Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 142

దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.

142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
    యెహోవాను నేను ప్రార్థిస్తాను.
నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
    నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
    నా ప్రాణం నాలో మునిగిపోయింది.
    అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.

నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
    పారిపోవుటకు నాకు స్థలం లేదు.
    నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
    యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
    యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
యెహోవా, నా ప్రార్థన విను.
    నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
    యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
    నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.

హబక్కూకు 3:1-16

హబక్కూకు ప్రార్థన

ప్రవక్తయైన హబక్కూకు చేసిన షిగియొనొతు ప్రార్థన.[a]

యెహోవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను.
    యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను.
అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను.
    ఆ పనులు మాకాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను.
కాని నీ ఆవేశంలో (ఉద్రేకం) మా పట్ల కరుణ చూపటం గుర్తుపెట్టుకొనుము.

దేవుడు తేమానులోనుండి వస్తున్నాడు.
    పరిశుద్ధుడు పారాను పర్వతం[b] మీది నుండి వస్తున్నాడు.

యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పి వేసింది!
    ఆయన ప్రభావంతో భూమి నిండి పోయింది!
అది ప్రకాశమానమై మెరుస్తున్న వెలుగు. ఆయన చేతినుండి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి.
    అట్టి మహత్తర శక్తి ఆయన చేతిలో దాగివుంది.
వ్యాధి ఆయనకు ముందుగా వెళ్లింది.
    ఆయన వెనుక వినాశకారి అనుసరించి వెళ్లింది.
యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు.
    ఆయన అన్ని దేశాల ప్రజలవైవు చూశాడు.
    వారు భయంతో వణికి పోయారు.
అనాదిగా పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి.
    కాని ఆ పర్వతాలు బద్దలై పోయాయి.
చాల పాత కొండలు పడిపోయాయి.
    దేవుడు ఎల్లప్పుడూ అలానే ఉంటాడు!

కుషాను (కూషీయుల) నగరాలలో ఆపద సంభవించటం నేను చూశాను.
    మిద్యాను దేశీయుల ఇండ్లు భయంతో కంపించాయి.
యెహోవా, నీవు నదులపట్ల కోపంగా ఉన్నావా?
    వాగులపట్ల నీవు కోపంగా ఉన్నావా? సముద్రంపట్ల నీవు కోపంగా ఉన్నావా?
నీవు నీ గుర్రాలను,
    రథాలను విజయానికి నడిపించినప్పుడు నీవు కోపంగా ఉన్నావా?

అప్పుడుకూడ నీ రంగుల కాంతిపుంజాన్ని (ఇంద్ర ధనుస్సును) నీవు చూపించావు. భూవాసులతో
    నీవు చేసుకున్న ఒడంబడికకు అది నిదర్శనం.

ఎండు భూమి నదులను విభజించింది.
10     పర్వతాలు నిన్ను చూచి వణికాయి.
నీరు నేల విడిచి పారుతున్నది. సముద్రపు నీటికి పట్టు తప్పినందున అది పెద్దగా ధ్వని చేసింది.
11 సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి.
    నీ దేదీప్యమానమైన మెరుపు కాంతులు చూడగానే అవి ప్రకాశించటం మానివేశాయి.
    ఆ మెరుపులు గాలిలో దూసుకుపోయే ఈటెలు, బాణాలవలె ఉన్నాయి.
12 నీవు కోపంతో భూమిపై నడిచి
    దేశాలను శిక్షించావు.
13 నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు.
    అభిషేకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి నీవు వచ్చావు.
ప్రతి చెడ్డ కుటుంబంలోనూ మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు.
    ఆ కుటుంబం దేశంలో అతి తక్కువదా,
    లేక అతి గొప్పదా అనే విభేదం నీవు చూపలేదు.

14 శత్రు సైనికులను ఆపటానికి నీవు
    మోషే చేతి కర్రను ఉపయోగించావు.
ఆ సైనికులు మామీద యుద్ధానికి
    పెనుతుఫానులా వచ్చారు.
రహస్యంగా ఒక పేదవాణ్ణి దోచుకున్నట్టు,
    వారు మమ్మల్ని తేలికగా ఓడించవచ్చనుకున్నారు.
15 కాని నీవు నీ గుర్రాలతో సముద్రంగుండా నడిచావు.
    ఆ మహా జలరాశిని దూరంగా దొర్లిపోయేలా చేశావు.
16 నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది.
    పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు అదిరాయి.
నా ఎముకలు బలహీనమయ్యాయి.
    నా కాళ్లు వణికాయి.
కావున ఆ వినాశన దినం వచ్చేవరకు ఓపికగా వేచి ఉంటాను.
    మామీద దాడి చేసేవారికి ఆ విపత్కర దినం వస్తోంది.

