Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 76

సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.

76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
    దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
    దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
    కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.

దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
    తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
    వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
    బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
    రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
దేవా, నీవు భీకరుడవు.
    నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
    దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
    భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.

11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
    ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
    తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
    భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.

యెషయా 60:17-22

17 “ఇప్పుడు నీకు ఇత్తడి ఉంది.
    నేను నీకు బంగారం తెస్తాను.
ఇప్పుడు నీకు ఇనుము ఉంది,
    నేను నీకు వెండి తెస్తాను.
నీ చెక్కను నేను ఇత్తడిగా మార్చేస్తాను.
    నీ బండలను ఇనుముగా నేను మార్చేస్తాను.
నీ శిక్షను నేను శాంతిగా మార్చేస్తాను.
ఇప్పుడు ప్రజలు నిన్ను బాధిస్తున్నారు.
    కానీ ప్రజలు నీకు మంచి కార్యాలు చేస్తారు.
18 ప్రజలు మరల ఎన్నడూ నీ ఎడల నీచంగా ఉండరు.
నీ దేశంలో నీ దగ్గర్నుండి
    ప్రజలు మరల ఎన్నడూ దొంగిలించరు.
‘రక్షణ’ అని నీ గోడలకు నీవు పేరుపెడతావు.
    ‘స్తుతి’ అని నీ ద్వారాలకు నీవు పేరుపెడతావు.

19 “ఇంకెంత మాత్రం పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు.
    చంద్రకాంతి ఇంకెంత మాత్రం నీకు వెలుగుగా ఉండదు. ఎందుకు?
ఎందుకంటే యెహోవాయే నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు.
    నీ దేవుడే నీ మహిమ.
20 నీ ‘సూర్యుడు’ ఇక ఎన్నటికీ అస్తమించడు.
    నీ ‘చంద్రుడు’ ఇక ఎన్నటికీ చీకటిగా ఉండడు. ఎందుకు?
ఎందుకంటే యెహోవా నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు.
    మరియు నీ దుఃఖకాలం అంతం అవుతుంది.

21 “నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు.
    ఆ ప్రజలు భూమిని శాశ్వతంగా పొందుతారు.
నేనే ఆ ప్రజలను చేశాను.
    నా స్వహస్తాలతో నేనే చేసిన అద్భుతమైన మొక్క వారు.
22 అతి చిన్న కుటుంబం ఒక పెద్ద వంశం అవుతుంది.
    కడసారపు వ్యక్తి ఒక బలమైన రాజ్యం అవుతాడు.
సమయం సరిగ్గా ఉన్నప్పుడు,
    యెహోవానను నేను త్వరగా వస్తాను.
    నేను ఈ సంగతులను జరిగిస్తాను.”

ఎఫెసీయులకు 4:25-5:2

25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. 26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. 27 సాతానుకు అవకాశమివ్వకండి. 28 దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు.

29 దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్నవాళ్ళకు లాభం కలగాలి. 30 మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 31 మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. 32 దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.

మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International