Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 60

సంగీత నాయకునికి: “ఒప్పందపు లిల్లి పుష్పం” రాగం. దావీదు అనుపదగీతం. ఉపదేశించదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను, అరమోజబాయీలతోను యుద్ధం చేయగా యోవాబు ఉప్పు లోయలో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పటిది.

60 దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు.
    నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు.
    దయచేసి మమ్ములను ఉద్ధరించుము.
భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు.
    మా ప్రపంచం పగిలిపోతోంది.
    దయచేసి దాన్ని బాగు చేయుము.
నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు.
    త్రాగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము.
నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను
    స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.

నీ మహాశక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు,
    నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.

దేవుడు తన ఆలయంలో నుండి[a] మాట్లాడుతున్నాడు.
    “నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను.
    నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను.
    షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.
    గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము.
    యూదా నా రాజదండము.
    మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను.
    ఎదోము నా చెప్పులు మోసే బానిసగా ఉంటుంది. ఫిలిష్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”

బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు?
    ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?
10 దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు.
    కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.
11 దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము.
    మనుష్యులు మాకు సహాయం చేయలేరు.
12 కాని దేవుని సహాయంతో మేము జయించగలం.
    దేవుడు మా శత్రువులను ఓడించగలడు.

హోషేయ 11:12-12:14

12 “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టుముట్టాడు.
    ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు!
కాని, యూదా యింకా ఎల్‌-తోనే[a] నడుస్తున్నాడు.
    యూదా అపవిత్రులకు నమ్మకస్తుడుగా ఉన్నాడు.”

యెహోవా ఇశ్రాయేలుకు విరోధి

12 “ఎఫ్రాయిమువాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు రోజంతా ‘గాలిని తరుముతున్నారు.’ వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.”

యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకుగాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి. యాకోబు ఇంకా తన తల్లి కడుపులో ఉండగానే తన సోదరుణ్ణి మోసగించ నారంభించాడు. యాకోబు బలిష్ఠుడైన యువకుడు. అప్పట్లో అతను దేవునితో పోరాడాడు. యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుణ్ణి ఒక సహాయం చేయమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు. ఔను, యెహోవాయే సర్వసేనాధిపతియైన దేవుడు. ఆయన పేరు యెహోవా (ప్రభువు). అందుకని, మీరు మీ దేవుని వద్దకు తిరిగి రండి. ఆయనకు విధేయులుగా ఉండండి. దయగలవారిగా నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి.

“యాకోబు ఒక వ్యాపారస్థుడు. అతను తన మిత్రుణ్ణి కూడా మోసగిస్తాడు. అతని తక్కెడలు[b] కూడా సరైనవి కావు. ఎఫ్రాయిము ఇలా అనుకున్నాడు: ‘నేను ఐశ్వర్యవంతుణ్ణి! నాకు ధనరాశులు దొరికాయి. నా నేరాల సంగతి ఎవడూ తెలుసుకోడు. నా పాపాల గురించి ఎవడూ తెలుసుకోడు.’

“మీరు ఈజిప్టు దేశంలో ఉన్ననాటినుంచి యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. గుడార సమావేశ[c] కాలంలో మాదిరిగా నేను మిమ్మల్ని గుడారాల్లో నివసింపజేస్తాను. 10 నేను ప్రవక్తలతో మాట్లాడాను. నేను వాళ్లకి అనేక దర్శనాలు ఇచ్చాను. నేను పద్ధతులను సూచించాను. 11 కాని, గిల్గాదు ప్రజలు పాపులు. అక్కడ అనేక క్షుద్ర దేవతా విగ్రహాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు గిల్గాలువద్ద ఎడ్లను బలులుగా ఇస్తారు. వాళ్లకి బలిపీఠాలు అనేకం ఉన్నాయి. దున్నిన పొలంలో బురద చాళ్లు ఉన్నట్లే వాళ్లకి బారులు బారులుగా బలిపీఠాలు ఉన్నాయి.

12 “యాకోబు అరాము దేశంలోకి పారిపోయాడు. అక్కడ, ఇశ్రాయేలు ఒక భార్యకోసం శ్రమపడ్డాడు. మరో భార్యకోసం గొఱ్ఱెల్ని మేపాడు. 13 కాని, యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఈజిప్టునుంచి వెనక్కి రప్పించాడు. యెహోవా ఒక ప్రవక్తద్వారా ఇశ్రాయేలును భద్రంగా కాపాడాడు. 14 కాని, ఎఫ్రాయిము యెహోవాకి మిక్కిలి కోపం కలిగించాడు. ఎఫ్రాయిము చాలామందిని హతమార్చాడు. అందుకని, అతను తన నేరాలకుగాను శిక్షింపబడతాడు. అతని ప్రభువు అతన్ని తన సిగ్గును సహించేటట్లుగా చేశాడు.”

కొలొస్సయులకు 3:18-4:1

క్రొత్త జీవితంలో ఉండవలసిన బంధాలు

18 స్త్రీలు తమ భర్తలకు విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి విశ్వాసులు చేయవలసిన విధి.

19 పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. వాళ్ళతో కఠినంగా ప్రవర్తించరాదు.

20 పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల అన్ని విషయాల్లో విధేయతతో ఉండాలి. అప్పుడు వాళ్ళను ప్రభువు మెచ్చుకొంటాడు.

21 తండ్రులు తమ పిల్లలకు చిరాకు కలిగించరాదు. అలా చేస్తే వాళ్ళకు నిరుత్సాహం కలుగుతుంది.

22 బానిసలు తమ యజమానుల పట్ల అన్ని విషయాల్లో విధేయతతో ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నప్పుడే కాకుండా, వాళ్ళ అభిమానం సంపాదించటానికి మాత్రమే కాకుండా, మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసం కారణంగా మనస్ఫూర్తిగా పని చేయాలి. 23 అలా చేసేది మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే మీరు సేవ చేస్తున్నది క్రీస్తు ప్రభువు కోసం. 24 మీరు ప్రభువుకు దాసులని మీకు తెలుసు. కనుక ఏది చేసినా అది మానవుల కోసమే కాకుండా ప్రభువు కోసం కూడా చేయండి. 25 తప్పు చేసిన వాడు ఆ తప్పుకు తగిన శిక్ష అనుభవించాలి. దేవుడు పక్షపాతం చూపకుండా తీర్పు చెబుతాడు.

యజమానులు తమ సేవకుల పట్ల మంచిగా, న్యాయంగా ఉండాలి. మీకు కూడా పరలోకంలో ఒక యజమాని ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International