Revised Common Lectionary (Semicontinuous)
దేవునికి ఒక స్తుతిపాట
12 ఆ సమయంలో మీరంటారు:
“యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
నీకు నామీద కోపం వచ్చింది.
కానీ ఇప్పుడు నామీద కోపగించకుము.
నీ ప్రేమ నాకు చూపించు.”
2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు.
యెహోవా, యెహోవాయే నా బలం.[a]
ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి.
అప్పుడు మీరు సంతోషిస్తారు.
4 “యెహోవాకు స్తోత్రాలు!
ఆయన నామం ఆరాధించండి!
ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి”
అని అప్పుడు మీరు అంటారు.
5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి.
ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక.
దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి.
పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు.
అందుచేత, సంతోషంగా ఉండండి!
15 సత్యం పోయింది.
మంచి జరిగించాలనుకొనే మనుష్యులు దోచుకోబడ్డారు.
యెహోవా చూశాడు, కానీ మంచితనం ఏమీ ఆయనకు కనబడలేదు. ఇది
యెహోవాకు ఇష్టం కాలేదు.
16 యెహోవా చూశాడు.
నిలిచి, ప్రజలకు సహాయం చేసే వ్యక్తి ఒక్కడూ ఆయనకు కనిపించలేదు.
కనుక యెహోవా తన స్వంత శక్తి, తన స్వంత మంచితనం ప్రయోగించాడు.
మరియు యెహోవా ప్రజలను రక్షించాడు.
17 యెహోవా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
యెహోవా మంచితనాన్ని ఒక కవచంలా కప్పుకొన్నాడు.
రక్షణ శిరస్త్రాణం ధరించాడు.
శిక్షను వస్త్రాలుగా ధరించాడు.
బలీయమైన ప్రేమ అంగీ ధరించాడు.
18 యెహోవా తన శత్రువుల మీద కోపంగా ఉన్నాడు
కనుక వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
యెహోవా తన శత్రువులమీద కోపంగా ఉన్నాడు.
కనుక దూరస్థలాలు అన్నింటిలోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
19 అప్పుడు పశ్చిమాన ప్రజలు యెహోవా నామాన్ని గౌరవిస్తారు. తూర్పున ప్రజలు యెహోవా మహిమను గూర్చి భయపడతారు.
వేగంగా ప్రవహించే ఒక నదిలా యెహోవా వెంటనే వస్తాడు.
యెహోవా ఈ నదిమీద విసరగా వచ్చిన శక్తివంతమైన గాలిలా అది ఉంటుంది.
20 అప్పుడు సీయోనుకు ఒక రక్షకుడు వస్తాడు.
పాపం చేసినప్పటికి, తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన యాకోబు ప్రజల దగ్గరకు ఆయన వస్తాడు.
21 “ఆ ప్రజలతో నేను ఒక ఒడంబడిక చేసుకుంటాను. నీ నోట నేను ఉంచే నా ఆత్మ, నా మాటలు నిన్ను ఎన్నడూ విడిచిపోవు అని నేను ప్రమాణం చేస్తున్నాను. నీ పిల్లలతోను, నీ పిల్లల పిల్లలతోను అవి ఉంటాయి. అవి ఇప్పుడు, ఎల్లప్పుడు నీతో ఉంటాయి” అని యెహోవా చెబుతున్నాడు.
దేవుని రాజ్యం రావటం
(మత్తయి 24:23-28, 37-41)
20 కొందరు పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని అడిగారు.
యేసు, “దేవుని రాజ్యం అందరికి కనిపించేలా రాదు. 21 ‘ఇదిగో, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది; అదిగో అక్కడ ఉంది’ అని ఎవరూ అనరు. ఎందుకంటే దేవుని రాజ్యం మీలో ఉంది!” అని సమాధానం చెప్పాడు.
22 ఆ తర్వాత, తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మీతో ఒక్క రోజన్నా ఉండాలని మీరు తహతహలాడే సమయం వస్తుంది. కాని అలా జరగదు. 23 ప్రజలు, ‘అదిగో అక్కడ ఉన్నాడని’ కాని, లేక ‘ఇదిగో ఇక్కడున్నాడని’ కాని అంటే వాళ్ళ వెంట పరుగెత్తి వెళ్ళకండి.
24 “ఎందుకంటే మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో ఈ చివరినుండి ఆ చివరి దాకా మెరిసే మెరుపులా ఉంటాడు. 25 కాని దానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం వాళ్ళతో తృణీకరింపబడాలి.
26 “నోవహు కాలంలో జరిగిన విధంగా మనుష్యకుమారుని కాలంలో కూడా జరుగుతుంది. 27 నోవహు నావలో ప్రవేశించేదాకా ప్రజలు తింటూ, త్రాగుతూ, వివాహాలు చేస్తూ, వివాహాలు చేసుకొంటూ గడిపారు. అతడు నావలో ప్రవేశించాక వరదలు రాగా మిగిలిన వాళ్ళందరూ నాశనమయ్యారు.
28 “లోతు కాలంలో కూడా అదేవిధంగా జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, అమ్ముతూ, కొంటూ, పొలాలు సాగుచేస్తూ, ఇళ్ళు కడుతూ జీవించారు. 29 కాని లోతు సొదొమ పట్టణం వదిలి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి మంటలు, గంధకము వర్షంలా కురిసి అందర్ని నాశనం చేసింది. 30 మనుష్యకుమారుణ్ణి దేవుడు వ్యక్తం చేసిన రోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది.
31 “ఆ రోజు ఇంటి కప్పు మీదనున్న వాళ్ళు తమ వస్తువులు తెచ్చుకోవటానికి ఇళ్ళలోకి వెళ్ళరాదు. అదే విధంగా పొలాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్తువు కోసం ఇంటికి తిరిగి వెళ్ళరాదు. 32 లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకొండి.
33 “తన ప్రాణాన్ని కాపాడు కోవాలనుకొన్నవాడు పోగొట్టుకొంటాడు. ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్దంగా ఉన్నవాడు తన ప్రాణం కాపాడుకొంటాడు. 34 ఆ రాత్రి ఒక పడక మీద ఇద్దరు నిద్రిస్తూ ఉంటే ఒకడు వదిలి వేయబడి మరొకడు తీసుకొని వెళ్ళబడతాడు. 35 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒకామె తీసుకు వెళ్ళబడుతుంది, మరొకామె వదిలి వేయబడుతుంది” అని అన్నాడు. 36 [a]
37 “ఇవి ఎక్కడ సంభవిస్తాయి ప్రభూ!” అని వాళ్ళు అడిగారు.
ఆయన, “ఎక్కడ శవముంటే అక్కడ రాబందులుంటాయి” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International