ్రే దగ్గర మక్ఫేలా పొలంలో ఉంది. అది కనాను దేశంలో ఉంది. అబ్రాహాము తనను పాతిపెట్టేందుకు స్థలం ఉండాలని ఎఫ్రోను దగ్గర ఆ భూమిని కొన్నాడు. 31 అబ్రాహాము, అతని భార్య శారా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను. 32 హిత్తీ మనుష్యుల దగ్గర కొన్న పొలంలో ఉంది ఆ గుహ.” 33 యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్లు చాపుకొని మరణించాడు.

యాకోబు సమాధి చేయబడుట

50 ఇశ్రాయేలు మరణించినప్పుడు యోసేపు చాలా విచారించాడు. అతడు తన తండ్రిని కౌగలించుకొని, అతని మీద పడి ఏడ్చి, అతనిని ముద్దు పెట్టుకొన్నాడు. తన తండ్రి దేహమును సిద్ధం చేయమని అతడు తన సేవకులకు (ఆ సేవకులు వైద్యులు) ఆజ్ఞాపించాడు. యాకోబు శరీరాన్ని సమాధి చేసేందుకు వైద్యులు సిద్ధం చేశారు. ఈజిప్టువారి ప్రత్యేక పద్ధతిలో ఆ శరీరాన్ని వారు సిద్ధం చేశారు. ఈజిప్టు వారు ఈ పద్ధతిలో శరీరాన్ని సిద్ధం చేయాలంటే, ఆ శరీరాన్ని సమాధి చేసేందుకు ముందు 40 రోజులు వారికి అవసరం. తర్వాత ఈజిప్టువాళ్లు యాకోబు కోసం దుఃఖించటానికి ప్రత్యేక సమయం తీసుకొన్నారు. ఆ సమయం 70 రోజులు.

డెబ్భైరోజుల తర్వాత దుఃఖసమయం ముగిసింది. కనుక ఫరో అధికారులతో యోసేపు మాట్లాడాడు. “దయచేసి ఫరోతో ఇది చెప్పండి: ‘నా తండ్రి మరణ ఘడియల్లో నేను ఆయనకు ఒక వాగ్దానం చేశాను. కనాను దేశంలోని ఒక గుహలో నేను ఆయనను సమాధి చేస్తానని నేను వాగ్దానం చేశాను. ఇది ఆయన తనకోసం సిద్ధం చేసుకొన్న గుహ. కనుక దయచేసి నేను వెళ్లి, నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి. అప్పుడు నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను’” అన్నాడు యోసేపు.

“నీ మాట నిలబెట్టుకో, వెళ్లి నీ తండ్రిని సమాధి చేయి” అని ఫరో జవాబిచ్చాడు.

కనుక యోసేపు తన తండ్రిని సమాధి చేసేందుకు వెళ్లాడు. ఫరో అధికారులంతా, ఫరో పెద్దలు (నాయకులు) యోసేపుతో కూడ వెళ్లారు. ఫరో నాయకులు, ఈజిప్టులోని పెద్దలందరూ యోసేపుతో వెళ్లారు. యోసేపు కుటుంబంలోని వాళ్లందరూ, అతనితో వెళ్లారు. మరియు తన తండ్రి కుటుంబం అంతా యోసేపుతో వెళ్లారు. పిల్లలు, పశువులు మాత్రమే గోషెను దేశంలో విడువబడటం జరిగింది. యోసేపుతో వెళ్లటానికి అందరూ రథాలమీద, గుర్రాలమీద వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు అయింది.

