Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 50:1-8

ఆసాపు కీర్తనలలో ఒకటి.

50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
    సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
    ఆయన యెదుట అగ్ని మండుతుంది.
    ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
    క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
“నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
    వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.

అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
    ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.

దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
    నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.

కీర్తనలు. 50:22-23

22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
    దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
    అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
    నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”

యెషయా 1:2-9

తన ప్రజల విరుద్ధంగా దేవుని వాదం

ఆకాశమా, భూమీ, యెహోవా మాట వినండి! యెహోవా ఇలా చెబుతున్నాడు.

“నా పిల్లల్ని నేను పెంచాను. నా పిల్లలు పెరగటానికి నేను సహాయం చేసాను.
    కానీ నా పిల్లలు నా మీద తిరగబడ్డారు.
ఎద్దుకు తన కామందు తెలుసు.
    గాడిదకు దాని సొంతదారుడు మేత పెట్టే చోటు తెలుసు.
కానీ ఇశ్రాయేలు ప్రజలకు నేను తెలియదు.
    నా ప్రజలు గ్రహించరు.”

ఇశ్రాయేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు మోయాల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుణ్ణి) ఆ ప్రజలు అవమానించారు. వాళ్లు దేవుణ్ణి విడిచిపెట్టి, పరాయి వాళ్లలా ఉన్నారు.

దేవుడు చెబుతున్నాడు: “ప్రజలారా నేనెందుకు మిమ్మల్ని శిక్షిస్తూనే ఉండాలి? నేను మిమ్మల్ని శిక్షించాను. కాని మీరు మారలేదు. మీరు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతి తల, ప్రతిగుండె వ్యాధితో ఉన్నాయి. మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు శ్రద్ధ తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. వాటికి కట్లు కట్టలేదు.

“మీ దేశం పాడైపోయింది. మీ పట్టణాలు అగ్నితో కాల్చివేయబడ్డాయి. మీ దేశాన్ని మీ శత్రువులు స్వాధీనం చేసుకొన్నారు. సైన్యం నాశనం చేసిన దేశంలా మీ భూమి పాడు చేయబడింది.”

యెరూషలేముకు హెచ్చరిక

ఇప్పుడు సీయోను కుమార్తె (యెరూషలేము) ద్రాక్ష తోటలో విడువబడిన ఖాళీ గుడారంలా ఉంది. దోస పాదుల్లో విసర్జించబడిన పాత గుడిసెలాగ ఉంది. అది శత్రువులచేత ఓడించబడిన పట్టణంలా ఉంది. ఇది నిజమే, కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా కొద్ది మంది ప్రజలను బ్రతకనిచ్చాడు. సొదొమ, గొమొర్రా పట్టణాల్లా మనం సర్వనాశనం చేయబడలేదు.

యెషయా 1:21-23

యెరూషలేము దేవునికి నమ్మకంగా లేదు

21 దేవుడు చెబుతున్నాడు: “యెరూషలేమును చూడండి. అది నన్ను నమ్మి వెంబడించిన పట్టణం. అది ఓ వేశ్య అయ్యేట్టుగా చేసింది ఏమిటి? ఇప్పుడు అది నన్ను వెంబడించటం లేదు. యెరూషలేము న్యాయంతో నిండి ఉండాలి. యెరూషలేము నివాసులు యెహోవా కోరిన విధంగా జీవించాలి, కానీ ఇప్పుడు నరహంతకులు అక్కడ నివసిస్తున్నారు.

22 “మంచితనం వెండిలాంటిది. కానీ మీ వెండి పనికిమాలినదిగా తయారయింది. మీ ద్రాక్షారసం నీళ్లతో కలపబడి నిస్సారమయింది. 23 మీ అధికారులు తిరుగుబాటు దారులు, దొంగల స్నేహితులు. మీ అధికారులు అందరూ లంచాలు అడుగుతారు, తప్పుడు పనులు చేయటం కోసం డబ్బు స్వీకరిస్తారు. మీ అధికారులంతా ప్రజలను మోసం చేసేందుకు డబ్బు పుచ్చుకొంటారు. మీ అధికారులు అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ప్రయత్నం చేయరు. భర్తలు చనిపోయిన స్త్రీల అవసరాలను గూర్చి మీ అధికారులు వినిపించుకోరు.”

మత్తయి 6:19-24

నీవు ఇద్దరు యజమానులను సేవించలేవు

(లూకా 12:33-34; 11:34-36; 16:13)

19 “మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు. 20 మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. 21 మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.

22 “కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది. 23 మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా.

24 “ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International