Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 145:1-5

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.

కీర్తనలు. 145:17-21

17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
    యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
    యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
    యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
    మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
    దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
    ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!

జెకర్యా 1:1-17

యెహోవా తన ప్రజలు తిరిగి రావాలని కోరుట

బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షియా (పారశీకం) రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. (జెకర్యా తండ్రి పేరు బెరక్యా. బెరక్యా ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది.

యెహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు. కావున ప్రజలకు నీవు ఈ విషయాలు తప్పక చెప్పాలి. “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను” అని సర్వశక్తి మంతుడైన యెహోవా చెపుతున్నాడు.

యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులవలె మీరు ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ చెడు జీవిత విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. చెడు కార్యాలు చేయటం మానండి!’ అని చెప్పాడు. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.”

యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులు పోయారు. ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు. ప్రవక్తలు నా సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించుకొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చుకున్నారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా చేస్తానని చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, మేము చేసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని శిక్షించాడు’ అని వారు చెప్పారు. కావున వారు దేవుని వద్దకు తిరిగి వచ్చారు.”

నాలుగు గుర్రాలకు సంబంధించిన దర్శనం

పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం పదకొండవ నెల (షెబాటు) ఇరవై నాల్గవ రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవానుండి అందుకున్నాడు. (జెకర్యా తండ్రి బెరక్యా, బెరక్యా తండ్రి ప్రవక్త అయిన ఇద్దో.)

రాత్రి వేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీచేయటం నేను చూశాను. అతడు లోయలోని కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని వెనుక ఎర్రగుర్రాలు, చుక్కలు చుక్కలుగల గుర్రాలు మరియు తెలుపు గుర్రాలు ఉన్నాయి. “అయ్యా, ఈ గుర్రాలు ఏమిటి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను నేను అడిగాను.

అప్పుడు దేవదూత నాతో మాట్లాడుతూ, “ఈ గుర్రాలు ఏనిటో నేను నీకు చెపుతాను” అని అన్నాడు.

10 అప్పుడు కదంబచెట్లమధ్య నిలుచున్న మనిషి, “యెహోవా ఈ గుర్రాలను భూలోకమంతా ఇటు అటు తిరగటానికి పంపించాడు” అని చెప్పాడు.

11 తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్లాడాయి. “మేము భూలోకమంతా సంచరించాము. అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి.

12 అందుకు యెహోవా దూత, “ప్రభువా! యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బైయేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ వచ్చావే” అన్నాడు.

13 అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. యెహోవా మంచివైన, ఓదార్పు మాటలు చెప్పాడు.

14 తరువాత దేవదూత నాతో ఇలా అన్నాడు: ఈ విషయాలను ప్రజలకు చెప్పు. సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు:

“యెరూషలేముపట్ల, సీయోనుపట్ల నాకు గాఢమైన ఆసక్తి ఉంది.
15     మిక్కిలి క్షేమంగా ఉన్నామని భావించే దేశాలపట్ల నేను చాలా కోపంగా వున్నాను.
నాకు కొంచెం కోపం వచ్చినప్పుడు.
    నా జనులను శిక్షించటానికి నేను ఆ రాజ్యాలను వినియోగించాను.
    కాని ఆ రాజ్యాలు వీరికి చాలా హాని చేశాయి.”
16 కాబట్టి యెహోవా ఏమి చెపుతున్నాడంటే, “నేను ప్రేమతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చుతాను. యెరూషలేము మళ్లీ నిర్మింపబడుతుంది.
    మరియు నా ఆలయం అక్కడ కట్టబడుతుందని సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు” అని చెప్పు.

17 “ప్రజలకు ఈ విషయాలు కూడా చెప్పు, సర్వశక్తిమంతుడైన యెహోవా,
    ‘నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి.
నేను సీయోనును ఓదార్చుతాను.
    నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను’” అని చెపుతున్నాడు.

అపొస్తలుల కార్యములు 22:22-23:11

22 ప్రజలు పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు. 23 వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, దుమ్ము రేపుతూ కేకలు వేసారు. 24 సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతణ్ణి చూసి ఎందుకిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. 25 అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతితో, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోమా పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు.

26 ఇది విన్నాక ఆ సేనాధిపతి, సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోమా పౌరుడట!” అని అన్నాడు.

27 ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్ళి, “ఇప్పుడు చెప్పు! నీవు రోమా పౌరుడివా?” అని అడిగాడు.

“ఔను!” పౌలు సమాధానం చెప్పాడు.

28 సహస్రాధిపతి, “నేను రోమా పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు.

పౌలు, “నేను పుట్టినప్పటినుండి రోమా పౌరుణ్ణి!” అని అన్నాడు.

29 అతణ్ణి ప్రశ్నలడగాలనుకొన్నవాళ్ళు తక్షణమే వెనుకంజ వేసారు. ఆ సహస్రాధిపతి కూడా తాను రోమా పౌరుణ్ణి బంధించిన విషయం గమనించి భయపడిపోయాడు.

పౌలు యూదుల నాయకులతో మాట్లాడటం

30 అతడు పౌలుపై యూదులు మోపిన నిందకు సరియైన కారణం తెలుసుకోవాలనుకొన్నాడు. కనుక మరుసటి రోజు ప్రధానయాజకుల్ని, మిగతా సభ్యుల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు.

23 పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు. ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళతో, “అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు.

పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళు, “దేవుని ప్రధానయాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని అన్నారు.

అందుకు పౌలు, “సోదరులారా! ప్రధానయాజకుడని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయబడివుంది, ‘ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.’”(A)

పౌలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరిసయ్యుణ్ణి. నా తండ్రి పరిసయ్యుడు. నేను యిక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ” అని అన్నాడు.

అతడీ మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు. సద్దూకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు. సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, “యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు!” అని అన్నారు.

10 సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైనికులతో, “వెళ్ళండి! అతణ్ణి వాళ్ళనుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.

11 ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, “ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోమాలో కూడా బోధించాలి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International