Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
షూనేము స్త్రీ కుమారుడు మరల బ్రతుకుట
32 ఎలీషా ఇంట్లోకి వెళ్లాడు. తన మంచం మీద ఆ బిడ్డ చనిపోయివున్నాడు. 33 ఎలీషా గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా మరియు ఆబిడ్డ మాత్రమే గదిలో వున్నారు. అప్పుడు ఎలీషా యెహోవాని ప్రార్థించాడు. 34 ఎలీషా పడక వద్దకు వెళ్లాడు. బిడ్డ మీద పడుకున్నాడు. ఎలీషా తన నోటిని బిడ్డ నోటిమీద వుంచాడు. ఎలీషా తన కండ్లను బిడ్డ కండ్ల మీద వుంచాడు. తరువాత బిడ్డ దేహం వేడి ఎక్కేంత వరకు బిడ్డమీద ఎలీషా పండుకొన్నాడు.
35 తర్వాత ఎలీషా లేచి ఆ గది చుట్టూ తిరిగాడు. వెనుకకు వెళ్లి, బిడ్డ ఏడు సార్లు తుమ్మేంత వరకూ కళ్లు తెరిచేంతవరకూ బిడ్డ మీద పండుకొన్నాడు.
36 ఎలీషా గేహజీని పిలిచి, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.
గేహజీ షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా వద్దకు వచ్చింది. “నీ కొడుకుని ఎత్తుకో” అని ఎలీషా చెప్పాడు.
37 తర్వాత షూనేము స్త్రీ గదిలోకి వెళ్లి, ఎలీషా పాదాలకు మోకరిల్లింది. ఆ తర్వాత తన పిల్లవాడిని ఎత్తుకుని ఆమె వెలుపలికి వెళ్లింది.
యేసు అపోస్తలులను పంపటం
(మత్తయి 10:5-15; మార్కు 6:7-13)
9 యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని సమావేశ పరిచి దయ్యాల్ని పారద్రోలటానికి, రోగాలను నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము ఇచ్చాడు. 2 వాళ్ళను ప్రపంచంలోకి పంపుతూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుమని, రోగాలున్న వాళ్ళకు నయం చెయ్యమని వాళ్ళతో చెప్పాడు. 3 వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు వెళ్ళకండి. 4 ఒక యింటికి వెళ్తే ఆ గ్రామం వదిలే దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి. 5 ప్రజలు మీకు స్వాగతం ఇవ్వకుంటే ఆ ఊరు వదిలి వెళ్ళే ముందు వాళ్ళు చేసిన పొరపాటు చూపటానికి మీ కాలి ధూళి దులపండి” అని అన్నాడు.
6 ఆ తర్వాత వాళ్ళు బయలు దేరి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతిచోటా దైవ సందేశాన్ని ప్రకటించారు. రోగాలున్న వాళ్ళకు నయం చేసారు.
© 1997 Bible League International