Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 1:1

ఆమోజు కుమారుడు యెషయా దర్శనం ఇది. యూదాకు, యెరూషలేముకు సంభవించే సంగతులను దేవుడు యెషయాకు చూపించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదాకు రాజులుగా ఉన్న కాలవ్యవధిలో ఈ సంగతులను యెషయా చూశాడు.

యెషయా 1:10-20

10 సొదొమ నాయకులారా, యెహోవా సందేశం వినండి. గొమొర్రా ప్రజలారా, దేవుని ఉపదేశాలు వినండి. 11 దేవుడు అంటున్నాడు: “ఇంకా ఎందుకు మీరు నాకు బలులు అర్పిస్తూనే ఉన్నారు? మీ మేకల బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు వెక్కసం అయ్యాయి. 12 మీరు నన్ను కలుసుకొనేందుకు వచ్చినప్పుడు, నా ఆవరణం అంతా తిరుగుతారు. మిమ్మల్ని ఇలా చేయమన్నది ఎవరు?

13 “నా కోసం పనికిమాలిన బలులు ఇక మీదట తీసుకొని రావద్దు. మీరు నాకు అర్పించే ధూపం నాకు అసహ్యం మీ అమావాస్య, సబ్బాతు, పవిత్ర రోజుల పండుగలను నేను సహించను. మీ పరిశుద్ధ సమావేశాలలో మీరు చేసేది నాకు అసహ్యం. 14 మీ నెలసరి సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. ఈ సమావేశాలు నాకు చాలా బరువులా తయారయ్యాయి. ఆ బరువులు మోయటం నాకు విసుగు.

15 “మీరు నన్ను ప్రార్థించాలని మీ చేతులు పైకి ఎత్తుతారు కానీ నేను మిమ్మల్ని చూడటానికి కూడా ఒప్పుకోను. మీరు మరిన్ని ప్రార్థనలు చేస్తారు కాని నేను మీ ప్రార్థనలు వినేందుకు ఒప్పుకోను. ఎందుకంటే మీ చేతులు రక్తమయము.

16 “మిమ్మల్ని మీరు కడుక్కోండి. మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకోండి. మీరు చేస్తున్న చెడు పనులు చాలించండి. ఆ చెడు పనులు చూడటం నాకు ఇష్టం లేదు. తప్పు చేయటం మానివేయండి. 17 మంచి పనులు చేయటం నేర్చుకోండి. ఇతరుల విషయంలో న్యాయంగా ఉండండి. ఇతరులను బాధించే వారిని శిక్షించండి. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయండి. భర్తలు చనిపోయిన స్త్రీలకు సహాయం చేయండి.”

18 యెహోవా చెబుతున్నాడు, “రండి, ఈ విషయాలు మనం పరిష్కరించుకొందాము. మీ పాపాలు కెంపులాగా ఎర్రగా ఉన్నా సరే వాటిని కడగవచ్చు, మీరు మంచులా తెల్లగా అవుతారు. మీ పాపాలు చాలా ఎర్రగా ఉన్నా సరే మీరు మాత్రం ఉన్నిలాగ తెల్లగా మారవచ్చును.

19 “నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు ఈ దేశపు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. 20 కానీ మీరు వినేందుకు నిరాకరిస్తే, మీరు నాకు వ్యతిరేకమే. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేసేస్తారు.”

యెహోవా తానే ఈ విషయాలు చెప్పాడు.

కీర్తనలు. 50:1-8

ఆసాపు కీర్తనలలో ఒకటి.

50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
    సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
    ఆయన యెదుట అగ్ని మండుతుంది.
    ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
    క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
“నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
    వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.

అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
    ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.

దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
    నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.

కీర్తనలు. 50:22-23

22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
    దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
    అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
    నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”

హెబ్రీయులకు 11:1-3

విశ్వాసము

11 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం. మన పూర్వికుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.

దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే, కనిపించనివాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.

