Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 31:10-31

పరిపూర్ణమైన భార్య

10 “పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం.
    కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం.
11 ఆమె భర్త ఆమెను నమ్మగలడు.
    అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు.
12 మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది.
    ఆమె ఎన్నడూ అతనికి చిక్కు కలిగించదు.
13 ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ
    ఎల్లప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది.
14 ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా ఉంటుంది.
    అన్ని చోట్ల నుండీ ఆమె ఆహారం తీసుకొని వస్తుంది.
15 ఆమె అతి వేకువనే మేలుకొంటుంది.
    తన కుటుంబానికి భోజనం, తన పని వారికి భోజనం ఆమె వండుతుంది.
16 ఆమె పొలాన్ని చూస్తుంది. దాన్నికొంటుంది.
    ఆమె ద్రాక్షతోట నాటేందుకు ఆమె దాచుకొన్న డబ్బు ఉపయోగిస్తుంది.
17 ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది.
    ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకోగలుగుతుంది.
18 ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది.
    మరియు రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆమె పని చేస్తుంది.
19 ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని
    తన స్వంత బట్ట నేస్తుంది.
20 ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది.
    అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది!
21 చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం విషయం దిగులు పడదు.
    ఆమె వారందరికి మంచి వెచ్చని దుస్తులు ఇస్తుంది.
22 ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది.
    సన్నని నారతో చేయబడ్డ వస్త్రాలు ఆమె ధరిస్తుంది.
23 ఆమె భర్తను ప్రజలు గౌరవిస్తారు.
    అతడు దేశ నాయకులలో ఒకడు.
24 ఆమె మంచి వ్యాపార దక్షతగల స్త్రీ. ఆమె బట్టలు, నడికట్లు తయారు చేసి
    వాటిని వ్యాపారస్థులకు అమ్ముతుంది.
25 ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు ఆమెను గౌరవిస్తారు.
    ఆమె స్థానము బలంగాను మరియు సురక్షితంగాను ఉంటుంది.
    భవిష్యత్తును గురించి సంతోషిస్తుంది.
26 ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముగా ఉంటుంది.
    ఆమె జ్ఞానం ఉపదేశముతోనిండి ఉంటుంది.
27 ఆమె ఎన్నడూ బద్ధకంగా ఉండదు.
    కాని ఆమె తన ఇంటి విషయాలను గూర్చి జాగ్రత్త తీసుకొంటుంది.
28 ఆమె పిల్లలు పెద్దవారై ఆమెను ఘనపరుస్తారు.
    మరియు ఆమె భర్త ఆమెను గూర్చి ఎన్నో మంచి విషయాలు చెబుతాడు.
29 “ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవుతారు.
    కాని నీవు శ్రేష్ఠమైన దానివి” అని ఆమె భర్త చెబుతాడు.
30 సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు.
    అయితే యెహోవాను గౌరవించే స్త్రీ పొగడబడాలి.
31 ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి.
    ఆమె చేసిన విషయాల కోసం ప్రజలు ఆమెను బహిరంగంగా ఘనపర్చాలి.

కీర్తనలు. 1

మొదటి భాగం

(కీర్తనలు 1–41)

ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
    అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
    అతడు పాపులవలె జీవించనప్పుడు,
    దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
    ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
    సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
    అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.

అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
    వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
    ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
    చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.

యాకోబు 3:13-4:3

తెలివిగల వాళ్ళు

13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. 14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది. 15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. 16 ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. 17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. 18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.

దేవుణ్ణి శరణు కోరండి

మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం? మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు చంపటానికి కూడా సిద్ధమౌతారు. మీలో అసూయ కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు. మీరు దురుద్దేశ్యంతో అడుగుతారు. కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు.

యాకోబు 4:7-8

అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సాతాన్ను ఎదిరించండి. అప్పుడు సాతాను మీనుండి పారిపోతాడు. దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా! మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి.

మార్కు 9:30-37

యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం

(మత్తయి 17:22-23; లూకా 9:43b-45)

30-31 వాళ్ళా ప్రాంతాన్ని వదిలి గలిలయ ద్వారా ప్రయాణం సాగించారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉండటం వల్ల తామెక్కడ ఉన్నది కూడా ఎవ్వరికి తెలియకూడదని ఆశించాడు. ఆయన వాళ్ళతో, “ఒకడు మనుష్యకుమారునికి ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తాడు. వాళ్ళాయన్ని చంపుతారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి బ్రతికివస్తాడు” అని అన్నాడు. 32 కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు భయం వేసింది.

దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?

(మత్తయి 18:1-5; లూకా 9:46-48)

33 వాళ్ళు కపెర్నహూము అనే పట్టణాన్ని చేరుకొన్నారు. అందరూ యింట్లోకి వెళ్ళాక యేసు వాళ్ళతో, “దార్లో దేన్ని గురించి చర్చించుకొన్నారు?” అని అడిగాడు. 34 వాళ్ళు వచ్చేటప్పుడు అందరికన్నా గొప్ప వాడెవరన్న విషయాన్ని గురించి చర్చించారు. కాబట్టి అందరూ మౌనంగా ఉండిపొయ్యారు.

35 యేసు కూర్చుంటూ, పన్నెండుగురిని పిలిచి, “ముఖ్యస్థానాన్ని వహించాలనుకొన్నవాడు అందరికన్నా చివరన ఉండి సేవచెయ్యాలి” అని అన్నాడు.

36 ఒక బాలుణ్ణి పిలుచుకు వచ్చి వాళ్ళ మధ్య నిలుచోబెట్టాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని, 37 “నా పేరిట ఇలాంటి పసివానిని అంగీకరించేవాడు నన్ను అంగీకరించినవానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించేవాడు నన్నే కాదు, నన్ను పంపినవానిని కూడా అంగీకరిస్తాడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International