Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 5:1-14

నయమాను సమస్య

సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. రాజుకు అతడు అతి ముఖ్యుడు. ఎందుకనగా, యెహోవా అతనిని ఉపయోగించుకొని సిరియా విజయం సాధించేలా చేశాడు. నయమాను మహాశక్తిమంతుడు, గొప్పవాడు. కాని కుష్ఠువ్యాధి వలన అతను బాధ పడుతూ ఉన్నాడు.

ఇశ్రాయేలులో యుద్ధం చేయడానికై సిరియను సైన్యం అనేక బృందాల సైనికులను పంపింది. ఇశ్రాయేలీయులను వారి బానిసలుగా గ్రహించారు. ఒక సారి వారు ఇశ్రాయేలునుంచి ఒక అమ్మాయిని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు సేవకురాలుగా ఉంది. ఆ అమ్మాయి నయమాను భార్యతో ఇలా చెప్పింది: “నా యజమాని (నయమాను) ప్రవక్తయైన ఎలీషాను కలుసుకోవాలని నా కోరిక. ఎలీషా షోమ్రోను నివాసి. ఆ ప్రవక్త నయమాను కుష్ఠువ్యాధిని బాగుచేయగలడు.”

నయమాను తన యజమాని (సిరియారాజు) వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకు ఆ అమ్మాయి చెప్పిన విషయలు నయమాను తెలిపాడు.

అప్పుడు సిరియా రాజు, “అయితే ఇప్పుడే వెళ్లు. నేను ఇశ్రాయేలు రాజుకు ఒక లేఖ పంపుతాను” అన్నాడు.

అందువల్ల నయమాను ఇశ్రాయేలుకు వెళ్లాడు. నయమాను కొన్ని కానుకలు తీసుకు వెళ్లాడు. ఏడువందల పౌనుల వెండి, అరు వేల బంగారం ముక్కలు మరియు పది దుస్తులు నయమాను తీసుకువెళ్ళాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన లేఖ కూడా తీసుకు వెళ్లాడు. ఆ లేఖలో ఇలా వుంది: “… నేను ఇప్పుడు నా సేవకుడైన నయమానుని నీ వద్దకు పంపుతున్నాను. అతని కుష్ఠువ్యాధిని నివారించుము.”

ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, తాను తలక్రిందులై నానని విచారంగా ఉన్నానని తెలిపేందుకు తన దుస్తులు చింపివేశాడు. ఇశ్రాయేలు రాజు, “నేను దేవుడినా? కాదు. జీవ మరణాల మీద నాకు శక్తిలేదు. అందువల్ల సిరియా రాజు కుష్ఠువ్యాధితో బాధపడే ఒకనిని స్వస్థపరుచుటకు నా వద్దకు ఎందుకు పంపినట్లు? దానిని గురించి ఆలోచించుము. అది ఒక మాయోపాయమని తెలియుచున్నది. సిరియా రాజు యద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు” అని చెప్పాడు.

ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినపుడు ఈ క్రింది సందేశాన్ని రాజు పంపాడు: “నీవు నీ దుస్తులు ఎందుకు చింపివేసుకొన్నావు? నయమానుని నా వద్దకు పంపు. అప్పుడతను ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నట్లు తెలుసుకుంటాడు.”

ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి వెలుపల నుంచున్నాడు. 10 ఎలీషా ఒక దూతను నయమాను వద్దకు పంపాడు. ఆదూత, “వెళ్లి, ఏడు మారులు యోర్దాను నదిలో స్నానం చేయుము. అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు శుద్ధుడవు అవుతావు, శుభ్రపడతావు” అన్నాడు.

11 నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, “ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. నా ముందర చేయి ఆడించి మరి నా కుష్ఠువ్యాధి బాగుచేస్తాడని ఆశించాను. 12 దమస్కు నదులైన అబానా, ఫర్పరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కంటె మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో స్నానం చేసి శుద్ధుణ్ని కాకూడదు!” అని అనుకొని నయమాను మహోగ్రుడయి కోపంతో వెళ్లిపోయాడు.

13 కాని నయమాను సేవకులు అతనిని సమీపించి అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: “తండ్రీ, ప్రవక్త మిమ్మల్ని ఒక కష్టమైన పని చెయ్యమని చెబితే, ఆ విధంగా చేయవా? అలాగే, నీతో సులభమైన పని చెప్పినా, అది కూడా పాటించాలి. అతను చెప్పిందేమనగా, కడుగుకొనుము, నీవు శుద్ధడవయ్యెదవు.”

14 అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా నయమాను ఆచరించాడు. నయమాను యోర్దాను నది లోపలికి వెళ్లి ఏడు సార్లు మునిగాడు. వెంటనే నయమాను శుద్ధుడయ్యాడు. నయమాను చర్మం పసిపిల్లవాని చర్మంవలె మృదువుగా వుంది.

కీర్తనలు. 30

దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.

30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
    నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
    నీవు నన్ను స్వస్థపరచావు.
సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
    నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.

దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
    ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
    నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
    మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.

ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
    నేను ఎన్నటికీ ఓడించబడను.
యెహోవా, నీవు నామీద దయ చూపావు.
    బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
    మరి నేను చాలా భయపడిపోయాను.
దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
    నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
“దేవా, నేను మరణించి,
    సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
    అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
    యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.

11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
    నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
    ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.

గలతీయులకు 6:1-6

అందరికీ మంచి చెయ్యండి

నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్నవాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి. పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించినవాళ్ళౌతారు. తనలో ఏ గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే తనను తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు. ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

మంచి చేయుట ఎన్నడూ మానవద్దు

దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.

గలతీయులకు 6:7-16

మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము. శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు. కనుక మనం విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడువకుండా మంచి చేస్తే సరియైన సమయానికి మంచి అనే పంట కోయగలుగుతాము. 10 మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం.

చివరి మాట

11 ఇది మీకు నేను నా స్వహస్తాలతో వ్రాసాను. మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో చూడండి. 12 నలుగురిలో మంచి పేరు పొందాలనుకొన్నవాళ్ళు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళీ విధంగా చెయ్యటానికి ఒకే ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువను గురించి బోధించటం వల్ల కలిగే హింసనుండి తప్పించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. 13 సున్నతి చేసుకొన్నవాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. కాని శారీరకంగా వాళ్ళు గర్వించటానికి మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటున్నారు.

14 యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించను. ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చియున్నాము. 15 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోకపోయినా ఒకటే. క్రొత్త జీవితం పొందటం ముఖ్యం. 16 ఈ నియమాల్ని పాటించేవాళ్ళందరికీ, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు శాంతి, అనుగ్రహం లభించును గాక.

లూకా 10:1-11

యేసు తన డెబ్బది రెండు మంది శిష్యులను పంపటం

10 ఆ తర్వాత యేసు మరొక డెబ్బది రెండు[a] మంది శిష్యులను నియమించాడు. వాళ్ళను జతలు జతలుగా తాను వెళ్ళబోయే ప్రతి గ్రామానికి, పల్లెకు తన కంటే ముందు పంపుతూ, “పంటబాగా పండింది. కాని పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల పంటనిచ్చిన ఆ ప్రభువును పని వాళ్ళను తన పొలాలకు పంపమని ప్రార్థించండి.

“వెళ్ళండి! తోడేళ్ళ మందలోకి గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. మీ వెంటడబ్బు దాచుకొనే సంచి కాని, జోలి కాని, చెప్పులు కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడకండి. ఒకరి యింట్లోకి వెళ్ళేముందు, మొదట సమాధానం కలుగుగాక అని చెప్పండి. ఆ యింటిలో శాంతి పొందనర్హుడైన వ్యక్తి ఉంటే మీ ఆశీస్సు అతనికి తోడౌతుంది. లేని పక్షంలో మీ ఆశీస్సు మీకు తిరిగివస్తుంది. ఉన్న యింట్లోనే ఉండండి. ఇచ్చిన దాన్ని భుజించండి. పని చేసినవానికి కూలి దొరకాలి కదా! ఇల్లిల్లు తిరగకండి.

“ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగతమిచ్చి ఏది మీ ముందు పెడితే అది భుజించండి. గ్రామంలో ఉన్న రోగులకు నయం చెయ్యండి. వాళ్ళతో, ‘దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తోంది’ అని చెప్పండి.

10 “మీరొక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగత మివ్వకుంటే 11 వీధిలోకి వెళ్ళి మీరు చేస్తున్నది తప్పని సూచించటానికి, ‘మా కాలికంటిన మీ ఊరి ధూళి కూడా దులిపి వేస్తున్నాము. కాని యిది మాత్రం నిజం. దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది. తెలిసికోండి’ అని అనండి.

లూకా 10:16-20

16 “మీ బోధనలు వింటే నా బోధనలు విన్నట్టే. మిమ్మల్ని నిరాకరిస్తే నన్నును నిరాకరించినట్టే. నన్ను నిరాకరిస్తే నన్ను పంపినవానిని నిరాకరించినట్లే” అని వాళ్ళతో అన్నాడు.

సాతాను పడిపోవటం

17 ఆ డెబ్బది రెండు మంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి, “ప్రభూ! మీ పేరు చెప్పగానే దయ్యాలు కూడా మా మాటలకు లోబడ్డాయి” అని అన్నారు.

18 యేసు, “సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడిపోవటం నేను చూశాను. 19 పాముల మీద నడవటానికి మీకు అధికారము యిచ్చాను. శత్రువును జయించే అధికారం యిచ్చాను. ఏది మీకు హాని చెయ్యలేదు. 20 దయ్యాలు మీ మాట వింటున్నంత మాత్రాన ఆనందించకండి. మీ పేరు పరలోకంలో వ్రాయబడినందుకు ఆనందించండి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International