Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
21 (రైతులు తమ పొలాలకు నీళ్లు పెట్టటానికి చిన్న చిన్న కాలువలు త్రవ్వుతారు. ఒక కాలువను మూసి ఇంకొక కాలువకు నీళ్లు మళ్లిస్తారు) నీరు ప్రవహించు కాలువలాగ రాజు హృదయము యెహోవా చేతిలో వున్నది. ఆయన తన ఇష్టము వచ్చిన వైపుకు తిప్పుతాడు.
2 ఒక మనిషి తాను చేసేది అంతా సరైనదే అనుకొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికి అసలైన కారణాలను యెహోవా చెబుతాడు.
3 సరైనవి, న్యాయమైనవి చేయుము. బలులకంటె వాటిని యెహోవా ఎక్కువ ప్రేమిస్తాడు.
4 ఇతరులు పనికిమాలిన వాళ్లు అన్నట్టు కళ్లతోను, హృదయ నేత్రాలతోను చూచేవారు పాపులు. ఇతరుల కంటె మేము మంచివాళ్లం అని నమ్మే హృదయం పాప భూయిష్టం.
5 జాగ్రత్తగల ఏర్పాటులు లాభం తెచ్చిపెడ్తాయి. కాని నీవు జాగ్రత్త లేకుండా, మరీ తొందరపడి పనులు చేస్తే, నీవు దరిద్రుడివి అవుతావు.
6 ఐశ్వర్యవంతుడివి కావాలని నీవు మోసం చేస్తే, నీ ఐశ్వర్యం త్వరలోనే పోతుంది. మరియు నీ ఐశ్వర్యాలు నీ మరణానికి దారి తీస్తాయి.
7 దుర్మార్గులు చేసే దుష్ట కార్యాలు వారినే నాశనం చేస్తాయి. సరైనది చేయటానికి వారు నిరాకరిస్తారు.
8 దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేయాలని ప్రయత్నిస్తారు. కాని మంచి వాళ్లు నిజాయితీగా న్యాయంగా ఉంటారు.
9 వివాదం పెట్టాలని కోరుకునే భార్యతో కలసి ఒక ఇంటిలో ఉండటం కంటే, ఇంటి కప్పు మీద నివసించటం మేలు.
10 దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ దుర్మార్గం చేయాలని కోరుతూంటారు. ఆ మనుష్యులు వారి చుట్టూరా ఉండే వారి మీద ఎలాంటి దయ చూపించరు.
11 ఒక వ్యక్తి ఇతరులకంటే తానే మంచివాడిని అని తలచినప్పటికి, అతడు శిక్షించబడితే ప్రతి ఒక్కరూ ఒక పాఠం నేర్చుకొంటారు. జరిగే సంగతుల మూలంగా జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ నేర్చుకొంటాడు. ఆ వ్యక్తి ఇంకా, ఇంకా ఎక్కువ తెలివి సంపాదిస్తాడు.
12 దేవుడు మంచివాడు. దేవునికి దుర్మార్గులు ఎవరో తెలుసు, ఆయన వారిని శిక్షిస్తాడు.
13 పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఒక వ్యక్తి తృణీకరిస్తే తర్వాత అతనికి అవసరమైనప్పుడు ఏ సహాయమూ దొరకదు.
14 ఒక వ్యక్తికి నీ మీద కోపం ఉంటే అతనికి రహస్యంగా ఒక కానుక ఇవ్వు. రహస్యంగా ఇచ్చిన కానుక గొప్ప కోపాన్ని వారించగలదు.
15 న్యాయమైన తీర్పు మంచి మనుష్యులను సంతోషింపజేస్తుంది. కాని దుర్మార్గులను అది భయపెడుతుంది.
16 ఒక మనిషి జ్ఞానమార్గాన్ని విసర్జిస్తే అతడు నాశనానికే పోతున్నాడు.
17 ఒక మనిషికి సరదా మాత్రమే అతి ముఖ్యం అయితే ఆ మనిషి దరిద్రుడు అవుతాడు. ఒకవేళ అతడు ద్రాక్షారస, భోజన ప్రియుడు అయితే అతడు ఎన్నటికీ ధనికుడు కాలేడు.
యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం
(మార్కు 11:27-33; లూకా 20:1-8)
23 యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
24 యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 25-26 బాప్తిస్మమివ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు.
వాళ్ళు, “‘దేవుడు’ అని సమాధానం చెబితే మరి అలాగైతే అతణ్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు ‘మానవులు’ అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో” అనే భయంతో పరస్పరం మాట్లాడుకొన్నారు.
27 అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు.
తండ్రి మాట పాలించిన కుమారుని ఉపమానం
28 “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.
29 “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు.
30 “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు.
31 “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు? అని యేసు అడిగాడు.”
“మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 32 మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.
© 1997 Bible League International