Revised Common Lectionary (Semicontinuous)
దేవునికి ఒక స్తుతిపాట
12 ఆ సమయంలో మీరంటారు:
“యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
నీకు నామీద కోపం వచ్చింది.
కానీ ఇప్పుడు నామీద కోపగించకుము.
నీ ప్రేమ నాకు చూపించు.”
2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు.
యెహోవా, యెహోవాయే నా బలం.[a]
ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి.
అప్పుడు మీరు సంతోషిస్తారు.
4 “యెహోవాకు స్తోత్రాలు!
ఆయన నామం ఆరాధించండి!
ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి”
అని అప్పుడు మీరు అంటారు.
5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి.
ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక.
దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి.
పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు.
అందుచేత, సంతోషంగా ఉండండి!
చెడ్డవాళ్లు వారి జీవితాలు మార్చుకోవాలి
59 చూడు, నిన్ను రక్షించుటకు యెహోవా శక్తి చాలు. సహాయంకోసం నీవు ఆయనను అడిగినప్పుడు ఆయన వినగలడు. 2 కానీ నీ పాపాలు నిన్ను నీ దేవుని నుండి వేరుచేశాయి. యెహోవా నీ పాపాలు చూసి, నీ నుండి తిరిగిపోతాడు. 3 నీ చేతులు మైలగా ఉన్నాయి, అవి రక్తంతోనిండి ఉన్నాయి. నీ వేళ్లు దోషంతో నిండి ఉన్నాయి. నీవు నీ నోటితో అబద్ధాలు చెబుతున్నావు. నీ నాలుక చెడు విషయాలు పలుకుతుంది. 4 ఎవ్వరూ ఇతరులను గూర్చి సత్యం చెప్పరు. ప్రజలు ఒకరి మీద ఒకరు న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు, వారి వ్యవహారం గెలుచుకొనేందుకు వారు తప్పుడు వాదాలమీద ఆధారపడతారు. వారు ఒకరిని గూర్చి ఒకరు అబద్ధాలు చెబుతారు. వారు చిక్కులతో నిండిపొయి, కీడును పుట్టిస్తారు. 5 విషసర్పాల గ్రుడ్లవలె, వారు కీడును పొదుగుతారు. ఆ గ్రుడ్లు ఒకటి తింటే నీవు చస్తావు. ఆ గ్రుడ్లలో ఒకదాన్ని నీవు పగులగొడితే, ఒక విషసర్పం బయటకు వస్తుంది. ప్రజలు అబద్ధాలు చెబుతారు.
ఈ అబద్ధాలు సాలెగూళ్లలా ఉంటాయి. 6 వారు అల్లే ఈ గూళ్లు బట్టలకు ఉపయోగపడవు. ఆ గూళ్లతో నిన్ను నీవు కప్పుకోలేవు.
కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేస్తారు, ఇతరులను బాధించుటకు వారి చేతులు ప్రయోగిస్తారు. 7 కీడుకు పరుగులెత్తుటకు ఆ ప్రజలు వారి పాదాలను ఉపయోగిస్తారు. ఏ తప్పూ చేయని వారిని చంపటానికి వారు త్వరపడతారు. వారు చెడు తలంపులు తలుస్తారు. దౌర్జన్యం, దొంగతనం వారి జీవిత విధానం. 8 ఆ ప్రజలకు శాంతి మార్గం తెలియదు. వారి జీవితాల్లో మంచితనం ఏమీలేదు. వారి మార్గాలు నిజాయితీగా లేవు. వారు జీవించినట్టుగా జీవించేవారెవరి జీవితాల్లోనూ ఎన్నటికి శాంతి ఉండదు.
ఇశ్రాయేలీయుల పాపం కష్టాన్ని తెస్తుంది
9 న్యాయం, మంచితనం అంతా పోయింది.
చీకటి మాత్రమే మనవద్ద ఉంది.
అందుచేత మనం వెలుగుకోసం కనిపెట్టాలి.
ప్రకాశవంతమైన వెలుగుకోసం మనం నిరీక్షిస్తాం.
కానీ మనకు ఉన్నదంతా చీకటి మాత్రమే.
10 మనం కళ్లులేని ప్రజల్లా ఉన్నాం.
మనం గుడ్డివాళ్లలా గోడల మీదికి నడుస్తాం.
అది రాత్రియైనట్టు మనం జారి పడ్తాం.
పగటి వెలుగులో కూడా మనం చూడలేం.
మధ్యాహ్న సమయంలో మనం చచ్చినవాళ్లలా పడిపోతాం.
11 మనం అందరం ఎంతో విచారంగా ఉన్నాం.
పావురాల్లా, ఎలుగుబంట్లలా విచారకరమైన శబ్దాలు మనం చేస్తాం.
