Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: “ఒప్పందపు లిల్లి పుష్పం” రాగం. దావీదు అనుపదగీతం. ఉపదేశించదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను, అరమోజబాయీలతోను యుద్ధం చేయగా యోవాబు ఉప్పు లోయలో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పటిది.
60 దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు.
నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు.
దయచేసి మమ్ములను ఉద్ధరించుము.
2 భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు.
మా ప్రపంచం పగిలిపోతోంది.
దయచేసి దాన్ని బాగు చేయుము.
3 నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు.
త్రాగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము.
4 నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను
స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.
5 నీ మహాశక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు,
నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.
6 దేవుడు తన ఆలయంలో నుండి[a] మాట్లాడుతున్నాడు.
“నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను.
నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను.
షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.
7 గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము.
యూదా నా రాజదండము.
8 మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను.
ఎదోము నా చెప్పులు మోసే బానిసగా ఉంటుంది. ఫిలిష్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”
9 బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు?
ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?
10 దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు.
కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.
11 దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము.
మనుష్యులు మాకు సహాయం చేయలేరు.
12 కాని దేవుని సహాయంతో మేము జయించగలం.
దేవుడు మా శత్రువులను ఓడించగలడు.
ఇశ్రాయేలు తనని తాను నాశనం చేసుకొనుట
13 ఇశ్రాయేలులో ఎఫ్రాయిము చాలా ప్రాముఖ్యం సంపాదించుకున్నాడు. ఎఫ్రాయిము మాట్లడితే చాలు, ప్రజలు భయంతో కంపించి పోయేవారు. కాని ఎఫ్రాయిము పాపకార్యాలు చేశాడు. అతను బయలు దేవతని ఆరాధించాడు. 2 ఇప్పుడిక ఇశ్రాయేలీయులు నానాటికీ ఎక్కువగా పాపంచేస్తారు. వాళ్లు తమకోసం తాము విగ్రహాలను చేసుకుంటారు. పనివాళ్లు వెండితో ఆ విగ్రహాలను చేస్తారు. అప్పుడిక ఇశ్రాయేలీయులు తమ ఆ విగ్రహాలతో మాట్లాడతారు. వాళ్లు ఆ విగ్రహాలకు బలులు సమర్పిస్తారు. వాళ్లు ఆ బంగారు దూడలను ముద్దు పెట్టుకొంటారు. 3 అందుకే వాళ్లు త్వరలోనే ప్రాతః కాలపు పొగమంచులా అదృశ్యమవుతారు. ఆ పొగమంచు నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై పోతుంది. ఇశ్రాయేలీయులు కళ్లంలో ధాన్యం తూర్పార పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలువడి, గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు.
4 “మీరు ఈజిప్టులో ఉన్ననాటినుంచీ యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప మరో దేవుడెవరినీ మీరు ఎరుగరు. మిమ్మల్ని రక్షించింది నేనే. 5 మీరు ఎడారిలో ఉన్నప్పుడూ, మెట్ట ప్రాంతంలో ఉన్నప్పుడూ కూడా మీరు నాకు తెలుసు. 6 ఇశ్రాయేలీయులకు నేను ఆహారమిచ్చాను. వాళ్లా ఆహారం తిన్నారు. వాళ్లు కడుపులు నింపుకుని తృప్తిచెందారు. వాళ్లు గర్విష్ఠులై నన్ను మరచారు!