10 యోర్దాను నదికి తూర్పున గోరెన్ ఆఠదు కళ్లం దగ్గరకు వారు వెళ్లారు. ఆ స్థలంలో వారు ఇశ్రాయేలు నిమిత్తం భూస్థాపన క్రమాలు దీర్ఘంగా జరిగించారు. ఆ భూస్థాపన క్రమం ఏడు రోజులపాటు కొనసాగింది. 11 గోరెన్ ఆఠదులో జరిగిన భూస్థాపన క్రమాన్ని కనానులో నివసిస్తున్న ప్రజలు చూశారు. వారు “ఆ ఈజిప్టు వాళ్లు ఎంతగా దుఃఖిస్తున్నారో అని చెప్పుకొన్నారు”. కనుక ఆ స్థలం ఇప్పుడు ఆబేల్ మిస్రాయిము అని పిలువబడుతుంది.

12 కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. 13 వారు అతని శరీరాన్ని కనానుకు తీసుకొని వెళ్లి, మక్పేలా గుహలో దానిని పాతిపెట్టారు. హిత్తీయుడగు ఎఫ్రోను దగ్గర అబ్రాహాము కొన్న పొలంలోని మమ్రే సమీపాన ఉన్న గుహ ఇది. సమాధిస్థలంగా ఉపయోగించేందుకు అబ్రాహాము ఆ గుహను కొన్నాడు. 14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత, అతనూ, అతనితో ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి ఈజిప్టు వెళ్లిపోయారు.

సోదరులు యోసేపుకు ఇంకా భయపడుట

15 యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోదరులు దిగులుపడిపోయారు. చాలాకాలం క్రిందట వారు చేసినదాన్ని బట్టి యోసేపు ఇంకా వారిమీద కోపంగా ఉంటాడని వారు భయపడ్డారు. మనము చేసినదాని విషయంలో “బహుశాః యోసేపు మనల్ని ఇంకా ద్వేషించవచ్చు. మరియు మనం అతనికి చేసిన కీడంతటికి తిరిగి పగ తీర్చుకోవచ్చు” అని తమలో తాము అనుకొన్నారు. 16 కనుక ఆ సోదరులు యోసేపుకు ఈ సందేశం పంపించారు: “నీ తండ్రి చనిపోక ముందు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 17 ‘యోసేపుకు వారు చేసిన కీడును దయతో క్షమించమని నేను అతణ్ణి బ్రతిమాలుతున్నానని యోసేపుతో చెప్పండి’ అని అతడు చెప్పాడు. కనుక యోసేపూ, మేము చేసిన తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు. మేము నీ తండ్రి దేవుని దాసులం.”

యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి, అతడు ఏడ్చేశాడు. 18 యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్లి అతని ఎదుట సాగిలపడ్డారు. వారు “మేము నీకు దాసులం” అని చెప్పారు.

19 అప్పుడు యోసేపు, “భయపడకండి, నేనేం దేవుణ్ణి కాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు. 20 మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు. 21 కనుక భయపడవద్దు. నేను మీ కోసం, మీ పిల్లలకోసం జాగ్రత్త పుచ్చుకుంటాను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో దయగా మాట్లాడాడు. ఆ సోదరులకు యిది నెమ్మది కలిగించింది.

22 యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా ఈజిప్టులోనే జీవించటం కొనసాగించాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. 23 యోసేపు జీవించి ఉన్నప్పుడు, ఎఫ్రాయిముకు పిల్లలు, పిల్లల పిల్లలు పుట్టారు. మరియు అతని కుమారుడు మనష్షేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు. మాకీరు పిల్లలను చూచేంతవరకు యోసేపు జీవించాడు.

యోసేపు మరణం

24 యోసేపు మరణం దగ్గరపడినప్పుడు, అతడు, “నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఈ దేశంనుండి బయటకు తీసుకొని వెళ్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు” అని తన సోదరులతో చెప్పాడు.

25 అప్పుడు యోసేపు తన వాళ్లందర్నీ ఒక వాగ్దానం చెయ్యమని అడిగాడు. “దేవుడు మిమ్మల్ని ఆ నూతన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి” అన్నాడు యోసేపు.

26 యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈజిప్టులో మరణించాడు. వైద్యులు అతని శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధంచేసి, ఈజిప్టులో సమాధి పెట్టెలో ఆ శరీరాన్ని ఉంచారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International