Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.
52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
2 వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
3 మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.
4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
5 అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.
6 మంచి వాళ్లు ఇది చూచి,
దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
7 “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”
8 అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
9 దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.
18 మీలో కొంతమంది
యెహోవాయొక్క ప్రత్యేక తీర్పు రోజును చూడగోరుతారు.
అ రోజును మీరెందుకు చూడగోరుతున్నారు?
యెహోవా యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని తెస్తుందేగాని, వెలుగును కాదు!
19 ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై
ఎలుగుబంటి మీదపడినట్లు మీరుంటారు!
ఇంటిలోకి వెళ్లి, గోడమీద చేయి వేయగా
పాము కరచినవాని మాదిరి మీరుంటారు!
20 కావున యెహోవాయొక్క ప్రత్యేక దినము
చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది దుఃఖ సమయంగాని, సంతోష సమయం కాదు!
ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు చీకటిగా ఉంటుంది.
ఇశ్రాయేలీయుల ఆరాధనను యెహోవా తిరస్కరించటం
21 “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను!
నేను వాటిని అంగీకరించను!
మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను!
22 మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా,
నేను వాటిని స్వీకరించను!
మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు
నేను కనీసం చూడనైనా చూడను.
23 మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడనుండి తొలగించండి.
మీ స్వరమండలమునుండి వచ్చే సంగీతాన్ని నేను వినను.
24 మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి.
మంచితనాన్ని ఎన్నడూ ఎండని నీటి వాగువలె ప్రవహించేలా చేయండి.
25 ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాలపాటు
నీవు ఎడారిలో నాకు బలులు, అర్పణలు సమర్పించావు.
26 కాని మీరు మీ రాజుయొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను[a] విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు.
పైగా మీకై మీరు ఆ నక్షత్రాన్ని మీ దేవునిగా చేసుకున్నారు.
27 కావున దమస్కు (డెమాస్కస్) పట్టణం అవతలకి మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను.”
దేవుడును, సర్వశక్తిమంతుడును
అయిన యెహోవా ఆ విషయాలు చెపుతున్నాడు.
ఎఫెసీయుల కోసం ప్రార్థన
14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. 15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. 16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. 17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. 18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.
20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. 21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.
© 1997 Bible League International