Revised Common Lectionary (Semicontinuous)
9 యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకార్యాలను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము.
పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.
10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు.
యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు.
11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము.
ఈ శత్రువులు అబద్ధీకులు.
వారు అసత్యాలు చెబుతారు.
12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.
13 మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో
నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా
పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను.
14 మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను.
శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను.
మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను.
మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.
15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు.
యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.
ఆమె అంటుంది
2 నేను నిద్రించానేగాని
నా హృదయం మేల్కొనేవుంది.
నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను
“నా ప్రియ సఖీ, ప్రేయసీ, నా పావురమా, పరిపూర్ణవతీ! తలుపు తెఱువు.
నా తల మంచుతో తడిసింది
నా జుట్టు రేమంచు జడికి నానింది.”
3 “నేను నా పైవస్త్రం తొలగించాను,
దాన్ని తిరిగి ధరించాలని అనిపించలేదు.
నేను నా పాదాలు కడుక్కున్నాను.
అవి తిరిగి మురికి అవడం ఇష్టం లేక పోయింది.”
4 తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు[a]
నేనతని పట్ల జాలినొందాను.[b]
5 నా చేతుల నుంచి జటామాంసి జారగా,
నా వేళ్ల నుంచి జటామాంసి పరిమళ ద్రవ్యం తలుపు గడియ పైకి జాలువారగా
నేను నా ప్రియునికి తలుపు తీయ తలంచాను.
6 నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను,
కాని అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు!
అతడు వెళ్లిపోయినంతనే
నా ప్రాణం కడగట్టింది.[c]
నేనతని కోసం గాలించాను.
కాని అతడు కనిపించలేదు.
నేనతన్ని పిలిచాను,
కాని అతడు బదులీయలేదు.
7 నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు
నన్ను కొట్టి,
గాయపరిచారు.
ప్రాకారం కావలివారు
నా పైవస్త్రాన్ని కాజేశారు.
8 యెరూషలేము స్త్రీలారా,
నా ప్రియుడు మీ కంట పడితే చెప్పండి, నీ ప్రియురాలు నీ ప్రేమతో కృంగి కృశించి పోతోందని.
ఆమెకు యెరూషలేము స్త్రీల ప్రశ్నలు
9 అతిసుందరవతీ, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి?
ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు దేనిలో ఎక్కువ?
అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు?
యెరూషలేము స్త్రీలకు ఆమె సమాధానం
10 నా ప్రియుడు ఎర్రగా ప్రకాశించు శరీరం కలవాడు, తెల్లనివాడు.
పదివేలలోనైన గుర్తింపుగలవాడు.
11 మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి
నొక్కునొక్కుల కారునల్లటి శిరోజాలవాడు.
12 అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరే పావురాలకళ్లలాంటివి.
పాల మునిగిన పావురాలవలెను,
బంగారంలో పొదిగిన రత్నాల వలెను,
13 అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల
పరిమళ పుష్పరాశులవలెను,
అతని పెదవులు అత్తరువారి బోళంతో
తడిసిన కెందామరలు (ఎర్ర తామరలు).
14 అతని చేతులు వజ్రాలు పొదిగిన
బంగారు కడ్డీల సమానం
అతని శరీరం నీలాలు తాపిన నున్నటి
దంత దూలము వలెను,
15 అతని పాదాలు బంగారు దిమ్మమీది
పాలరాతి స్తంభాల వలెను,
అతని సుదీర్ఘ శరీరం లెబానోను పర్వతం మీది
నిటారైన దేవదారు వృక్షాన్ని తలపింపజేయును.
16 ఔనౌను, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు అత్యంత వాంఛనీయుడు,
అతని అధరం పెదవి అత్యంత మధురం
అతనే నా ప్రియుడు,
నా ప్రాణ స్నేహితుడు.
యెరూషలేము స్త్రీలు ఆమెకు చెప్తారు
6 అతి సుందరవతీ,
ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు?
ఏ దిక్కు కెళ్లాడు?
నీ ప్రియుని సంగతి మాకు చెప్పు, వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము.
ఆమె వారికిచ్చిన సమాధానం
2 సుగంధ పుష్పాల ఉద్యాన వనానికి నా ప్రియుడు వెళ్లాడు.
తన సుగంధాలు వెదజల్లు పూలమొక్కల తోటకు గొర్రెలు మేపడానికి వెళ్లాడు
3 నేను ఎర్రని పుష్పాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను.
నా ప్రియుడు నా వాడు.
19 ఎందుకంటే, తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు. 20 నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్పేమిటి? కాని మంచి చేసి కూడ బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమౌతుంది. 21 దేవుడు మిమ్మల్ని పిలిచింది అందు కోసమే! మీకు ఆదర్శంగా ఉండాలనీ, మీరు తన అడుగు జాడల్లో నడచుకోవాలనీ క్రీస్తు మీకోసం కష్టాలనుభవించాడు.
22 “ఆయన ఏ పాపం చేయలేదు!
ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు!”(A)
23 వారాయన్ని అవమానించినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడలేదు. కష్టాలను అనుభవించవలసి వచ్చినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు. దానికి మారుగా, న్యాయంగా తీర్పు చెప్పే ఆ దేవునికి తనను తాను అర్పించుకున్నాడు. 24 ఆయన మన పాపాలను సిలువపై భరించాడు. పాపం చేస్తూ జీవించటం మానుకున్న మనం నీతిగా జీవించాలని యిలా చేసాడు. ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మాని పోయాయి. 25 ఎందుకంటే, ఇదివరలో మీరు దారి తప్పిన గొఱ్ఱెల్లా ప్రవర్తించారు. కాని యిప్పుడు మీరు, మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి, అధిపతి దగ్గరకు తిరిగి వచ్చారు.
© 1997 Bible League International