మనుష్యులు న్యాయంగా ఉండేకాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం.
కానీ ఇంకా న్యాయం ఏమీ లేదు.
మనం రక్షించబడాలని ఎదురు చూస్తున్నాం,
కానీ రక్షణ ఇంకా దూరంగానే ఉంది.
12 ఎందుకంటే మనం మన దేవునికి వ్యతిరేకంగా ఎన్నెన్నో తప్పు పనులు చేశాం గనుక.
మనదే తప్పు అని మన పాలు చూపెడ్తున్నాయి.
ఈ పనులు చేసి మనం దోషులంగా
ఉన్నామని మనకు తెలుసు.
13 మనం పాపంచేసి,
యెహోవాకు విరోధంగా తిరిగాం.
మనం యెహోవా నుండి తిరిగిపోయి,
ఆయన్ని విడిచిపెట్టేశాం.
చెడు విషయాలను మనం ఆలోచించాం.
దేవునికి వ్యతిరేకమైన వాటినే మనం ఆలోచించాం.
వీటిని గూర్చి మనం ఆలోచించి,
మన హృదయాల్లో వాటి పథకాలు వేసుకొన్నాం.
14 మన దగ్గర్నుండి న్యాయం తొలగిపోయింది.
న్యాయం దూరంగా నిలుస్తుంది.
సత్యం వీధుల్లో పడిపోయింది.
మంచితనం పట్టణంలో ప్రవేశించటానికి అనుమతించబడటం లేదు.
15 సత్యం పోయింది.
మంచి జరిగించాలనుకొనే మనుష్యులు దోచుకోబడ్డారు.
యెహోవా చూశాడు, కానీ మంచితనం ఏమీ ఆయనకు కనబడలేదు. ఇది
యెహోవాకు ఇష్టం కాలేదు.
3 సోదరులారా! మీ విశ్వాసం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. మీ మధ్య ఉన్న ప్రేమ వర్ధిల్లుతోంది. కనుక మీ విషయంలో మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతగా ఉండాలి. 4 మీరు ఓర్పుతో సహిస్తున్న హింసలను గురించి, కష్టాలను గురించి విశ్వాసాన్ని గురించి మేము పొగడుతూ దేవుని ఇతర సంఘాలకు చెపుతూ ఉంటాము.
దేవుని తీర్పు గూర్చి పౌలు చెప్పటం
5 దేవుడు న్యాయంగా తీర్పు చెబుతాడన్నదానికి ఇది సాక్ష్యం. మీరు దేనికొరకు వీటిని అనుభవిస్తున్నారో ఆ రాజ్యానికి దేవుడు మిమ్మల్ని అర్హులుగా చేస్తాడు. 6 దేవుడు నీతిమంతుడు. మిమ్మల్ని కష్టపెట్టినవాళ్ళకు కష్టం కలిగిస్తాడు. 7 ఆయన మనందరి కష్టాలు తొలిగిస్తాడు. ఇది యేసు ప్రభువు పరలోకం నుండి శక్తిగల దేవదూతలతో, అగ్నిజ్వాలలతో వచ్చినప్పుడు సంభవిస్తుంది. 8 దేవుడు అంటే ఎవరో తెలియనివాళ్ళను, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించనివాళ్ళను ఆయన శిక్షిస్తాడు. 9 వాళ్ళు ప్రభువు సమక్షంలో నుండి, ఆయన గొప్పశక్తి నుండి దూరమై శాశ్వతంగా నాశనమై పోతారు. 10 ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసులు ఆయనతో సహా మహిమను పొందుతారు. అప్పుడు ఆయనయందు విశ్వసించినవాళ్ళు ఆయన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు. మేము చెప్పిన సందేశాన్ని మీరు కూడా విశ్వసించారు కనుక మహిమను పొందేవాళ్ళలో మీరు కూడా ఉన్నారు.
11 ఇది మనస్సులో పెట్టుకొని తాను పిలిచిన పిలుపుకు తగినట్లు మీ జీవితాలను నడపమని మేము దేవుణ్ణి ప్రతిరోజూ ప్రార్థిస్తూ ఉంటాము. అంతేకాక, మీరు మంచి చేయాలని ఆశిస్తూ కోరుకొన్న ప్రతి కోరికను, విశ్వాసంవల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు తన శక్తి ద్వారా పూర్తి చేయాలనీ ప్రార్థిస్తూ ఉంటాము. 12 మీ ద్వారా మన యేసు క్రీస్తు ప్రభువు మహిమ పొందాలని, మీకు ఆయన ద్వారా తన మహిమలో భాగం కలగాలని మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఇది మన దేవుని అనుగ్రహంవల్ల, యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప వల్ల సంభవిస్తుంది.
© 1997 Bible League International