Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 85

సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన

85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
    యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
    వారి పాపాలు తుడిచివేయుము.

యెహోవా, కోపంగాను,
    ఆవేశంగాను ఉండవద్దు.
మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,
    మమ్మల్ని మరల స్వీకరించు.
నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!
    నీ ప్రజలను సంతోషింపజేయుము.
యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.
    మమ్మల్ని రక్షించుము.

దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
    తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
    ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
    మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
    మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
    పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
    భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
    ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.

హోషేయ 4

ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపంగా ఉండుట

ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి! ఈ దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యెం ఏమిటో యెహోవా చెపుతాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మకస్తులుగాను లేరు. ప్రజలు (అబద్ధపు) ఒట్టు పెట్టుకుంటారు, అబద్ధాలు చెపుతారు, చంపుతారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరల మరల హత్య చేస్తారు. అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి. ఏ వ్యక్తీ మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో! వాదం పెట్టుకోవద్దు. మీరు (యాజకులు) పగటివేళ పడిపోతారు. మరియు రాత్రివేళ ప్రవక్త కూడ మీతోపాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేస్తాను.

“నా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయబడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను. వారు గర్విష్ఠులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారి ఘనతను అవమానంగా నేను మార్చివేస్తాను.

“యాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. వారు ఆ పాపాలను ఇంకా ఇంకా ఎక్కువగా కోరుకొన్నారు. కనుక ప్రజలకంటే యాజకులు వేరుగా ఏమీలేరు. వారు చేసిన వాటి విషయమై నేను వారిని శిక్షిస్తాను. వారు చేసిన వాటికోసం నేను వారికి తగిన శిక్ష విధిస్తాను. 10 వారు భోజనం చేస్తారు కాని వారికి తృప్తి ఉండదు. వారు లైంగిక పాపాలు చేస్తారు. కాని వారికి పిల్లలు ఉండరు. ఎందుచేతనంటే వారు యెహోవాను విడిచిపెట్టి వేశ్యలవలె తయారయ్యారు.

11 “లైంగిక పాపాలు, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షారసం మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం చేస్తాయి. 12 నా ప్రజలు కట్టెముక్కలను సలహా అడుగుతున్నారు. ఆ కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ ఆ బూటకపు దేవతలను వెంటాడారు. 13 వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండలమీద, సిందూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేస్తారు. ఆ చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు ఆ చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లుకూడా పాపాలు చేస్తారు.

14 “వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను నిందించలేను. పురుషులు వెళ్లి, వేశ్యలతో పడుకొంటారు. వారు వెళ్లి, ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక ఆ తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు.

ఇశ్రాయేలీయుల సిగ్గుకరమైన పాపాలు

15 “ఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. కానీ, యూదాను అపరాధిగా ఉండనియ్యకు. గిల్గాలుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్లకుము. ప్రమాణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించకుము. మరియు ‘యెహోవా జీవంతోడు …!’ అని అనవద్దు. 16 ఇశ్రాయేలుకు యెహోవా ఎన్నో ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమైన పొలంలోకి తన గొర్రెలను తీసికొనివెళ్లే కాపరిగా ఆయన ఉన్నాడు. కానీ, ఇశ్రాయేలు మొండిది. ఇశ్రాయేలు మరల మరల పారిపోయే పెయ్యలాగ ఉంది. 17 ఎఫ్రాయిము అతని విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా విడిచివేయండి. 18 వారి త్రాగుడు వారిని ప్రక్కకు త్రిప్పివేసింది. వారు విడువక ఇష్టానుసారంగా జారత్వము చేస్తూ ఆమెను సిగ్గుతో కప్పుతున్నారు. 19 కాని ఆమెను, ఆమె రెక్కలతో బంధించును. వారి బలి అర్పణల వలన వారు సిగ్గునొందుదురు.”

అపొస్తలుల కార్యములు 1:15-20

15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. 16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు. 17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”

18 యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తర్వాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి ప్రేగులు బయటపడ్డాయి. 19 యెరూషలేములోని వాళ్ళంతా దీన్ని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమ అని పిలిచేవాళ్ళు. దీని అర్థం “రక్తపు భూమి.”

20 పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:

‘అతని భూమిని పాడు పడనిమ్ము
    అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’(A)

‘అతని స్థానాన్ని యింకొకడు ఆక్రమించనిమ్ము!’(B)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International