Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.
2 నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
3 ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
5 యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
6 నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.
ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.
27 భవిష్యత్తులో జరిగే దానిని గూర్చి అతిశయించవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు.
2 నిన్ను నీవే ఎన్నడూ పొగడుకోవద్దు. ఆ పని ఇతరులను చేయనివ్వు.
3 మోయుటకు ఒక బండ బరువుగాను యిసుక గట్టిగాను ఉంటాయి. కాని ఒక బుద్ధిహీనుని కోపము మూలంగా కలిగిన కష్టాన్ని మోయటం ఆ రెండింటి కంటే సహించడం కష్టం.
4 కోపం క్రూరమైంది. నీచమైంది. అది నాశనం కలిగిస్తుంది. కాని అసూయ మరీ దౌర్భాగ్యం.
5 దాచబడిన ప్రేమకంటె బహిరంగ విమర్శ మేలు.
6 ఒక స్నేహితుడు అప్పుడప్పుడు నిన్ను బాధించవచ్చు. కాని ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని అతడు కోరుకోడు. ఒక శత్రువు విషయం వేరుగా ఉంటుంది. ఒక శత్రువు నీ మీద దయగా ఉన్నప్పటికీ అతడు నిన్ను బాధించగోరుతాడు.
7 నీకు ఆకలి లేకపోతే అప్పుడు నీవు తేనె కూడా తినలేవు. కాని ఆకలిగా ఉంటే ఏదైనా తినేస్తావు దాని రుచి బాగులేకున్నా సరే.
8 తన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి దూరంగా ఉన్న పక్షిలాంటివాడు.
9 పరిమళాలు, సువాసన వస్తువులు నిన్ను సంతోష పెడ్తాయి. కాని ఆపత్తు నీ మనశ్శాంతిని భంగం చేస్తుంది. అదే రీతిగా స్నేహితుని హృదయం నుండి వచ్చే మధురమైన హితవు వుంటుంది.
10 నీ స్నేహితులను, నీ తండ్రి స్నేహితులను మరువకు. మరియు నీకు కష్టం వస్తే సహాయం కోసం చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లవద్దు. చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లడం కంటే నీ దగ్గరలో ఉన్న నీ పొరుగువారిని అడగటం మంచిది.
11 నా కుమారుడా జ్ఞానము కలిగివుండు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడు నన్ను విమర్శించే వారికి ఎవరికైనా సరే నేను జవాబు చెప్పగలను.
12 జ్ఞానముగల వారు కష్టం రావడం గమనించి, దాని దారిలో నుండి తప్పుకుంటారు. కాని బుద్ధిహీనుడు సూటిగా చిక్కులోకి వెళ్లి దాని మూలంగా శ్రమపడతాడు.
13 మరో మనిషి అప్పుల కోసం నీవు బాధ్యత వహిస్తే, నీవు నీ చొక్కా పోగొట్టుకుంటావు.
14 “శుభోదయం” అని గట్టిగా అరుస్తూ తెల్లవారకట్లనే నీ పొరుగు వారిని మేలుకొలుపవద్దు. అది అతనికి ఒక శాపం అనుకుంటాడే కాని దీవెన అనుకోడు.
15 ఎప్పుడూ వివాదం పెట్టుకోవాలని చూచే భార్య వర్షపు రోజున ఆగకుండా కురిసే చినుకుల్లాంటిది. 16 ఆ స్త్రీని వారించటం పెను గాలిని వారించ ప్రయత్నించినట్టే ఉంటుంది. అది నీ చేతితో నూనె పిండేందుకు ప్రయత్నించినట్టు ఉంటుంది.
17 ఇనుప కత్తులను పదును చేసేందుకు ఇనుప ముక్కలను మనుష్యులు వాడుతారు. అదే విధంగా మనుష్యులు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఒకరిని ఒకరు పదును చేస్తారు.