7 “అందుకే నేను వాళ్ల పాలిటికి సింహంలాగ ఉంటాను. దారిప్రక్కన పొంచివున్న చిరుతపులిలాగా ఉంటాను. 8 తన కూనల్ని కోల్పోయిన ఎలుగుబంటిలాగ నేను వాళ్లపైన దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే ఒక క్రూర మృగంలాగ ఉంటాను”
దేవుని కోపంనుంచి ఇశ్రాయేలు కాపాడబడలేకపోవుట
9 “ఇశ్రాయేలూ, నేను నీకు సహాయం చేశాను. కానీ, నాకు నీవు ఎదురు తిరిగావు. అందుకు, నిన్ను నేనిప్పుడు నాశనం చేస్తాను. 10 నీ రాజు ఎక్కడున్నాడు? నీ నగరాలన్నింటిలోనూ అతను నిన్ను రక్షించలేడు! నీ న్యాయాధిపతులు ఎక్కడ? నీవొకప్పుడు ‘నాకొక రాజునీ, కొందరు నాయకుల్నీ ఇవ్వండి’ అని అడిగావు. 11 నాకు కోపం వచ్చి, నేను నీకొక రాజును ఇచ్చాను. నా కోపం మితిమీరినప్పుడు నేనా రాజుని వెనక్కి తీసేసుకున్నాను.
12 “ఎఫ్రాయిము తన దోషాన్ని కప్పుకొన ప్రయత్నించాడు.
తన పాపాలు గుప్తంగా ఉన్నాయనుకున్నాడు.
(కాని, అతను శిక్షంపబడతాడు.)
13 అతని శిక్ష ఎలా ఉంటుందంటే, స్త్రీ ప్రసవ బాధలా ఉంటుంది.
అతను వివేకి అయిన పుత్రుడుగా ఉండడు.
అతని పుట్టుకకు సమయం ఆసన్నమవుతుంది,
కాని అతను బతికి బయటపడడు.
14 “నేను వాళ్లనా సమాధినుంచి కాపాడుతాను!
నేను వాళ్లని మృత్యుముఖంనుంచి కాపాడుతాను!
మరణమా, నీ వ్యాధులు ఎక్కడున్నాయి?
సమాధీ, నీ శక్తి ఎక్కడ?
నేను పగ సాధించాలని చూడటం లేదు!
15 ఇశ్రాయేలు తన సోదరుల మధ్య పెరుగుతాడు.
కాని, శక్తివంతమైన తూర్పుగాలి వీస్తుంది. యెహోవా గాలి ఎడారినుంచి వస్తుంది.
అప్పుడు (ఇశ్రాయేలు) బావి ఎండిపోతుంది.
అతని నీటి బుగ్గ ఇంకిపోతుంది.
(ఇశ్రాయేలు) సంపదలో విలువైన వాటన్నింటినీ గాలి ఎగరేసుకుపోతుంది.
16 షోమ్రోను శిక్షింపబడాలి.
ఎందుకంటే, అది తన దేవునికి వ్యతిరేకి అయింది.
ఇశ్రాయేలీయులు కత్తులతో చంపబడతారు.
వాళ్ల పిల్లలు తునాతునకలు చేయబడతారు.
వాళ్ల గర్భిణీస్త్రీల కడుపులు చీల్చబడతాయి.”
మరికొన్ని ఉపదేశములు
2 మనస్సు నిమగ్నం చేసి, భక్తితో దేవుణ్ణి ప్రార్థించండి. దేవునికి మీ కృతజ్ఞత తెలుపుకోండి. 3 మా సందేశానికి దేవుడు దారి చూపాలని, ఆయన క్రీస్తును గురించి తెలియ చేసిన రహస్య సత్యాన్ని మేము ప్రకటించగలగాలని మాకోసం కూడా ప్రార్థించండి. నేను దాని కోసమే సంకెళ్ళలో ఉన్నాను. 4 నేను ఆ సందేశాన్ని స్పష్టంగా, యితరులకు అర్థమయ్యేలా ప్రకటించగలగాలని కూడా ప్రార్థించండి. ఇది నా కర్తవ్యం.
5 అవిశ్వాసులతో తెలివిగా ప్రవర్తించండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. 6 మీరు మర్యాదగా, తెలివిగా మాట్లాడాలి. మీ మాటలు అందరి ప్రశ్నలకు సమాధానం యిచ్చేటట్లు ఉండాలి.
© 1997 Bible League International