Revised Common Lectionary (Semicontinuous)
మొదటి భాగం
(కీర్తనలు 1–41)
1 ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
అతడు పాపులవలె జీవించనప్పుడు,
దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
2 ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
3 కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
4 అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
5 ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
యాకె కుమారుడు ఆగూరు జ్ఞాన సూక్తులు
30 యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం:
2 భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు. 3 జ్ఞానము కలిగి ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి నాకు ఏమీ తెలియదు. 4 ఏ మనిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. ఏ మనిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. ఈ సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది?
5 దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని దగ్గరకు వెళ్లే మనుష్యులకు ఆయన ఒక క్షేమస్థానం 6 కనుక దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను శిక్షించి, నీవు అబద్ధాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు.
7 యెహోవా, నేను చనిపోక ముందు నా కోసం రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను. 8 అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి. నన్ను మరీ ధనికునిగా లేక మరీ దరిద్రునిగా చేయవద్దు. ప్రతిరోజూ నాకు అవసరమైన వాటిని మాత్రమే అనుగ్రహించు. 9 నాకు అవసరమైన దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను దరిద్రుడనైతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం తెస్తాను.
10 ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు.
నా సందేశం: సిలువ వేయబడిన యేసు క్రీస్తు
2 సోదరులారా! నేను మీ దగ్గరకు వచ్చి దేవుని రహస్యాన్ని ప్రకటించినప్పుడు మాటల చాతుర్యంతో గాని లేక ఉత్కృష్టమైన విజ్ఞానంతో గాని ప్రకటించలేదు[a] 2 ఎందుకంటే నేను మీతో ఉన్నప్పుడు యేసు క్రీస్తునూ, ఆయన సిలువ మరణాన్ని తప్ప మిగతా వాటిని గురించి మరచిపోవాలని నిర్ణయించుకొన్నాను. 3 నేను మీదగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ వచ్చాను. 4 మిమ్నల్ని సమ్మతింప చెయ్యాలని నేను జ్ఞానంతో నిండిన పదాలుపయోగించి నా సందేశం బోధించలేదు. దేవుని ఆత్మ యిచ్చిన శక్తినుపయోగించి నా సందేశంలో ఉన్న సత్యాన్ని ఋజువు చేసాను. 5 మీ విశ్వాసానికి మానవుల పాండిత్యం కాకుండా దేవుని శక్తి పునాదిగా ఉండాలని నా ఉద్దేశ్యం.
© 1997 Bible League International