Revised Common Lectionary (Semicontinuous)
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
యెరూషలేమును ఆశీర్వదించటానికి యెహోవా మాట యిచ్చుట
8 సర్వశక్తిమంతుడైన యెహోవానుండి వచ్చిన ఒక వర్తమానం ఇది. 2 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనును నిజంగా ప్రేమిస్తున్నాను. నేనామెను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, ఆమె నాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు నాకు కోపం వచ్చింది.” 3 యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనుకు తిరిగి వచ్చాను. నేను యెరూషలేములో నివసిస్తున్నాను. యెరూషలేము విశ్వాసంగల నగరం అని పిలవబడుతుంది. నా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడుతుంది.”
4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “వృద్ధులైన స్త్రీ వురుషులు మళ్లీ యెరూషలేము బహిరంగ ప్రదేశాలలో కనబడతారు. ప్రజలు నడవటానికి చేతి కర్రలు కావలసివచ్చే వయసువరకు నివసిస్తారు. 5 వీధుల్లో ఆడుకునే పిల్లలతో నగరం నిండిపోతుంది. 6 చావగా మిగిలినవారు ఇదంతా అద్భుతం అనుకుంటారు. నేనూ ఇది అద్భుతం అనుకుంటాను!”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “చూడు, తూర్పు, పడమటి దేశాలలో ఉన్న నా ప్రజలను నేను రక్షిస్తున్నాను. 8 వారిని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తాను. వారు యెరూషలేములో నివసిస్తారు. వారు నా ప్రజగా పుంటారు. నేను వారికి మెచ్చదగిన, విశ్వసనీయమైన దేవునిగా వుంటాను.”
9 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ధైర్యంగా ఉండండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ముందుగా తన ఆలయాన్ని నిర్మించటానికి పునాదులు వేసినప్పుడు ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్నే ప్రజలైన మీరు ఈనాడు వింటున్నారు. 10 అంతకు ముందు, పనివారిని పెట్టటానికి, జంతువులను బాడుగకు తీసుకోటానికి మనుష్యులవద్ద డబ్బు లేదు. పైగా మనుష్యులు రావటానికి, పోవటానికి కూడ క్షేమకరం కాని సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను. 11 కాని ఇప్పుడు పూర్వం మాదిరిగా లేదు. బతికివున్నవారికి ఇక అలా జరుగదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
12 “ఈ ప్రజలు శాంతియుత వాతావరణంలో మొక్కలు. నాటుతారు. వారి ద్రాక్షాతోటలు కాయలు కాస్తాయి. భూమి విస్తారంగా పంటనిస్తుంది. ఆకాశం వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన వీరికి ఇస్తాను. 13 ప్రజలు తమ శాపాలతో ఇశ్రాయేలును, యూదాను వాడటం మొదలు పెట్టారు. కాని ఇశ్రాయేలును, యూదాను నేను రక్షిస్తాను. ఆ పేర్లు ఒక దీవెనగా మారుతాయి. కావున భయపడవద్దు. ధైర్యంగా ఉండండి!”
14 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీ పూర్వీకులు నాకు కోపం కలిగించారు. అందువల్ల వారిని నేను నాశనం చేయ సంకల్పించాను. నా మనస్సు మార్చుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 15 “కాని ఇప్పుడు నా మనస్సు మార్చుకున్నాను. అదేమాదిరి నేను యెరూషలేముపట్ల, యూదాప్రజలపట్ల మంచిగా వుండటానికి నిర్ణయించుకున్నాను. కావున భయపడవద్దు! 16 అయితే మీరు మాత్రం ఇవి తప్పక చేయండి: మీ పొరుగు వారికి నిజం చెప్పండి. మీరు మీ నగరాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు సరిగా ప్రవర్తించండి. ధర్మమైన శాంతికి దోహదపడే పనులు చేయండి. 17 మీ పొరుగు వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయకండి! బూటకపు వాగ్దానాలు చేయకండి! అటువంటి పనులు చేయటంపట్ల ఆసక్తి కనపరచకండి. ఎందుకంటే, వాటిని నేను అసహ్యించుకుంటాను!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
యేసు దేవుని అధికారం కలిగియున్నాడు
19 యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు. 20 తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు. 21 తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు.
22 “అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు. 23 తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు.
24 యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట. 25 ఇది సత్యం. దేవుని కుమారుని స్వరం చనిపోయిన వాళ్ళు వినే కాలం రాబోతూవుంది. ఇప్పటికే వచ్చింది. ఆ స్వరం విన్నవాళ్ళు క్రొత్త జీవితాన్ని పొందుతారు. 26 ఎందుకంటే, జీవానికి తండ్రి ఏ విధంగా మూలపురుషుడో అదేవిధంగా కుమారుడు కూడా జీవానికి మూలపురుషుడు. కుమారుణ్ణి మూలపురుషుడుగా చేసింది తండ్రి! 27 కుమారుడు మానవావతారం పొందాడు కనుక తండ్రి ఆయనకు తీర్పు చెప్పే అధికారంయిచ్చాడు. ఆయన స్వరం వినే కాలం రానున్నది.
28 “ఆశ్చర్యపడకండి! సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం వినే కాలం రానున్నది. 29 వెలుపలికి రండి! మంచి చేసిన వాళ్ళు నిరంతరం జీవించటానికి బ్రతికి వస్తారు. కీడు చేసిన వాళ్ళు నిరంతరం శిక్షింపబడటానికి బ్రతికివస్తారు.
© 1997 Bible League International