Revised Common Lectionary (Semicontinuous)
హామాను ఉరితీయ బడుట
7 మహారాజూ, హామానూ మహారాణి ఎస్తేరు విందుకి వెళ్లారు. 2 విందు రెండోరోజున వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూవుండగా మహారాజు ఎస్తేరును మరల ఇలా అడిగాడు: “మహారాణి ఎస్తేరూ, నీకేం కావాలి? నువ్వేమి కోరుకున్నా సరే, దాన్ని నీకు ఇస్తాను. నీ కోరిక ఏమిటి? నీకు ఏదైనా సరే, చివరకు అర్ధ రాజ్యమైనా సరే ఇస్తాను.”
3 అప్పుడు మహారాణి ఎస్తేరు ఇలా సమాధానం యిచ్చింది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, మీరు నన్ను అనుగ్రహిస్తే, నాకూ, నా ప్రజలకీ కూడా ప్రాణదానం చెయ్యండి! నేను కోరుకొనేది అంత మాత్రమే. 4 ఎందుకంటే నాశనం చేయబడేందుకు, చంపివేయబడేందుకు, నిర్మూలించబడేందుకు నేనూ, నా ప్రజలూ అమ్మివేయబడ్డాం. మేము కేవలం బానిసలుగా అమ్మివేయబడివుంటే, నేను ఊరక ఉండి పోదును. ఎందుకంటే, అది మహారాజును విసిగించవలసినంతటి సమస్య అయ్యుండేది కాదు.”
5 మహారాజు అహష్వేరోషు మహారాణి ఎస్తేరును ఇలా ప్రశ్నించాడు: “మీ విషయంలో ఇలా చేసింది ఎవరు? నీ ప్రజలకు ఇలా చేయ సాహసించిన వ్యక్తి ఎవరు?”
6 “మాకు విరోధి, శత్రువు దుర్మార్గుడైన ఈ హామానే” అని జవాబిచ్చింది ఎస్తేరు.
దానితో, మహారాజు ముందు నిలబడ్డ హామాను భయ భీతుడయ్యాడు.
9 మహారాజు సేవకుల్లో ఒకడి పేరు హార్బోనా. ఆ నపుంసకుడు మహారాజుతో ఇలా చెప్పాడు: “హామాను యింటి దగ్గర 75 అడుగల ఉరికంబం వుంది మహారాజా. దానిమీద మొర్దెకైని ఉరి తీయించేందుకు హామాను దాన్ని నిర్మింపజేశాడు. మిమ్మల్మి హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నప్పుడు, ఆ సమాచారాన్ని తెలియజేసి, మీకు సహాయపడినది యీ మొర్దెకైయేనండి.”
“హామానుని అదే ఉరికంబం మీద ఉరి తియ్యండి” అని ఆజ్ఞాపించాడు మహారాజు.
10 దానితో, మొర్దెకైని ఉరితీయించేందు కోసం హామాను నిర్మించిన ఉరికంబం మీదనే హామాను ఉరితీయబడ్డాడు.
20 అప్పుడు జరిగిన ఘటనలన్నింటినీ మొర్దెకై గ్రంథస్తం చేయించాడు. తర్వాత అతను అహష్వేరోషు మహారాజు సామంత రాజ్యాలన్నింటిలోని యూదులందరికీ లేఖలు పంపాడు. అతనా లేఖలను దగ్గర ప్రాంతాలకే కాకుండా దూర ప్రాంతాలకు కూడా పంపాడు. 21 ఏటా అదారు నెల 14, 15 తేదీల్లో యూదులందరూ పూరీము పండుగను పాటించాలని తెలియ చెప్పేందుకుగాను మొర్దెకై ఈ పని చేశాడు. 22 అవి యూదులు తమ శత్రువులను నిశ్శేషం చేసిన రోజులు. అందుకని యూదులు పండుగ దినాలుగా జరుపుకోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన ఆ నెలను కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను ఆ రోజులను ఆనందం వెల్లివిరిసే పండుగ దినాలుగా జరుపుకోమని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లో విందులు జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవాలి, పేదలకు కానుకలివ్వాలి.