యూదా 5-21

మీకీ విషయాలన్నీ తెలుసు. అయినా కొన్ని విషయాలు జ్ఞాపకం చెయ్యాలని అనుకొంటున్నాను. ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉండిన తన ప్రజలకు, ప్రభువు స్వేచ్ఛ కలిగించాడు. కాని ఆ తర్వాత వాళ్ళలో విశ్వాసం లేని వాళ్ళను నాశనం చేసాడు. తమ తమ స్థానాలను, అధికారాలను వదిలిన దేవదూతలను దేవుడు చిరకాలపు సంకెళ్ళతో అంధకారంలో బంధించి ఉంచాడు. చివరి రోజుదాకా అదేవిధంగా బంధించి ఉంచుతాడు. సొదొమ, గొమొఱ్ఱా పట్టణాల ప్రజలు, వాటి పరిసర పట్టణాల్లోని ప్రజలు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక సహవాసాలకు లోనైపొయ్యారు. అందువల్ల వాళ్ళు శాశ్వతమైన మంటల్లో శిక్షననుభవించారు. తద్వారా ఈ సంఘటన కూడా ఇతరులకు నిదర్శనంగా నిలిచిపోయింది.

వాళ్ళలాగే కలలుగనే ఈ దుర్బోధకులు తమ శరీరాల్ని మలినం చేసికొంటూ, అధికారాన్ని ఎదిరిస్తూ, దేవదూతల్ని దూషిస్తూ ఉంటారు. కాని ప్రధాన దేవదూత అయిన మిఖాయేలు కూడా తాను మోషే దేహం విషయంలో వాదించినప్పుడు సాతాన్ని నిందించలేదు. వాణ్ణి దూషించ లేదు. అతడంత ధైర్యం చెయ్యలేకపొయ్యాడు. సాతానుతో, “ప్రభువు నిన్ను గద్దిస్తాడు” అని మాత్రం అన్నాడు.

10 ఈ దుర్బోధకులు తమకర్థం కాని విషయాన్ని గురించి దూషిస్తూ మాట్లాడుతారు. తెలివిలేక లౌకికంగా అర్థం చేసికొంటారు. పశువుల్లా వీటి ద్వారా నశించిపోతారు. 11 వీళ్ళు కయీను మార్గాన్ని అనుసరించారు. లాభం కోసం బిలాము చేసిన తప్పునే చేసారు. కోరహు వలె తిరుగుబాటు చేసి అతనిలాగే నశించిపొయ్యారు. వీళ్ళకు శ్రమ కలుగుగాక!

12 వీళ్ళు మీరు చేసే సమాజ విందుల్లో ఏ మాత్రం సిగ్గు లేకుండా పాల్గొంటారు. తమ కడుపులు బాగా నింపుకొంటారు. గాలికి ఎగిరే నీళ్ళులేని మేఘాల్లాంటి, ఫలమివ్వని ఎండిన వృక్షంలాంటివాళ్ళు. వ్రేళ్ళు పెకిలింపబడి రెండు సార్లు చనిపోయిన వృక్షంలాంటివాళ్ళు. 13 అవమానమనే నురుగు కక్కే సముద్రపు కెరటాల్లాంటివాళ్ళు. ఆకాశంలో గతితప్పి తిరిగే నక్షత్రాల్లాంటివాళ్ళు. వారి కోసం దేవుడు గాఢాంధకారాన్ని శాశ్వతంగా దాచి ఉంచాడు.

14 ఆదాము తర్వాత ఏడవ వాడైన హనోకు వీళ్ళను గురించి ఈ విధంగా ప్రవచించాడు: “అదిగో! ప్రభువు వేలకొలది పరిశుద్ధులతో కలిసి వస్తున్నాడు. 15 వచ్చి అందరిపై తీర్పు చెపుతాడు. దుర్మార్గపు పనులు చేసే అవిశ్వాసుల్ని, తమకు వ్యతిరేకంగా చెడు మాట్లాడే పాపుల్ని శిక్షిస్తాడు.”

16 ఈ దుర్బోధకులు సణుగుతూ తప్పులెంచుతూ ఉంటారు. తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ, ప్రగల్భాలు చెప్పుకొంటూ తమ లాభం కోసం ఇతర్లను పొగుడుతూ ఉంటారు.

హెచ్చరికలు, ఉపదేశాలు.

17 కాని ప్రియ మిత్రులారా! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. 18 “చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించేవాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ వస్తారు” అని అపొస్తలులు చెప్పారు. 19 వాళ్ళు ప్రస్తావించిన ఈ దుర్బోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్బోధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఉండదు.

20 కాని ప్రియ మిత్రులారా! మీలో ఉన్న విశ్వాసం అతి పవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి. పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి. 21 దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచుకొని ఉండండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International