Revised Common Lectionary (Semicontinuous)
10 ఇవన్నీ చెప్పి దావీదు చనిపోయాడు. దావీదు నగరంలో అతడు సమాధి చేయబడ్డాడు. 11 దావీదు నలభై సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పరిపాలించాడు. అతడు హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పాలించాడు.
సొలొమోను, అదోనియ
12 ఇప్పుడు సొలొమోను తన తండ్రియగు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు రాజు అని చెప్పటానికి ఏరకమైన అనుమానం లేదు.[a]
3 యెహోవాను ప్రేమించినట్లుగా సొలొమోను నిరూపించుకున్నాడు. తన తండ్రియగు దావీదు చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కాని సొలొమోను ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి చెప్పనిది చేశాడు. అదేమనగా సొలొమోను గుట్టలపై బలులు అర్పించటం, ధూపం వేయటం, కొనసాగించాడు.
4 సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్నిటిలో చాలా పేరు గాంచిన గుట్ట. సొలొమోను ఆ బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్పించాడు. 5 సొలొమోను గిబియోను వద్ద వున్నప్పుడు యెహోవా అతనికి స్వప్నంలో దర్శన మిచ్చాడు. “నీవేదైనా కోరుకో. నీ కోరిక నెరవేర్చుతాను” అని యెహోవా అన్నాడు.
6 సొలొమోను ఇలా అన్నాడు: “నీ సేవకుడగు నా తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. అతను నిన్ననుసరించాడు. అతను కూడా మంచివాడై, ధర్మంగా జీవించాడు. నీవతని కుమారుని రాజ్యా సింహాసనానికి అర్హుణ్ణి చేసినప్పుడు, నీవు అతనికి అపూర్వమైన కరుణ చూపావు. 7 నా ప్రభువైన దేవా! నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చేసేలా నాకు అనుమతి ఇచ్చావు. కాని నేనింకా పసివానిలా వున్నాను. నేను నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చటానికి తగిన వివేకం నాకు కొరతగా ఉంది. 8 నీ సేవకుడనైన నేను నీచేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజల మధ్య వున్నాను. వారి జనాభా పెద్దది. వారు లెక్కపెట్టలేనంత ఎక్కువగా వున్నారు. కావున పాలకుడైన వాడు వారి విషయంలో అనేకమైన నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది. 9 అందువల్ల ఈ ప్రజానీకంపై ధర్మపరిపాలన చేయగల న్యాయ నిర్ణయం చేయగల దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయుమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ జ్ఞానమువల్ల నేను మంచి చెడుల నిర్ణయం చేయగలుగుతాను. ఈ మహా పరిజ్ఞానము లేకుండ, ఈ గొప్ప ప్రజానీకాన్ని పరిపాలించటం అసాధ్యమైన పని.”
10 సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు. 11 అతనితో దేవుడిలా అన్నాడు: “నీవు నీకు దీర్ఘాయుష్షు యిమ్మని అడుగలేదు. నీవు నీ కొరకై ధనదాన్యాదులిమ్మని అడుగలేదు. నీ శత్రునాశనం కూడ నీవు కోరుకోలేదు. మంచిచెడుల విచక్షణా జ్ఞానం, న్యాయనిర్ణయం చేయగల దక్షత నీవు అడిగావు. 12 కావున నీవడిగిన దానిని నీకు దయచేస్తాను. నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీవంటి వాడెవ్వడూ లేనట్లుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. భవిష్యత్తులో కూడ నీకు సాటి మరి ఎవ్వడూ వుండడు. 13 పైగా, నీకు పారితోషికంగా నీవు అడుగనవి కూడ నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీయంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరో రాజు వుండడు. 14 నాకు విధేయుడవై వుండుమనీ, నా న్యాయమార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించుమని నిన్ను నేనడుగుతున్నాను. నీ తండ్రి దావీదువలె నీవు కూడ నడుచుకో. నీవు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుష్షు కూడ నేనిస్తాను.”
111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
2 యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
3 దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
4 దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
5 దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
6 దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
7 దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
8 దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
9 దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.
15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.
51 పరలోకం నుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”
52 ఆ తర్వాత, “మనకు తన శరీరాన్ని తినటానికి ఈయన ఏవిధంగా యిస్తాడు?” అని యూదులు పరస్పరం తీవ్రంగా వాదించుకున్నారు.
53 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మనుష్యకుమారుని శరీరం తిని, ఆయన రక్తం తాగ్రితే తప్ప మీలో జీవం ఉండదు. 54 నా శరీరము తిని, నా రక్తం త్రాగిన వానికి అనంతజీవితం లభిస్తుంది. అతణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను. 55 ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం. నా రక్తం నిజమైన పానీయము. 56 నా శరీరం తిని, నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు.
57 “సజీవుడైన నా తండ్రి నన్ను పంపాడు. ఆయన కారణంగానే నేను జీవిస్తున్నాను. అదే విధంగా నన్ను ఆహారంగా తిన్నవాడు నాకారణంగా జీవిస్తాడు. 58 పరలోకం నుండి దిగివచ్చిన నిజమైన ఆహారం యిదే! ఇది మన పూర్వీకులు తిన్న ఆహారంలాంటిది కాదు. వాళ్ళు అది తిన్నా చనిపొయ్యారు. కాని ఈ ఆహారాన్ని తిన్నవాళ్ళు అనంతజీవితం పొందుతారు.”
© 1997 Bible League International