Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 73:1-20

మూడవ భాగం

(కీర్తనలు 73–89)

ఆసాపు స్తుతి కీర్తన.

73 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.
    పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.
నేను దాదాపుగా జారిపోయి,
    పాపం చేయటం మొదలు పెట్టాను.
దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.
    ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
    వారు జీవించుటకు శ్రమపడరు.[a]
మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.
    ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.
    వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.
ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.
    వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.
    వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.
    వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి
    వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.
    సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”

12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.
    మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?
    నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.
    నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.
    కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.
    కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,
    వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.
    వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.
    అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు.
భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు.
    అప్పుడు వారు అంతమైపోతారు.
20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు
    మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు.
మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను
    నీవు కనబడకుండా చేస్తావు.

సామెతలు 14:1-9

14 జ్ఞానముగల స్త్రీ తన ఇల్లు ఎలా ఉండాలో అలా చేసుకొనేందుకు జ్ఞానము ప్రయోగిస్తుంది. కాని బుద్ధిహీనురాలు ఆమె చేసే బుద్ధిహీనమైన పనుల మూలంగా తన ఇల్లు నాశనం చేసుకొంటుంది.

సరిగ్గా జీవించే మనిషి యెహోవాను గౌరవిస్తాడు. కాని నిజాయితీ లేని మనిషి యెహోవాను ద్వేషిస్తాడు.

బుద్ధిహీనుని మాటలు అతనికి కష్టం తెచ్చిపెడతాయి. కాని జ్ఞానముగలవాని మాటలు అతణ్ణి కాపాడతాయి.

పని చేయటానికి ఎద్దులు లేకపోతే గాదెలో ధాన్య ముండదు ఒక గొప్ప పంట పండించటానికి మనుష్యులు ఎద్దు బలాన్ని ఉపయోగించవచ్చు.

సత్యవంతుడు అబద్ధం చెప్పడు. అతడు మంచి సాక్షి. కాని నమ్మదగని వ్యక్తి ఎన్నడూ సత్యం చెప్పడు. అతడు చెడ్డ సాక్షి.

ఇతరులకంటె తాను మంచివాడను అని తలంచే గర్విష్ఠుడు ఒకవేళ జ్ఞానిగా ఉండాలి అనుకోవచ్చు. కాని ఆ గర్విష్ఠుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. అయితే నిజంగా జ్ఞానముగల వానికి (దేవుని నమ్మినవానికి) తెలివి సులభంగా అబ్బుతుంది.

తెలివి తక్కువ వానితో స్నేహం చేయవద్దు. తెలివి తక్కువ మనిషి నీకు నేర్పించగలది ఏమీ లేదు.

తెలివిగల మనుష్యులు వారు చేసే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తారు, గనుక వారు జ్ఞానము గలవారు. కాని బుద్ధిహీనులు మోసం చేసి జీవించవచ్చు. అనుకొంటారు గనుక వారు తెలివితక్కువ వారు.

తెలివి తక్కువ వాడు, తాను చేసిన చెడు విషయాలకు శిక్ష పొందాలి అనే మాటను గూర్చి నవ్వేస్తాడు. కాని మంచి మనుష్యులు క్షమాపణ పొందటానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తారు.

మత్తయి 17:14-21

యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం

(మార్కు 9:14-29; లూకా 9:37-43)

14 వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి, 15 “ప్రభూ! నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛ రోగంతో చాలా బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ ఉంటాడు. 16 అతణ్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.

17 అప్పుడు యేసు, “మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి. ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు. 18 యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది.

19 శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు.

20 యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం. 21 మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International