Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
11 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు?
“పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!
2 వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు.
వారి బాణాలను వారు గురి చూస్తారు.
మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
3 నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది?
అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?
4 యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు.
యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు.
మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు.
మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశితంగా చూస్తాయి.
5 యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు.
కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
6 వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు.
ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
7 అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు.
మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.
దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు
24 చూడండి, యెహోవా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. దేశంలోంచి పూర్తిగా సమస్తం యెహోవా శుద్ధి చేస్తాడు. యెహోవా ప్రజలను బలవంతంగా దూరం వెళ్లగొడతాడు. 2 ఆ కాలంలో సామాన్య ప్రజలు యాజకులు ఒక్కటే, బానిసలు, యజమానులు ఒక్కటే. ఆడ బానిసలు, యజమానురాండ్రు ఒక్కటే. అమ్మేవారు కొనేవారు ఒక్కటే. అప్పు ఇచ్చే వాళ్లు, పుచ్చుకొనే వాళ్లు ఒక్కటే. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీకి తీసుకొనేవారు ఒక్కటే. 3 ప్రజలంతా దేశంలో నుండి వెళ్లగొట్టబడతారు. సంపద దోచుకోబడుతుంది. యెహోవా ఆదేశించాడు గనుక ఇది జరుగుతుంది. 4 దేశం ఖాళీగా దుఃఖంగా ఉంటుంది. ప్రపంచం ఖాళీగా బలహీనంగా ఉంటుంది. ఈ దేశంలోని గొప్ప ప్రజానాయకులు బలహీనులు అవుతారు.
5 దేశంలోని ప్రజలు దేశాన్ని మైల చేసారు. ఇది ఎలా జరిగింది? ప్రజలు దేవుని ఉపదేశాలకు విరోధంగా తప్పుడు పనులు చేశారు. దేవుని చట్టాలకు ప్రజలు విధేయులు కాలేదు. ప్రజలు చాలాకాలం క్రిందట దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నారు. కానీ ఆ ప్రజలే దేవునితో గల ఒడంబడికను ఉల్లంఘించారు. 6 ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలు తప్పుచేసిన అపరాధులు. అందుచేత దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు. ప్రజలు శిక్షించబడతారు. కొద్దిమంది ప్రజలు మాత్రమే బ్రతుకుతారు.
7 ద్రాక్షవల్లులు చస్తున్నాయి. క్రొత్త ద్రాక్షరసం చెడి పోయింది. గతంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలు విచారంగా ఉన్నారు. 8 ప్రజలు వారి ఆనందం ప్రదర్శించటం మానివేశారు. ఆనంద ధ్వనులన్నీ ఆగిపోయాయి. సితారా, మృదంగ సంగీత సంతోషం సమసిపోయింది. 9 ప్రజలు వారి ద్రాక్షమద్యం తాగేటప్పుడు సంతోషంగా పాటలు పాడారు. మద్యం తాగేవాడికి దాని రుచి ఇప్పుడు చేదుగా ఉంది.
10 “పూర్తి గందరగోళం” అనేది ఈ పట్టణానికి సరిపోయే మంచి పేరు. పట్టణం నాశనం చేయబడింది. ప్రజలు ఇళ్లలో ప్రవేశించలేరు. ద్వారాలు బంధించబడ్డాయి. 11 ప్రజలు ఇంకా బజారుల్లో ద్రాక్షమద్యం కోసం అడుగుతున్నారు. కానీ సంతోషం అంతా పోయింది. ఆనందం దూరంగా తీసుకుపోబడింది. 12 పట్టణానికి నాశనం మాత్రమే మిగిలింది. చివరికి తలుపులు కూడా చితుక గొట్టబడ్డాయి.
13 కోతకాలంలో ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు.
కానీ చెట్లకు కొన్ని ఒలీవ పండ్లే మిగిలి ఉన్నాయి.
రాజ్యాల మధ్య ఈ దేశానికి కూడ అలానే ఉంటుంది.
17-18 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది(A) అని యింతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు. 19 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.
20 ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకోబును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు. 21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు.
22 యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్ళకు చెప్పాడు.
23 మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు.
24 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. 25 పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు. 26 అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు.
27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది. 28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.
© 1997 Bible League International