18 అంజూరపు చెట్ల విషయం శ్రద్ధగలవాడు దాని ఫలాలు తినగలుగుతాడు. అదే విధంగా తన యజమానుని విషయమై శ్రద్ధగలవాడు ప్రతిఫలం పొందుతాడు. అతని యజమాని అతని గూర్చి శ్రద్ధ పుచ్చుకుంటాడు.
19 ఒక మనిషి నీళ్లలోనికి చూసినప్పుడు అతడు తన స్వంత ముఖాన్నే చూడగలుగుతాడు. అదే విధంగా ఒక మనిషి హృదయం నిజానికి అతడు ఎలాంటివాడో తెలియచేస్తుంది.
20 మరణస్థానం మరియు నాశన స్థలము ఎన్నటికీ తృప్తిపడవు. మానవుని కన్నులు కూడ ఎన్నటికీ తృప్తినొందవు.
21 బంగారాన్ని, వెండిని శుద్ధి చేయటానికి మనుష్యులు అగ్నిని ఉపయోగిస్తారు. అదే విధంగా ఒక మనిషికి ప్రజలు ఇచ్చే మెప్పుద్వారా అతడు పరీక్షించబడతాడు.
22 ఒక బుద్ధిహీనుని నీవు పొడుంగా నూర్చినా అతనిలోని తెలివి తక్కువ తనాన్ని నీవు బయటకు నెట్టివేయలేవు.
23 నీ గొర్రెలను, పశువులను జాగ్రత్తగా చూసుకో, నీకు చేతనైనంత బాగా వాటిని గూర్చి శ్రద్ధ తీసికో. 24 ఐశ్వర్యం శాశ్వతంగా ఉండదు. రాజ్యాలు కూడా శాశ్వతంగా ఉండవు. 25 మనుష్యులు ఎండుగడ్డి కోస్తే కొత్త గడ్డి పెరగటం మొదలవుతుంది. తరువాత కొండల మీద వెరుగుతున్న ఆ గడ్డిని వారు కోస్తారు. 26 (అందుచేత నీకు ఉన్న దానితో సంతృప్తిగా ఉండు.) నీ గొర్రెపిల్లల బొచ్చు నుండి నీవు బట్టలు చేసికోవచ్చు. నీ మేకలు అమ్మగా వచ్చిన డబ్బుతో నీవు భూమి కొనవచ్చును. 27 మిగిలిన నీ మేకలు సమృద్ధిగా పాలు ఇస్తాయి. కనుక నీకు, నీ కుటుంబానికి కూడా సరిపడినంత ఆహారం ఉంటుంది. నీ దాసీలను ఆరోగ్యవంతులుగా చేస్తుంది.
8 దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా! మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి. 9 విచారించండి, దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. మీ ఆనందాన్ని విషాదంగా మార్చుకోండి. 10 ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పైకిలేపుతాడు.
నీవు న్యాయాధిపతివి కావు
11 సోదరులారా! పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు, లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించినవానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్నమాట. 12 ధర్మశాస్త్రాన్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించగలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే. మరి యితర్లపై తీర్పు చెప్పటానికి నీవెవరు?
ప్రగల్భాలు చెప్పుకోకండి
13 వినండి! “ఈ రోజో లేక రేపో మేము ఈ పట్టణానికో లేక ఆ పట్టణానికో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం గడిపి వ్యాపారం చేసి డబ్బు గడిస్తాము” అని మీరంటూ ఉంటారు. 14 అంతెందుకు, రేపేమి జరుగబోతుందో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనిపించి ఆ తర్వాత మాయమైపోయే పొగమంచు లాంటి వాళ్ళు. 15 మీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి యిదీ అదీ చేస్తాము” అని అనాలి. 16 మీరు గర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా ప్రగల్భాలు పలకటం తప్పు. 17 అందువల్ల మంచి చెయ్యటానికి నేర్చుకొన్నవాడు మంచి పనినే చెయ్యాలి. అలా చెయ్యకపోవటం పాపం అవుతుంది.
© 1997 Bible League International