Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 1

మొదటి భాగం

(కీర్తనలు 1–41)

ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
    అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
    అతడు పాపులవలె జీవించనప్పుడు,
    దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
    ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
    సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
    అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.

అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
    వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
    ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
    చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.

ప్రసంగి 1

ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు అయిన ప్రసంగి చెప్పిన మాటలు.

అన్నీ చాల అర్థరహితాలు. “సమస్తం వృధా కాలయాపన!”[a] అంటాడు ప్రసంగి. ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా?[b] (లేదు!)

ఏవీ ఎన్నడూ మారవు

ఒక తరం మారి మరొకతరం వస్తుంది. కాని, ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించును మరియు అస్తమించును. మరల ఉదయించే చోటుకు త్వరగా వెళతాడు.

గాలి దక్షిణ దిశకి వీస్తుంది, తిరిగి ఉత్తర దిశకి వీస్తుంది. గాలి, చుట్టూ తిరిగి తిరిగి చివరకు తాను బయల్దేరిన చోటుకే రివ్వున వస్తుంది.

నదులన్నీ మరల మరల ఒక్క చోటుకే ప్రవహిస్తాయి. అవన్నీ సముద్రంలోకే పోయి పడినా సముద్రం నిండదు.

ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించలేవు.[c] అయితేనేమి, మనుష్యులు మాట్లాడుతూనే వుంటారు.[d] మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడుతూనే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. అయినా మనకి తనివి తీరదు.

కొత్తదంటూ ఏదీ లేదు

అన్నీ ఆదినుంచి ఉన్నట్లే కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ జరుగుతాయి. ఈ జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు.

10 ఎవరైనా, “చూడండి, ఇదిగో ఇది కొత్తది” అని చెప్పవచ్చు. కాని, అది ఎప్పుడూ ఇక్కడ ఉన్నదే. మనం పుట్టక ముందు అది ఇక్కడ ఉన్నదే!

11 పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలు మనుష్యులకి గుర్తుండవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జనానికి గుర్తుండవు. దానికి తర్వాత, అప్పటివాళ్లకి, తమ పూర్వపు వాళ్లు చేసిన పనులు గుర్తుండవు.

జ్ఞానం ఆనందాన్ని ఇస్తుందా?

12 ప్రసంగి అనే ఉపదేశకుడనైన నేను యెరూషలేములోని ఇశ్రాయేలు రాజును. 13 నేను విద్యను అభ్యసించి, దానివల్ల లభ్యమైన జ్ఞానాన్ని ఈ జీవితంలో జరిగే అన్ని విషయాలనూ అవగాహన చేసుకొనేందుకు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో, ఇది దేవుడు మనకి అప్పగించిన చాలా కఠినమైన పని అని నేను గ్రహించాను. 14 ఈ భూమి మీద జరిగేవాటన్నింటినీ నేను పరిశీలనగా చూశాను. అవన్నీ వ్యర్థమని గ్రహించాను. అది గాలిని మూటగట్ట ప్రయత్నించడం వంటిది. 15 (వీటిని వేటినీ మనం మార్చలేము.) వంకరగా వున్నదాన్ని అది తిన్నగా వుందని మనం చెప్పలేము. ఏదైనా ఒకటి అక్కడ లేనప్పుడు అది అక్కడ వుందని మనం చెప్పలేము.

16 “నేను చాలా తెలివైనవాడిని. నాకంటె ముందు యెరూషలేమును పాలించిన రాజులందరికంటె నేను వివేకవంతుడిని. వివేకం, జ్ఞానం వీటి గూర్చి నాకు తెలుసు!” అని నాలో నేను అనుకున్నాను.

17 వివేకం, జ్ఞానం వెర్రితనం మరియు బుద్ధి తక్కువ ఆలోచనలు చెయ్యడంకంటె ఎలా మెరుగైనవో తెలుసుకోవాలని తీర్మానించుకున్నాను. కాని, ఆ క్రమంలో వివేకం సంపాదించ ప్రయత్నించడం గాలిని పోగుచేసి, మూటగట్ట ప్రయత్నించడం వంటిదేనని నేను గ్రహించాను. 18 వివేకం పెరిగే కొద్ది మనిషికి నిరాశా నిస్పృహలు పెరుగుతాయి. వివేకం పెరిగిన మనిషి మరింత దుఃఖాన్ని కూడగట్టుకుంటాడు.

మత్తయి 23:29-39

29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!

33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.

35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.

యెరూషలేము విషయంలో దుఃఖించటం

(లూకా 13:34-35)

37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. 38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. 39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International