దావీదు యాత్ర కీర్తన.
124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
8 మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
ప్రార్థనాశక్తి
13 మీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే అలాంటి వాడు ప్రార్థించాలి. ఆనందంగా ఉన్నవాడు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడాలి. 14 అనారోగ్యంగా ఉన్నవాడు సంఘ పెద్దల్ని పిలవాలి. ఆ పెద్దలు వచ్చి, ప్రార్థించి ప్రభువు పేరిట అతనికి నూనె రాయాలి. 15 విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆ రోగికి ఆరోగ్యం కలుగచేస్తుంది. ప్రభువు అతనికి ఆరోగ్యం కలుగచేస్తాడు పాపం చేసి ఉంటె అతన్ని క్షమిస్తాడు.
16 అందువల్ల చేసిన తప్పుల్ని పరస్పరం ఒప్పుకోండి. ఒకరికొకరు ప్రార్థించండి. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. నీతిమంతుని ప్రార్థన బహు బలముగలది. కనుక ఎంతో మేలు చేయగలదు. 17 ఏలీయా మనలాంటి మనిషే. ఒకప్పుడు వర్షాలు కురియరాదని అతడు ఆసక్తితో ప్రార్థించాడు. మూడున్నర సంవత్సరాల దాకా వర్షాలు కురియలేదు. 18 ఆ తర్వాత మళ్ళీ ప్రార్థించాడు. ఆకాశం నుండి వర్షాలు కురిసాయి. భూమి నుండి పంటలు పండాయి.
పాపిని నీతికి మళ్ళించటం
19 నా సోదరులారా! మీలో ఎవరైనా నీతిమార్గానికి దూరంగా పోయిన వాణ్ణి వెనక్కు పిలుచుకు వస్తే యిది గమనించండి. 20 పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించినవాడు అతని ఆత్మను పాపాలన్నిటి నుండి రక్షించినవాడౌతాడు. అదీగాక అతన్ని చావు నుండి తప్పించినవాడౌతాడు.
మనకు విరోధికానివాడు మనవాడే
(లూకా 9:49-50)
38 “బోధకుడా! ఒకడు, మీ పేరిట దయ్యాల్ని వదిలించటం మేము చూశాము. అతడు మనవాడు కానందువల్ల అలా చెయ్యటం మానెయ్యమని అతనికి చెప్పాము” అని యోహాను అన్నాడు.
39 యేసు ఈ విధంగా అన్నాడు: “అతణ్ణి ఆపకండి, నా పేరిట అద్భుతం చేసినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. 40 ఎందుకంటే, మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్న వానితో సమానము. 41 ఇది నిజం, మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళని గమనించి నా పేరిట ఒక గిన్నెడు నీళ్ళు మీకు త్రాగటానికి యిచ్చినవాడు తప్పక ప్రతిఫలం పొందుతాడు.
పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం
(మత్తయి 18:6-9; లూకా 17:1-2)
42 “నన్ను విశ్వసించే ఈ పసివాళ్ళు పాపం చేయటానికి కారకులు అవటంకన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు. 43 మీరు పాపం చెయ్యటానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికి వేయండి. ఆరని మంటలు మండే నరకానికి రెండు చేతులతో వెళ్ళటం కన్నా, అవిటివానిగా నిత్య జీవంపొందటం ఉత్తమం. 44 [a] 45 పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. 46-47 [b] పాపం చెయ్యటానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. రెండు కళ్ళతో నరకంలో పడటంకన్నా ఒక కన్నుతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం. 48 అక్కడ నరకంలో పడ్డవాళ్ళు చావరు. వాళ్ళను కరుస్తున్న పురుగులు చావవు! ఆ మంటలు ఆరిపోవు(A)
49 “ప్రతి వాడు ఈ అగ్నిలో శిక్షననుభవిస్తాడు.
50 “ఉప్పు మంచిదే. కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే ఆ గుణం మళ్ళీ ఏవిధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి.”
© 1997 Bible League International