Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 74

ఆసాపు ధ్యాన గీతం.

74 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?
    నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.
    నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం.
నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము.
దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.
    శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.

శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.
    యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను
    నరికే మనుష్యుల్లా ఉన్నారు.
ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,
    నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.
    వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు.
    ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది.
శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.
    దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.
    ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు.
    ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?
    నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు?
    నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు.
    నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
14 మకరపు తలను నీవు చితుకగొట్టావు.
    దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.
    మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.
    సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.
    వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో.
    ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని[a] తీసుకోనివ్వకుము.
    నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము.
20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము.
    ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.
    వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము.
    నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
22 దేవా, లేచి పోరాడుము.
    ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము.
23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.
    ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.

యెషయా 5:24-30

24 ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. గడ్డి, ఆకులు అగ్నితో కాల్చివేయబడినట్టు, వారి సంతతివారు పూర్తిగా నాశనం చేయబడతారు. చచ్చి, ధూళిగా తయారయ్యే వేరులా వారి సంతానంవారు పూర్తిగా నాశనం చేయబడతారు. అగ్ని నాశనం చేసిన ఒక పువ్వులా వారి సంతతివారు నాశనం చేయబడతారు. దాని బూడిద గాలితో కొట్టుకొని పోతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ఉపదేశాలకు విధేయులయ్యేందుకు వారు నిరాకరించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) సందేశాన్ని ఆ ప్రజలు అసహ్యించుకొన్నారు. 25 అందుచేత యెహోవా తన ప్రజల మీద చాలా కోపగించాడు. యెహోవా తన చేయి పైకెత్తి, వాళ్లను శిక్షిస్తాడు. పర్వతాలు సహా భయపడి పోతాయి. చచ్చిన శవాలు చెత్తలా వీధుల్లో పడి ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన హస్తం ఇంకా పైకెత్తబడిఉంటుంది.

ఇశ్రాయేలును శిక్షించటానికి దేవుడు సైన్యాలను రప్పిస్తాడు

26 చూడండి! చాలా దూరంలో ఉన్న దేశాలకు దేవుడు ఒక సంకేతం ఇస్తున్నాడు. దేవుడు ఒక పతాకాన్ని ఎగుర వేస్తున్నాడు, మరియు ఆ ప్రజలను పిలిచేందుకు ఆయన ఈల వేస్తున్నాడు.

శత్రువు దూరదేశం నుండి వస్తున్నాడు. త్వరలోనే శత్రువు దేశంలో ప్రవేశిస్తాడు. వారు చాలా వేగంగా కదలుతున్నారు. 27 శత్రువు ఎన్నటికీ అలసిపోడు, పడిపోడు. వారెన్నటికీ నిద్రబోతులుగా నిద్రపోరు. వారి ఆయుధ పట్టాలు ఎల్లప్పుడూ సిద్దమే. వారి చెప్పుల తాళ్లు ఎప్పటికి తెగిపోవు. 28 శత్రువుల బాణాలు చాలా పదునుగా ఉంటాయి. వారి బాణాలన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉంటాయి. గుర్రాల డెక్కలు బండలా గట్టిగా ఉంటాయి. వాటి రథాల వెనుక ధూళి మేఘాలుగా లేస్తుంది.

29 శత్రువు గట్టిగా అరిస్తే, అది సింహగర్జనలా ఉంటుంది. అది కొదమ సింహపు గర్జన అంత గట్టిగా ఉంటుంది. శత్రువు తాను పోరాడుతున్న ప్రజలను ఎదురులేకుండా పట్టి లాగుకొని పోతాడు. ప్రజలు కొట్టుమిట్టాడి, తప్పించుకొనేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లను రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. 30 కనుక “సింహం” గట్టిగా సముద్ర ఘోషలా గర్జిస్తుంది. బంధించబడిన ప్రజలు నేలమీదికే చూస్తుంటారు, అప్పుడు చీకటి మాత్రమే ఉంటుంది. దట్టమైన ఈ మేఘంలో వెలుగంతా చీకటిగానే ఉంటుంది.

అపొస్తలుల కార్యములు 7:44-53

44 “మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడక ముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించుమని ఆజ్ఞాపించాడు. 45 ఆ తర్వాత ఇది మన పూర్వికులకు లభించింది. వాళ్ళు యెహోషువ నాయకత్వాన, దేవుడు పారద్రోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ళ దగ్గరే ఉంది. దావీదు కాలందాకా అది ఆ దేశంలో ఉంది. 46 దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీయుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం యివ్వుమని దేవున్ని కోరాడు. 47 అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు.

48 “కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త యిలా అన్నాడు:

49 ‘ఆకాశం నా సింహాసనం!
    భూమి నా పాదపీఠం!
నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు?
    విశ్రాంతికి నాకు స్థలం ఏది?
50 ఇవన్నీ నిర్మించింది నేనే కాదా?’ అని ప్రభువన్నాడు.”(A)

51 స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కానివాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవసందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. 52 మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పినవాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు. 53 దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International