Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన
6 యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
కోపగించి నన్ను శిక్షించవద్దు.
2 యెహోవా, నా మీద దయ ఉంచుము.
నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
3 నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.
6 యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
7 నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.
8 చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.
ఎలీషా మరియు గొడ్డలి
6 ప్రవక్తల బృందం ఎలీషాతో ఇలా చెప్పింది: “మేమా ప్రదేశంలో నివసిస్తున్నాము. కాని మాకది చాలా చిన్నదిగా వుంది. 2 యోర్దాను నదివద్దకు వెళ్లి, అడవిలో చెట్లు నరుకుదాము. మనలో ప్రతి ఒక్కరికి ఒక దూలము లభిస్తుంది. అక్కడ నివాసయ్యోగ్యమైన ఇల్లు నిర్మించుకుందాము.”
“బాగుంది, అలాగే కానివ్వండి” అని ఎలీషా బదులు చెప్పాడు.
3 “మాతో మీరు రండి” అని ఒకడనెను. ఎలీషా “బాగుంది, నేను కూడా మీతో వస్తాను” అని చెప్పాడు.
4 అందువల్ల ఎలీషా ప్రవక్తల బృందంతో పాటు వెళ్లాడు. వారు యోర్దాను నది వద్దకు చేరుకుని కొన్ని చెట్లు నరకసాగారు. 5 కాని ఒక వ్యక్తి ఒక చెట్టు నరికేటప్పుడు, చేతినుండి గొడ్డలి జారిపోయి నీళ్లలో పడింది. అప్పుడతను, “యజమానీ, నేను ఆ గొడ్డలి చేబదులుగా తెచ్చాను” అని అరిచాడు.
6 దైవజనుడైన ఎలీషా, “అది ఎక్కడ పడింది” అని అడిగాడు.
గొడ్డలి పడిన చోటును అతను ఎలీషాకు చూపాడు. అప్పుడు ఎలీషా ఒక కొమ్మ నరికి, కర్రను నదిలోకి విసిరివేశాడు. ఆ కొమ్మ ఇనుప గొడ్డలి నీళ్లలో తేలునట్లు చేసింది. 7 “గొడ్డలి పైకి తీసుకో” అని ఎలీషా చెప్పాడు. అప్పుడా వ్యక్తి గొడ్డలిని తీసుకున్నాడు.
యేసు విశ్వసించనివారిని హెచ్చరించటం
(మత్తయి 11:20-24)
13 “అయ్యో కొరాజీనా! అయ్యో బేత్సయిదా! మీకోసం చేసిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకొని బూడిద తలపై వేసుకొని పశ్చాత్తాపం చెంది, మారుమనస్సు పొందివుండే వాళ్ళు. 14 కాని తీర్పు చెప్పబడే రోజున తూరు, సీదోను ప్రజలకన్నా మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు. 15 ఇక, ఓ కపెర్నహూమా! ఆకాశ మంత ఎత్తుగా హెచ్చించుకొందువా? పాతాళానికి త్రోసి వేయబడతావు.
16 “మీ బోధనలు వింటే నా బోధనలు విన్నట్టే. మిమ్మల్ని నిరాకరిస్తే నన్నును నిరాకరించినట్టే. నన్ను నిరాకరిస్తే నన్ను పంపినవానిని నిరాకరించినట్లే” అని వాళ్ళతో అన్నాడు.
© 1997 Bible League International