Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 8:1

నిబంధన మందసం దేవాలయానికి తేబడుట

రాజైన సొలొమోను తరువాత ఇశ్రాయేలు పెద్దలందరినీ, ఆయా వంశాల ప్రధాన పురుషులను, ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలను ఒక చోటికి పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో తన వద్దకు రమ్మని చెప్పాడు. సీయోను అనబడే దావీదుపురంనుండి దేవుని ఒడంబడిక పెట్టెను దేవాలయానికి తరలించే కార్యక్రమంలో పాల్గొనమని సొలొమోను వారిని కోరాడు.

1 రాజులు 8:6

అప్పుడు యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టె దాని అసలైన స్థానంలో ఉంచారు. అది అతి పరిశుద్ధ స్థలము. ఒడంబడిక పెట్టె కెరూబుల రెక్కల కిందుగా ఉంచబడింది.

1 రాజులు 8:10-11

10 యాజకులు అతి పరిశుద్ధ స్థలాన్ని వదిలి బయటికి వచ్చిన పిమ్మట, ఒక మేఘం యెహోవా దేవాలయాన్ని కమ్మివేసింది. 11 యెహోవా మహిమతో దేవాలయం నిండిపోగా యాజకులు తమ విధులను నిర్వర్తించలేక పోయారు.

1 రాజులు 8:22-30

22 పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు. రాజైన సొలొమోను చేతులు చాపి, ఆకాశంవైపు చూశాడు. 23 అతనిలా అన్నాడు:

“ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా! నీవంటి యెహోవా ఆకాశంలో గాని, భూమి మీద గాని మరొక్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పక అమలు పర్చుతావు. 24 నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానం చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్దానం ఈ రోజు నిజమయ్యేలా చేశావు. 25 ఇశ్రాయేలీయుల దేవుడవైన నా ప్రభువా, నా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడ ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు: ‘నీవు నా ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ననుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇశ్రాయేలును పాలించటానికి ఒకనిని కలిగి వుంటావు.’ 26 ఇశ్రాయేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా తండ్రికిచ్చిన ఆ వాగ్దానం కొనసాగించుమని కూడా నేను వేడు కుంటున్నాను.

27 “కాని దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడ ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు. 28 దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. 29 గతంలో నీవు, ‘నేనక్కడ గౌరవింపబడుదు’నని చెప్పావు. దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉండు. ఈ దేవాలయంలో నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. 30 దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని మేము నిన్ను వేడుకుంటున్నాము.

1 రాజులు 8:41-43

41-42 “ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నీ ప్రతిభా విశేషాలను గురించి వింటారు. వారు దూర ప్రాంతాలనుండి దేవాలయానికి ప్రార్థనలు చేయటానికి వస్తారు. 43 నీ పరలోక నివాసంనుండి దయచేసి వారి మనవి ఆలకించు. ఇతర ప్రాంతాలవారు నిన్నడిగినదంతా దయచేసి నెరవేర్చు. ఇశ్రాయేలులో నీ ప్రజలు నీపట్ల ఎలాంటి భయభక్తులతో మెలుగుతారో, వారు కూడ అలా నీపట్ల విధేయులైయుంటారు. అప్పుడు సర్వప్రాంతాల ప్రజలంతా నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయం గురించి తెలుసుకుంటారు.

కీర్తనలు. 84

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన

84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
    నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
    పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
    అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
    వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.

ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
    వారు నిన్నే నడిపించ నిస్తారు.
దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
    నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
    ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.

సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
    యాకోబు దేవా, నా మాట వినుము.

దేవా, మా సంరక్షకుని కాపాడుము.
    నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
    నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
    నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
    దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
    ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.

ఎఫెసీయులకు 6:10-20

దేవుడు యిచ్చిన ఆయుధాలు

10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. 11 సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. 12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. 13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.

14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. 16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. 17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. 18 ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.

19 నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. 20 సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి.

యోహాను 6:56-69

56 నా శరీరం తిని, నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు.

57 “సజీవుడైన నా తండ్రి నన్ను పంపాడు. ఆయన కారణంగానే నేను జీవిస్తున్నాను. అదే విధంగా నన్ను ఆహారంగా తిన్నవాడు నాకారణంగా జీవిస్తాడు. 58 పరలోకం నుండి దిగివచ్చిన నిజమైన ఆహారం యిదే! ఇది మన పూర్వీకులు తిన్న ఆహారంలాంటిది కాదు. వాళ్ళు అది తిన్నా చనిపొయ్యారు. కాని ఈ ఆహారాన్ని తిన్నవాళ్ళు అనంతజీవితం పొందుతారు.”

59 యేసు, కపెర్నహూములోని యూదుల సమాజ మందిరంలో బోధిస్తూ ఈ విషయాలు చెప్పాడు.

చాలా మంది శిష్యులు యేసును వదిలి వెళ్ళటం

60 ఆయన చెప్పినవి విని చాలా మంది శిష్యులు, “ఈ బోధన చాల కష్టమైనది. దీన్ని ఎవరు అంగీకరించగలరు?” అని అన్నారు.

61 తన శిష్యులు ఈ విషయాన్ని గురించి గొణుక్కుంటున్నారని యేసు గ్రహించాడు. ఆయన వాళ్ళతో, “ఇది మీకు కష్టంగా ఉందా? 62 మనుష్యకుమారుడు, తాను ముందున్న చోటికి వెళ్ళటం చూస్తే మీరెమంటారు? 63 ఆత్మ జీవాన్నిస్తాడు. శరీరానికి విలువ లేదు. నామాటలు ఆత్మకు సంబంధించినవి. అవి జీవం. 64 కాని, మీలో కొందరు నమ్మటం లేదు” అని అన్నాడు. తనను నమ్మని వాడెవడో, తనకు ద్రోహం చేసేవాడెవడో యేసుకు ముందునుండి తెలుసు. 65 యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “తండ్రి అనుమతిస్తే తప్ప నా దగ్గరకు ఎవ్వరూ రాలేరని అందుకే అన్నాను.”

66 ఆ రోజు నుండి చాలా మంది శిష్యులు ఆయన్ని అనుసరించటం మానుకొని వెనక్కు మళ్ళి పోయారు.

67 యేసు, “మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా?” అని పన్నెండు మందిని అడిగాడు.

68 సీమోను పేతురు, “ప్రభూ మేము ఎవరి దగ్గరకు వెళ్ళాలి? అనంత జీవితాన్ని గురించి చెప్పే మాటలు మీ దగ్గర ఉన్నాయి. 69 మీరు దేవునికి సంబంధించిన వారని, పవిత్రులని మాకు తెలుసు. అది మేము నమ్ముతున్నాము” అని సమాధానం చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International