Revised Common Lectionary (Semicontinuous)
117 సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి.
సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
2 దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు.
దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు.
యెహోవాను స్తుతించండి!
18 యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“యూకోబు సంతానం ఇప్పుడు బందీలైయున్నారు.
కాని వారు తిరిగివస్తారు.
యాకోబు నివాసులపై నేను కనికరం కలిగివుంటాను.
నగరమంతా[a] కూలిపోయిన భవనాలతో
కప్పబడిన కొండలా ఉంది.
కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది.
రాజభవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి నిర్మింపబడుతుంది.
19 ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు.
ఉల్లాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి.
వారి సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను.
ఇశ్రాయేలు, యూదా అల్ప రాజ్యాలుగా ఉండవు.
వాటికి కీర్తి ప్రతిష్ఠలు కలుగజేస్తాను.
ఎవ్వరూ వారిని చిన్నచూపు చూడరు.
20 యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
ఇశ్రాయేలు. యూదా ప్రజలను నేను శక్తివంతులుగా చేస్తాను.
అంతేగాదు; వారిని హింసించేవారిని నేను శిక్షిస్తాను.
21 వారి స్వజనులలో ఒకడు వారికి నాయకత్వం వహిస్తాడు.
ఆ పాలకుడు నా ప్రజలలోనుండే వస్తాడు.
నేను పిలిస్తేనే ప్రజలు నావద్దకు రాగలరు.
అందుచేత ఆ నాయకుని వావద్దకు పిలుస్తాను.
అతడు నాకు సన్నిహితుడవుతాడు.
22 మీరు నా ప్రజలై ఉంటారు.
నేను మీ దేవుడనై ఉంటాను.”
23 యెహోవా మిక్కిలి కోపంగా ఉన్నాడు!
ఆయన ప్రజలను శిక్షించినాడు.
ఆ శిక్ష తుఫానులా వచ్చిపడింది.
ఆ శిక్ష దుష్టులపైకి పెనుతుఫానులా వచ్చి పడింది.
24 తన పథకం ప్రకారం అన్నీ జరిగేవరకు
యెహోవా కోపోద్రిక్తుడై ఉంటాడు.
ఆ రోజు సంభవించినప్పుడు (అంత్య దినాల్లో)
మీరు అర్థం చేసుకుంటారు.
8 యోహాను అనబడే నేను ఈ విషయం చూసాను. నేను అవి విని, చూసినప్పుడు నాకు యివి చూపిస్తున్న దూతను ఆరాధించటానికి అతని కాళ్ళమీద పడ్డాను. 9 కాని అతడు నాతో, “నేను నీ తోటి సేవకుణ్ణి, నీ సోదరులతో, ప్రవక్తలతో, ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించేవాళ్ళతో కలిసి సేవ చేసేవాణ్ణి. నన్ను ఆరాధించకు. దేవుణ్ణి ఆరాధించు” అని అన్నాడు.
10 అతడు యింకా ఈ విధంగా అన్నాడు: “కాలం సమీపిస్తోంది, కనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్కును రహస్యంగా దాచవద్దు. 11 తప్పు చేసేవాణ్ణి తప్పు చేయనీ! నీచంగా ప్రవర్తించేవాణ్ణి నీచంగా ప్రవర్తించనీ! నీతిగా ఉండేవాణ్ణి నీతిగా ఉండనీ! పవిత్రంగా ఉండేవాణ్ణి పవిత్రంగా ఉండనీ.”
12 “జాగ్రత్త, నేను త్వరలో రాబోతున్నాను. ప్రతి ఒక్కనికి అతడు చేసేవాటిని బట్టి నా దగ్గరున్నదాన్ని బహుమతిగా ఇస్తాను. 13 ఆదియు, అంతమును[a] నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే, ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే.
14 “జీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్ళే అర్హత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు. 15 పట్టణానికి వెలుపట కుక్కలు, మంత్రగాళ్ళు, అవినీతిపరులు, హంతకులు, విగ్రహారాధికులు, అసత్యాన్ని ప్రేమించి జీవించేవాళ్ళు రకరకాల మనుష్యులు ఉంటారు.
16 “నేను యేసును. ఈ విషయాన్ని సంఘాలకు చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను వేరును, దావీదు వంశాంకురాన్ని, ప్రకాశించే వేకువచుక్కను.”
17 ఆత్మ మరియు పెళ్ళికుమార్తె “రండి” అని అంటున్నారు. ఇది విన్నవాడు “రండి!” అనాలి. దాహంతో ఉన్నవాళ్ళు రావచ్చును. ఇష్టమున్నవాడు ఉచితంగా లభించే జీవజలాన్ని త్రాగవచ్చు.
18 ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్కును వినే ప్రతి ఒక్కణ్ణి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. 19 ఒకవేళ ఎవరైనా దీనికి ఏదైనా చేర్చితే, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకు వస్తాయి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంనుండి ఏవైనా మాటలు తీసి వేస్తే, ఈ గ్రంథంలో వర్ణింపబడిన జీవవృక్షంలో, పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు తీసివేస్తాడు.
20 యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు ఆయన, “ఔను, నేను త్వరలోనే వస్తాను” అని అంటున్నాడు.
ఆమేన్! రండి యేసు ప్రభూ!
21 యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.
© 1997 Bible League International