Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.
2 దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని
ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
ఇశ్రాయేలు నుండి మోయాబు వేరు పడుట
4 మోయాబు రాజు మేషా. మేషావద్ద చాలా మేకలుండెను. మేషా 1,00,000 గొర్రెల ఉన్నిని 1,00,000 గొర్రె పొట్టేలుల ఉన్నిని ఇశ్రాయేలు రాజుకి ఇచ్చాడు. 5 కాని అహాబు మరణించిన తర్వాత, మోయాబు రాజు ఇశ్రాయేలు రాజ్యపరిపాలనకు తిరుగుబాటు చేశాడు.
6 తర్వాత యెహోరాము రాజు షోమ్రోను నుండి వెలుపలికి పోయి ఇశ్రాయేలు మనుష్యులందరిని సమీకరించాడు. 7 యెహోరాము యూదారాజైన యెహోషాపాతు వద్దకు దూతలను పంపాడు. యెహోరాము ఇట్లన్నాడు: “మోయాబు రాజు, నా పరిపాలనపై తిరుగబడ్డాడు. మోయాబుతో యుద్ధము చేయడానికి నీవు నాతో కలసెదవా?”
యెహోషాపాతు, “అలాగే నేను నీతో కలుస్తాను. మనమిద్దరము ఒక సైన్యమవుదాము. నా ప్రజలు నీ ప్రజలవలె వుంటారు. నా గుర్రములు నీ గుర్రములవలె వుంటాయి.” అని చెప్పాడు.
ఆ ముగ్గురు రాజులు ఎలీషా సలహా కోరుట
8 యెహోషాపాతు యెహోరాముతో, “మనము ఏ త్రోవను వెళ్లాలి?” అని అడిగాడు.
“మనము ఎదోము ఎడారిద్వారా వెళ్లాలి” అని యెహోరాము సమాధానమిచ్చాడు.
9 అందువల్ల ఇశ్రాయేలు రాజు, యూదా, ఎదోము రాజులతో కలిసి వెళ్లాడు. ఏడు రోజులపాటు వాళ్లు ప్రయాణం చేశారు. తమ సైన్యనానికి గానీ, జంతువులకు గానీ తగినంత నీరు దొరకలేదు. 10 చివరికి ఇశ్రాయేలు రాజు (యెహోరాము) ఇలా చెప్పాడు, “యెహోవా నిజంగానే మన ముగ్గురిని మోయాబు రాజులను ఓడించటానికే ఒకటిగా చేశాడు.”
11 కాని యెహోషాపాతు, “తప్పక యెహోవా యొక్క ఒక ప్రవక్త అక్కడే వున్నాడు. మనమేమి చేయవలెనో యెహోవాని అడగమని మనము ఆ ప్రవక్తను అడుగుదాము” అనిచెప్పాడు.
ఇశ్రాయేలు రాజు సేవకుడొకడు, “షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడే వున్నాడు. ఎలీషా ఎలీయా యొక్క సేవకుడు” అనిచెప్పాడు.
12 “యెహోవా మాట ఎలీషాతో ఉన్నది” అని యెహోషాపాతు పలికాడు.
అందువల్ల ఇశ్రాయేలు రాజు (యెహోరాము), ఎదోము రాజు మరియు యెహోషాపాతు ఎలీషాని దర్శించటానికి వెళ్లారు.
13 ఇశ్రాయేలురాజు (యెహోరాము)తో ఎలీషా, “నా నుండి నీకేమి కావలెను! నీ తల్లిదండ్రులయొక్క ప్రవక్తల వద్దకు పొమ్ము” అన్నాడు.
ఇశ్రాయేలు రాజు ఎలీషాతో, “అలా కాదు. మేము నిన్ను దర్శించుటకే వచ్చాము. మమ్మల్ని మోయాబీయులను ఓడించటానికి మా ముగ్గురి రాజులను దేవుడు ఒకటిగా పిలిచాడు” అని చెప్పాడు.
14 “నేను యూదా రాజయిన యెహోషాపాతును గౌరవిస్తున్నాను. యెహోవా పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. సర్వశక్తిమంతుడైన యెహోవాను నేను సేవిస్తాను. యెహోవా జీవముతోడు యెహోషాపాతు కనుక లేకపోయినచో నేను నిన్ను శ్రద్ధ చేయక నిన్ను పూర్తిగా నిర్లక్ష్యము చేసేవాడిని. 15 కాని ఇప్పుడు వీణ వాయించే వానిని తీసుకొని రమ్ము.” అని ఎలీషా చెప్పాడు.
ఆ వ్యక్తి వీణ వాయించగానే, యెహోవా యొక్క శక్తి ఎలీషా మీదికి వచ్చింది. 16 అప్పుడు ఎలీషా, “యెహోవా చెప్పుచున్నది ఇదే. లోయలో రంధ్రాలు చేయండి. 17 యెహోవా చెప్పుచున్నది ఇదే. నీవు పెనుగాలిని చూడవు. నీవు వానను చూడవు. కాని లోయ నీటితో నిండి ఉంటుంది. అప్పుడు నీవు, నీ ఆవులు, జంతువులు తాగటానికి నీరు లభిస్తుంది. 18 ఇది చేయడం యెహోవాకు సులభం మోయాబీయులను ఓడించేలా యెహోవా చేయగలడు. 19 నీవు ప్రతి దృఢమైన నగరముపై మరియు ప్రతి మంచి నగరముపై దాడి చేస్తావు. నీవు ప్రతి మంచి వృక్షాన్ని నరికి వేస్తావు. అన్ని ఊటలను నీవు నిలిపివేయగలవు. నీవు విసిరివేసే రాళ్లతో ప్రతి మంచి స్థలమును నీవు పాడుచేస్తావు” అని పలికాడు.
20 ఉదయాన దేవునికి బలి జరిగే సమయంలో ఎదోము మార్గము నుండి నీరు ప్రవహించడం ప్రారంభమయ్యింది. లోయ నిండింది.
6 వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. 7 వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. 8 ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. 9 ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. 10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. 13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. 14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది:
“నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో!
బ్రతికి లేచిరా!
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”
15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.
© 1997 Bible League International