Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన
84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
2 యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
3 సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.
5 ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
వారు నిన్నే నడిపించ నిస్తారు.
6 దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
7 వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.
8 సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
యాకోబు దేవా, నా మాట వినుము.
9 దేవా, మా సంరక్షకుని కాపాడుము.
నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
20 యూదాలోను, ఇశ్రాయేలులోను జనాభా విపరీతంగా పెరిగింది. సముద్రతీరాన ఇసుక రేణువులా ప్రజానీకం విస్తరించింది. ప్రజలంతా సుఖసంతోషాలతో తింటూ, తాగుతూ, విలాసంగా జీవిస్తూవున్నారు.
21 యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల రాజ్యం వరకుగల రాజ్యాలన్నిటిపైన సొలొమోను పరిపాలన సాగించాడు. అతని రాజ్యం ఈజిప్టు సరిహద్దుల వరకు వ్యాపించింది. ఈ సామ్రాజ్యాధిపతులంతా సొలొమోను ఆధిపత్యాన్ని అతని జీవితాంతంవరకు అంగీకరించి అతనికి పన్ను చెల్లిస్తూ వచ్చారు.[a]
22-23 సొలొమోను రాజుకు, ఆయన బల్ల వద్ద భోజనం చేసే వారికి సరిపడు దినసరి ఆహార పదార్థాలు ఈ విధంగా వున్నాయి: ఆరువందల తూముల[b] మెత్తని గోధుమ పిండి; పన్నెండు వందల తూముల ముతక పిండి; మంచి మేపులో ఉన్న పది ఆవులు; పొలాల్లో మేసే ఇరువది ఆవులు; వంద గొర్రెలు; మూడురకాల దుప్పులు; ప్రత్యేకంగా ఎంపిక చేసిన బాతులు మొదలగు పక్షిజాతులు.
24 యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాన గల రాజ్యాలన్నిటినీ సొలొమోను పరిపాలించాడు. ఈ ప్రాంతం తిప్సహు మొదలు గాజా వరకు వ్యాపించి వున్నది. సొలొమోను సామ్రాజ్యంలో నలుమూలలా శాంతి నెలకొన్నది. 25 సొలొమోను జీవించినంత కాలం యూదాలోను, ఇశ్రాయేలులోని దాను నుండి బెయేర్షెబా వరకు ప్రజలంతా శాంతి భద్రతలతో నివసించారు. ప్రజలు తమ తమ అంజూరపు చెట్ల క్రింద, ద్రాక్షాలతల క్రిందను కూర్చుని సుఖశాంతులతో జీవితం గడిపారు.
26 సొలొమోను తన రథాలను లాగే నాలుగు వేల గుర్రాలను ఉంచుటకు తగిన శాలలు ఏర్పాటు చేశాడు. అతనికి పండ్రెండు వేల గుర్రాలు వున్నాయి. తన రథాశ్వములకై సొలొమోను నాలుగు వేల[c] గుర్రపు శాలలు కలిగియున్నాడు. సొలొమోనుకు పండ్రెండు వేల మందిగల గుర్రపు దళం కూడా వున్నది. 27 ప్రతినెల పన్నెండు మంది మండలాధిపతులలో ఒక్కొక్కడు చొప్పున సొలొమోను రాజుకు కావలసిన సరుకులన్నిటినీ సమకూర్చి పెట్టేవాడు. రాజు బల్ల వద్ద తినే వారందరికీ ఇవన్నీ సరిపోయేవి. 28 రాజు యొక్క రథాశ్వములకు, స్వారి గుర్రాలకు తగినంత పచ్చగడ్డిని, యవధాన్యమును మండలాధిపతులు సేకరించి సరఫరా చేసేవారు. ప్రతి ఒక్కడూ ఈ ధాన్యాన్ని నియమిత స్థానాలకు చేరవేసేవాడు.
ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి
5 సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, వాటి సమయాలను గురించి, కాలాలను గురించి మేము వ్రాయనవసరం లేదు. 2 ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు. 3 ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.
4 కాని సోదరులారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు. 5 మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించినవాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించినవాళ్ళము కాము. 6 మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము. 7 ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు. 8 మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను, రక్షణ, నిరీక్షణలను శిరస్త్రాణంగాను ధరించుదాము.
9 ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు. 10 మనం మరణించినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మనకోసం మరణించాడు. 11 మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహపరుచుకుంటూ, యితర్ల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి.
© 1997 Bible League International