హెబ్రీయులకు 11:8-16

అబ్రాహాములో విశ్వాసముంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి, తానెక్కడికి వెళ్తున్నది తనకు తెలియక పోయినా విధేయతతో వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడతనికి ఆ దేశాన్ని అతని పేరిట యిచ్చాడు. విశ్వాసముంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశీయునిగా నివసించాడు. దేవుడు వాగ్దానం చేసినవాటిల్లో తనతో సహవారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో నివసించాడు. 10 దేవుడు తన నమూన ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉండేవాడు.

11 శారా వృద్ధురాలు, పైగా గొడ్రాలు. అబ్రాహాము వృద్ధుడయినా, దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించినందువల్ల అబ్రాహాము తండ్రి కాగలిగాడు. 12 చనిపోవటానికి సిద్ధంగా ఉన్న అబ్రాహాముకు ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా, సముద్ర తీరానవుండే యిసుక రేణువల్లా లెక్కలేనంత మంది వారసులు కలిగారు.

13 వీళ్ళందరు దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి, మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. వాళ్ళు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వానించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవిస్తున్నట్లు వాళ్ళు అంగీకరించారు. 14 వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకుతూండేవాళ్ళని అనిపిస్తుంది. 15 ఒక వేళ వాళ్ళు తాము వదిలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది. 16 కాని వాళ్ళు యింకా గొప్ప దేశానికి, అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు యితర్లు తనను “వాళ్ళ దేవుడు” అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణం నిర్మించాడు.

లూకా 12:32-40

ధనమును నమ్ముకొనవద్దు

32 “మీరు అమాయకమైన చిన్న మందలాంటి వాళ్ళు. కాని భయపడకండి. మీ తండ్రి తన రాజ్యాన్ని మీకు ఆనందంగా ఇస్తాడు. 33 మీ ఆస్థి అమ్మి పేదవాళ్ళకు దానం చెయ్యండి. పాతబడని డబ్బుల సంచి సిద్దం చేసుకోండి. మీ ధనాన్ని పరలోకంలో దాచండి. అక్కడ అది తరగదు. దొంగలు దాన్ని ముట్టలేరు. ఆ సంపదకు చెదలు పట్టవు. 34 మీ ధనమున్న చోటే మీ మనస్సు కూడా ఉంటుంది.

సిద్దంగా ఉండండి

(మత్తయి 24:42-44)

35 “మీ నడికట్టుతో నడుముకు చుట్టి, దీపాలు వెలిగించి సిద్దంగా ఉండండి. 36 పెళ్ళి విందుకు వెళ్ళి యింటికి వస్తున్న యజమాని కోసం కాచుకొని ఉండే సేవకుల్లా ఉండండి. అలా చేస్తే యజమాని వచ్చి తలుపు తట్టిన వెంటనే అతనికోసం మీరు తలుపు తీయకలుగుతారు. 37 యజమాని వచ్చినప్పుడు మెలుకువతో ఉన్న సేవకులు ధన్యులు. ఇది నిజం. యజమాని వచ్చి తానే నడుము బిగించుకొని స్వయంగా సేవ చేస్తాడు. సేవకుల్ని కూర్చోబెట్టి వాళ్ళకు వడ్డించటానికి సిద్ధమౌతాడు. 38 అతడు ఏ అర్థరాత్రికో లేక తెల్లవారుఝామునో వచ్చినప్పుడు అతని కోసం సిద్దంగావున్న సేవకులు ధన్యులు. వాళ్ళకు శుభం కలుగుతుంది.

39 “కాని యిది అర్థంచేసుకోండి. దొంగ ఏ ఘడియలో వస్తాడో యింటి యజమానికి తెలిస్తే అతడు తన యింట్లోకి దొంగల్ని రానివ్వడు. 40 మీరు కూడా సిద్ధంగా వుండండి. ఎందుకంటే మనుష్య కుమారుడు మీరు అనుకోని సమయంలో వస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International