Revised Common Lectionary (Semicontinuous)
ఇశ్రాయేలు యెహోవాను మరచి పోవుట
11 “ఇశ్రాయేలు చిన్నబిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను.
మరియు ఈజిప్టు నుండి నా కుమారుని బయటకు పిలిచాను.
2 కాని, ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే
అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు.
బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు.
విగ్రహాలకు వారు ధూపం వేశారు.
3 “అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే!
ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తుకొన్నాను!
నేను వారిని స్వస్థపరిచాను.
కాని అది వారికి తెలియదు.
4 తాళ్లతో నేను వారిని నడిపించాను.
కాని అవి ప్రేమ బంధాలు.
నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగవున్నాను.
నేను వంగి వారికి భోజనం పెట్టాను.
5 “ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు. 6 వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది.
7 “నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.”
యెహోవా ఇశ్రాయేలుని నాశనం చేయడు
8 “ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకు లేదు.
ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె.
నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు!
నిన్ను సెబొయీములాగ చెయ్యాలనీ లేదు!
నేను నా మనసు మార్చుకుంటున్నాను,
నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
9 నేను నా కోపాగ్నిని అణచుకొంటాను.
నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను.
నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి.
నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను.
10 నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే,
నా బిడ్డలు వచ్చి నన్ను అనుసరిస్తారు.
భయంతో కంపిస్తూ నా బిడ్డలు
పశ్చిమ దిశనుంచి వస్తారు.
11 వాళ్లు ఈజిప్టు నుంచి
పక్షుల్లా వణుకుతూ వస్తారు.
వాళ్లు అష్షూరు దేశంనుంచి పావురాలవలె కదులుతూ వస్తారు.
నేను వాళ్లని తిరిగి ఇంట చేరుస్తాను” అని యెహోవా చెప్పాడు.
అయిదవ భాగం
(కీర్తనలు 107–150)
107 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
ఆయన ప్రేమ శాశ్వతం.
2 యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి.
వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
3 అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు.
తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల[a] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.
4 ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు.
వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుచుండిరి.
కాని వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు.
5 ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి
బలహీనం అయ్యారు.
6 అప్పుడు వారు సహాయం కోసం ఏడ్చి, యెహోవాకు మొరపెట్టి వేడుకొన్నారు.
యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు.
7 ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
8 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి!
ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
9 దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు.
ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు.
ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.
క్రొత్త జీవితం
3 మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి. 2-3 మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక భూమ్మీద ఉన్నవాటిని కాకుండా పరలోకంలో ఉన్నవాటిని గురించి ఆలోచించండి. 4 క్రీస్తు మీ నిజమైన ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరాయనతో సహా దేవుని మహిమలో భాగం పంచుకొంటారు.
5 మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి. 6 వీటివల్ల దేవునికి కోపం వస్తుంది.[a] 7 మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి.
8 కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు. 9 మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు కనుక అసత్యములాడరాదు. 10 మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు. 11 ఇక్కడ గ్రీసు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి, సిథియనుడికి[b] భేదం లేదు. బానిసకు, బానిసకానివానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు.
పిసినారి ఉపమానం
13 ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.
14 యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు. 15 ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు.
16 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది. 17 అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు.
18 “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో 19 ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు.
20 “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు.
21 “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”
© 1997 Bible League International