Revised Common Lectionary (Semicontinuous)
68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
మనకోసం పంపాడు.
70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
ఈ విషయం చెప్పాడు.
71 దేవుడు శత్రువుల బారినుండి,
మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74 మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75 జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”
సిద్కియా రాజు అభ్యర్థనను దేవుడు తిరస్కరించుట
21 యెహోవా వర్తమానం మళ్లీ యిర్మీయాకు వినిపించింది. అప్పుడు యూదా రాజు సిద్కియా అనేవాడు, రాజు పషూరు[a] అనే వానిని, యాజకుడగు జెఫన్యాను పిలిపించి యిర్మీయా వద్దకు పంపినపుడు రాజుకు ఈ వార్తను వినిపించిరి. పషూరు అనేవాడు మల్కీయా కుమారుడు. జెఫన్యా అనేవాడు మయశేయా అనువాని కుమారుడు. పషూరు, జెఫన్యాలిరువురూ యిర్మీయాకు ఒక వర్తమానం తెచ్చారు. 2 యిర్మీయాతో పషూరు, జెఫన్యాలు ఇలా అన్నారు. “మా కొరకు దేవుని ప్రార్థించుము. మాకు ఏమి జరుగుతుందో యెహోవాను అడిగి తెలుసుకొనుము. బబులోను రాజైన[b] నెబుకద్నెజరు మా మీదికి దండెత్తి వస్తున్నాడు. కనుక ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. గతంలో చేసినట్లు బహుశః యెహోవా మా కొరకు ఘనమైన కార్యాలు జరిపించవచ్చు. బహుశః నెబుకద్నెజరు మామీదికి రాకుండా ఆపి అతనిని యెహోవా వెనుకకు పంపించవచ్చు.”
3 అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా సమాధానమిచ్చినాడు: “రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: 4 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘నీ చేతిలో మారణా యుధాలున్నాయి. నీవా ఆయుధాలను బబులోను రాజు నుండి, కల్దీయుల[c] నుండి నిన్ను రక్షించుకోవటానికి ఉపయోగించనున్నావు. కాని ఆ ఆయుధాలన్నీ నిరుపయోగమయ్యేలా నేను చేస్తాను.
“‘బబులోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణగోడ వెలుపల మూగి ఉంది. ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. త్వరలోనే ఆ సైన్యాన్ని యెరూషలేము లోనికి రప్పిస్తాను. 5 యూదా ప్రజలైన మీతో నేనే యుద్ధం చేస్తాను. శక్తివంతమైన నా చేతితో నేనే మీతో పోరాడతాను. నేను మీ పట్ల మిక్కిలి కోపంగా ఉన్నాను. అందువల్ల నా శక్తివంతమైన చేతితో కఠినంగా నేను మీతో పోరాడతాను. నేను మీతో యుద్ధం చేసి, మీపట్ల నేనెంత కోపంగా వున్నానో తెలియజేస్తాను. 6 యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను చంపుతాను. మనుష్యులతో పాటు పశువులను కూడా చంపుతాను. నగరమంతా వ్యాపించే భయంకరమైన వ్యాధుల ద్వారా వారంతా చనిపోతారు. 7 అదే జరిగిన తరువాత యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “‘అంతేకాదు, సిద్కియా అధికారులను కూడా నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చనిపోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబుకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబుకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపడు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’
8 “యెరూషలేము నగర వాసులకు ఈ విషయాలు కూడా చెప్పండి. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘బతకటమో, చనిపోవటమో అనే విషయాన్ని నేను మీకే వదిలి వేస్తున్నానని అర్థం చేసుకోమనండి! 9 యెరూషలేములో ఉండే వాడెవడైనా చనిపోతాడు! వాడు కత్తివల్లగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధివల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యోరూషలేము నుండి బయటికి పోయి కల్దీయుల సైన్యానికి లొంగిపోతారో వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహారాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు. 10 యెరూషలేము నగరానికి విపత్తు వచ్చేలా చేయటానికి నేను సంకల్పించాను.’” ఇదే యెహోవా వాక్కు “‘బబులోను రాజుకు ఈ యెరూషలేము నగరాన్ని ఇచ్చి వేస్తాను. దీనిని అతడు అగ్నితో తగులబెడతాడు.’”
11 “యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి:
‘యెహోవా వర్తమానాన్ని వినండి!
12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు:
నీవు ప్రతి రోజూ ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి.
నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము.
నీవది చేయకపోతే
నాకు చాలా కోపం వస్తుంది.
నా కోపం ఎవ్వరూ ఆపలేని
దహించు అగ్నిలా ఉంటుంది.
మీరు దుష్ట కార్యాలు చేశారు
గనుక ఇది జరుగుతుంది.’
13 “యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను.
నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు.
నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు.
యెరూషలేము వాసులారా
‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు,
ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.”
కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.
14 “మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు!
మీ అడవుల్లో అగ్ని చెలరేగేలా చేస్తాను.
ఆ అగ్ని మీ చుట్టూ ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.”
యేసు క్రీస్తు మన పాపాలకు బలి
23 అందువల్ల పరలోకంలో ఉన్న వస్తువుల ప్రతిరూపాలను బలి యిచ్చి పరిశుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని, పరలోకంలో ఉన్న వాటిని పవిత్రం చెయ్యటానికి యింకా మంచిరకమైన బలులు కావాలి. 24 భూమ్నీదవున్న ఈ పవిత్ర స్థానం నిజమైన దానికి ప్రతిరూపం మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర స్థానాన్ని కాదు ప్రవేశించింది. ఆయన మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాడు.
25 ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పశువుల రక్తంతో అతి పవిత్ర స్థానాన్ని ప్రవేశించినట్లు, ఆయన తనను తాను పదే పదే బలిగా సమర్పించుకోవటానికి పరలోకానికి వెళ్ళలేదు. 26 అలా అర్పించి ఉంటే ప్రపంచం సృష్టింప బడినప్పటి నుండి క్రీస్తు ఎన్నోసార్లు మరణించ వలసి వచ్చేది. కాని, ప్రస్తుతం యుగాల అంతంలో తనను తాను ఒకే ఒకసారి బలిగా అర్పించుకుని పాపపరిహారం చెయ్యాలని ప్రత్యక్ష్యమయ్యాడు.
27 ప్రతి ఒక్కడూ, ఒక్కసారే మరణించాలి. తర్వాత దేవుని తీర్పుకు గురి అవ్వాలి. వాళ్ళపై తీర్పు చెబుతాడు. 28 అందువల్ల, అనేకుల పాపపరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్ష్యమౌతాడు. పాపం మోయటానికి కాదు తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కలిగించటానికి ప్రత్యక్ష్యమౌతాడు.
© 1997 Bible League International