Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన
84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
2 యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
3 సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.
5 ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
వారు నిన్నే నడిపించ నిస్తారు.
6 దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
7 వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.
8 సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
యాకోబు దేవా, నా మాట వినుము.
9 దేవా, మా సంరక్షకుని కాపాడుము.
నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
సొలొమోను, హీరాము
5 హీరాము అనునతను తూరు దేశానికి రాజు. అతను దావీదుకు చిరకాల స్నేహితుడు. దావీదు స్థానంలో సొలొమోను రాజ్యానికి వచ్చాడని విన్న హీరాము తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు. 2 సొలొమోను వారిద్వారా రాజైన హీరాముకు ఇలా చెప్పి పంపాడు:
3 “నా తండ్రియగు రాజైన దావీదు చుట్టుప్రక్కల రాజ్యాల వారితో అనేక యుద్ధాలు చేసినట్లు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ లేకపోయాడు. తన శత్రువులందరినీ యెహోవా తాను ఓడించేలా చేసే వరకు రాజైన దావీదు వేచివున్నాడు. 4 కాని ఇప్పుడు యెహోవా దేవుడు నా రాజ్యం నలుమూలలా శాంతి నెలకొనేలా చేశాడు. ప్రస్తుతం నాకు శత్రువులు లేరు. నా ప్రజలు నిర్భయంగా వున్నారు.
5 “యెహోవా నా తండ్రియగు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు, ‘నీ తరువాత నీ కుమారుని రాజును చేస్తాను. నీ కుమారుడు నా పట్ల గౌరవ సూచకంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు.’ కావున ఇప్పుడు నా యెహోవా దేవునికి ఘనంగా ఒక దేవాలయం నిర్మింపజేస్తున్నాను. 6 అందువల్ల ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా కొరకు దేవదారు వృక్షాలను పడగొట్టాలి. నా పనివాళ్లు నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు[a] సీదోను వడ్రంగులకు సాటిరారు.”
7 సొలొమోను అడిగినదంతా విన్న హీరాము చాలా సంతోషపడ్డాడు. “ఆ మహా సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరించటానికి దావీదుకు ప్రజ్ఞాశాలియైన కుమారుని ప్రసాదించినందుకు దేవునికి ఈ రోజు నమస్కరిస్తున్నాను!” అని రాజైన హీరాము అన్నాడు. 8 అప్పుడు హీరాము ఒక సమాచారాన్ని సొలొమోనుకు యిలా పంపాడు:
“నీవు అడిగిన విషయాలన్నీ నేను విన్నాను. నీవు కోరినన్ని దేవదారు వృక్షాలను, సరళపు చెట్లను నీకు యిస్తాను. 9 నా పనివాళ్లు ఆ దూలాలన్నిటినీ లెబానోను నుండి సముద్రతీరానికి చేరవేస్తారు. వాటిని నేను తెప్పలుగా కట్టించి సముద్రంలో వేయించి నీవు కోరిన స్థలానికి చేరేలా చేస్తాను. అక్కడ ఆ దూలాలను విడివిడిగా తీస్తాను. వాటిని నీవు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా నీవు నా మాట మన్నించి నా రాజకుటుంబ పోషణకు తగిన ఆహార పదార్థాలను సమకూర్చుతావని ఆశిస్తున్నాను.”
10 ఆ విధంగా హీరాము దేవదారు, సరళపు చెట్ల కలపను సొలొమోనుకు సరఫరా చేయసాగాడు.
11 సొలొమోను కూడ హీరాముకు అతని ఇంటి వారి పోషణకు రెండు లక్షల తూముల గోధుమలు, మూడు వేల ఎనిమిది వందల[b] పడుల స్వచ్ఛమైన ఒలీవ నూనెను ప్రతియేటా పంపాడు.
12 యెహోవా చేసిన వాగ్దానం ప్రకారం ఆయన సొలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని కలుగజేశాడు. హీరాము, సొలొమోనుల మధ్య శాంతి, సామరస్యాలు నెలకొన్నాయి. ఆ ఇద్దరు రాజులు ఒక ఒడంబడిక చేసుకున్నారు.
నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము
(మత్తయి 7:7-11)
5-6 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “ఒక వేళ మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన స్నేహితుని యింటికి వెళ్ళి, ‘నా స్నేహితుడు ఒకడు అకస్మాత్తుగా మా యింటికొచ్చాడు. మా యింట్లో తినటానికి ఏమి లేదు. మూడు రొట్టెలుంటే యిస్తావా?’ అని అడిగాడనుకొండి. 7 ఆ స్నేహితుడు యింటి నుండి బయటకు రాకుండా, ‘నేను, నా పిల్లలు పడుకున్నాం. తలుపులు కూడా తాళం వేసాం. అనవసరంగా బాధ పెట్టొద్దు. అయినా యిప్పుడు లేచి నేను రొట్టెలివ్వలేను’ అని అన్నాడనుకోండి. నేను చెప్పేదేమిటంటే, 8 అతడు తన స్నేహితుడైనందుకు రొట్టెలు యివ్వకపోయినా మొండిగా అడగటం వల్ల తప్పక లేచి అతడడిగిన రొట్టెలు యిస్తాడు. 9 కనుక, నేను మీకు చెప్పేదేమంటే; అడగండి, మీకు లభిస్తుంది. వెతకండి దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది. 10 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన వానికి దొరుకుతుంది. తలుపు తడితే అది అతని కోసం తెరుచుకుంటుంది. 11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు? 12 లేక గ్రుడ్డునడిగితే తేలునిస్తాడు? 13 మీరు చెడ్డవాళ్లైనా మీ కుమారులకు మంచి బహుమతులు ఎట్లా యివ్వాలో మీకు తెలుసు. కనుక పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగినవాళ్ళకు పవిత్రాత్మను తప్పక యిస్తాడని గ్రహించండి” అని చెప్పాడు.
© 1997 Bible League International