Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
హోషేయ 1:2-10

ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం. “వెళ్లి, ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కను.[a] ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు-వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు.

యెజ్రెయేలు పుట్టుక

కనుక దిబ్లయీము కుమార్తెయైన గోమెరును హోషేయ పెండ్లి చేసుకొన్నాడు. గోమెరు గర్భవతియై, హోషేయకు ఒక కుమారుని కన్నది. యెహోవా హోషేయతో, “అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. ఎందుచేతనంటే యెహూ యెజ్రెయేలు లోయలో రక్తం చిందించిన కారణంగా నేను యెహూ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను. ఆ సమయంలో యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు విల్లును నేను విరుగగొడ్తాను” అని చెప్పాడు.

లో-రూహామా పుట్టుక

మరల గోమెరు గర్భవతియై ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. యెహోవా హోషేయతో ఇలా చెప్పాడు: “ఆమెకు లో-రూహామా అని పేరు పెట్టు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యానికి నేను ఇక ఎంతమాత్రం కరుణ చూపించను. నేను వారిని క్షమించను. కాని యూదా రాజ్యానికి నేను కరుణ చూపిస్తాను. యూదా రాజ్యాన్ని నేను రక్షిస్తాను. వారిని రక్షించేందుకు విల్లుగాని, ఖడ్గంగాని నేను ఉపయోగించను. వారిని రక్షించేందుకు యుద్ధ గుర్రాలనుగాని, సైనికులనుగాని నేను ఉపయోగించను. నేను నా స్వంత శక్తిచేతనే వారిని రక్షిస్తాను.”

లో-అమ్మీ పుట్టుక

గోమెరు లో-రూహామాకు చనుబాలు ఇవ్వటం చాలించగానే ఆమె మరల గర్భవతి అయ్యింది. ఆమె మరొక కుమారుని కన్నది. అప్పుడు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు. ఎందుచేతనంటే మీరు నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను” అని యెహోవా చెప్పాడు.

ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుట

10 “రాబోయే కాలంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా ఉంటుంది. ఇసుకను నీవు కొలవలేవు. లెక్కించ లేవు. ఏ స్థలంలోనైతే ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పబడిందో అక్కడే ‘మీరు జీవంగల దేవుని పిల్లలు’ అని వారితో చెప్పడం జరుగుతుంది.

కీర్తనలు. 85

సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన

85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
    యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
    వారి పాపాలు తుడిచివేయుము.

యెహోవా, కోపంగాను,
    ఆవేశంగాను ఉండవద్దు.
మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,
    మమ్మల్ని మరల స్వీకరించు.
నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!
    నీ ప్రజలను సంతోషింపజేయుము.
యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.
    మమ్మల్ని రక్షించుము.

దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
    తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
    ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
    మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
    మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
    పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
    భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
    ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.

కొలొస్సయులకు 2:6-15

క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం

మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి. మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి.

మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు. దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజంవల్ల కలిగిన నియమాలు కారణం. ఎందుకంటే, దేవుని ప్రకృతి క్రీస్తులో సంపూర్ణంగా మానవ రూపంతో జీవిస్తోంది. 10 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీకు ఆ సంపూర్ణత లభించింది. క్రీస్తు అన్ని శక్తులకూ, అన్ని అధికారాలకూ అధిపతి.

11 ఆయనతో మీకు కలిగిన ఐక్యతవల్ల మీరు సున్నతి పొందారు. ఈ సున్నతి మానవులు చేసింది కాదు. ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి విముక్తి పొందటమే ఈ సున్నతి. 12 మీరు బాప్తిస్మము పొందటంవల్ల క్రీస్తులో సమాధి పొందారు. క్రీస్తును బ్రతికించిన దేవుని శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాప్తిస్మము వల్ల యిది కూడా సంభవించింది. 13 మీరు చేసిన పాపాలవల్ల, పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి స్వేచ్ఛ పొందకుండా మీరు గతంలో ఆత్మీయంగా మరణించారు. కాని దేవుడు మీ పాపాలన్నిటినీ క్షమించి, క్రీస్తుతో సహా మిమ్మల్ని బ్రతికించాడు. 14 ఆ పద్ధతులను గురించి, నియమాలను గురించి మనం వ్రాత మూలంగా అంగీకరించిన పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక, ఆయన దానిని తీసుకెళ్ళి మేకులతో సిలువకు కొట్టాడు. 15 అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా చేసి వాటిని బహిరంగంగా హేళన చేసి, సిలువతో వాటిపై విజయం సాధించాడు.

కొలొస్సయులకు 2:16-19

మానవకల్పిత నియమాలు పాటించకు

16 అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి. 17 ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది. 18 కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్తపడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూ ఉంటారు. 19 శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు.

లూకా 11:1-13

యేసు ప్రార్థన గురించి బోధించటం

(మత్తయి 6:9-15)

11 ఒక రోజు యేసు ఒక చోట ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించటం ముగించాక ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ! యోహాను తన శిష్యులకు ప్రార్థించటం నేర్పించినట్లు మాక్కూడా ప్రార్థించటం నేర్పండి” అని అడిగాడు.

ఆయన వాళ్ళతో, “మీరు ఈ విధంగా ప్రార్థించాలి:

‘తండ్రీ! నీ పేరు పవిత్రంగానే ఉండాలి!
నీ రాజ్యం రావాలి!
మాకు ప్రతి రోజు ఆహారం యివ్వు!
మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము క్షమించినట్లు
    మా పాపాలు క్షమించు.
మమ్మల్ని శోధనలో పడనివ్వవద్దు!’”

నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము

(మత్తయి 7:7-11)

5-6 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “ఒక వేళ మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన స్నేహితుని యింటికి వెళ్ళి, ‘నా స్నేహితుడు ఒకడు అకస్మాత్తుగా మా యింటికొచ్చాడు. మా యింట్లో తినటానికి ఏమి లేదు. మూడు రొట్టెలుంటే యిస్తావా?’ అని అడిగాడనుకొండి. ఆ స్నేహితుడు యింటి నుండి బయటకు రాకుండా, ‘నేను, నా పిల్లలు పడుకున్నాం. తలుపులు కూడా తాళం వేసాం. అనవసరంగా బాధ పెట్టొద్దు. అయినా యిప్పుడు లేచి నేను రొట్టెలివ్వలేను’ అని అన్నాడనుకోండి. నేను చెప్పేదేమిటంటే, అతడు తన స్నేహితుడైనందుకు రొట్టెలు యివ్వకపోయినా మొండిగా అడగటం వల్ల తప్పక లేచి అతడడిగిన రొట్టెలు యిస్తాడు. కనుక, నేను మీకు చెప్పేదేమంటే; అడగండి, మీకు లభిస్తుంది. వెతకండి దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది. 10 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన వానికి దొరుకుతుంది. తలుపు తడితే అది అతని కోసం తెరుచుకుంటుంది. 11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు? 12 లేక గ్రుడ్డునడిగితే తేలునిస్తాడు? 13 మీరు చెడ్డవాళ్లైనా మీ కుమారులకు మంచి బహుమతులు ఎట్లా యివ్వాలో మీకు తెలుసు. కనుక పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగినవాళ్ళకు పవిత్రాత్మను తప్పక యిస్తాడని గ్రహించండి” అని చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International