Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 50:16-23

16 దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు,
    “నా న్యాయ విధులను చదువుటకు,
    నా ఒడంబడికకు బద్ధులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?[a]
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.
    నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడతారు.
    వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.
19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు.
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబుతారు.
    మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను
    నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు.
కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను.
    మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
    దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
    అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
    నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”

2 సమూయేలు 12:15-25

దావీదు బత్షెబల శిశువు మరణించటం

15 పిమ్మట నాతాను ఇంటికి వెళ్లిపోయాడు. ఊరియాభార్య ద్వారా దావీదుకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బు పడేలా యెహోవా చేశాడు. 16 దావీదు బిడ్డ కొరకు దేవుని ప్రార్థించాడు. దావీదు తినటానికి, తాగటానికి నిరాకరించాడు. అతను తన ఇంట్లోకివెళ్లి లోపలే వుండి పోయాడు. రాత్రంతా నేలమీదే పడుకొని వుండిపోయాడు.

17 దావీదు కుటుంబంలో ముఖ్యులైన వారు వచ్చి దావీదును నేలమీద నుండి లేపటానికి ప్రయత్నించారు. కాని దావీదు లేవ నిరాకరించాడు. వారితో కలిసి భోజనం చేయటానికి కూడ దావీదు నిరాకరించాడు. 18 ఏడవ రోజున శిశువు మరణించింది. శిశువు మరణించిందని దావీదుతో చెప్పటానికి సేవకులు భయపడ్డారు. ఒకరితో ఒకరు వారిలా అనుకోసాగారు, “చూడండి, బిడ్డ బ్రతికివుండగా మనం అతనితో మాట్లాడాలని ప్రయత్నం చేశాము. కాని అతను మన మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ మరణం గురించి మనం తెలియ జేస్తే, అతడు తన ప్రాణానికి ముప్పు వాటిల్లే ఏ పనికైనా పాల్పడవచ్చు!”

19 కాని దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవటం గమనించి, బిడ్డ మరణించి వుండవచ్చని ఊహించాడు. “బిడ్డ చనిపోయాడా?” అని దావీదు సేవకులను అడిగాడు.

“అవును, చనిపోయాడు” అని సేవకులు అన్నారు.

20 దావీదు నేలమీద నుంచి లేచాడు. కాళ్లు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకొని, యెహోవాని ప్రార్థించటానికి ఆలయానికి వెళ్లాడు. తరువాత ఇంటికి వెళ్లి, తినటానికి ఆహారాన్ని అడిగాడు. సేవకులు కొంత ఆహారాన్ని ఇవ్వగా, అతడు తిన్నాడు.

21 దావీదు సేవకులు అతనితో ఇలా చెప్పారు, “నీవిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? బిడ్డ బ్రతికి వుండగా నీవు తినటానికి నిరాకరించావు. నీవు ఏడ్చావు. కాని బిడ్డ చనిపోగానే, లేచి భోజనం చేశావు.”

22 అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బ్రతికివుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే యెహోవా నన్ను కనికరించి బిడ్డను బ్రతికించవచ్చు! ఎవరికి తెలుసు! అనుకున్నాను. 23 కాని ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. కావున ఇప్పుడు నేనెందుకు తినటానికి నిరాకరించాలి? నేను బిడ్డను తిరిగి బతికించుకొనగలనా? లేదు! ఏదో ఒక రోజున నేనే వాని దగ్గరకు వెళతాను. అంతేగాని వాడు నా వద్దకు తిరిగి రాలేడు.”

సొలొమోను జన్మించటం

24 దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడామెతో కలిసి వుండి సంగమించగా, ఆమె గర్భవతి అయింది. ఆమెకు మరొక కుమారుడు జన్మించాడు. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా సొలొమోనును ప్రేమించాడు. 25 ప్రవక్త నాతాను ద్వారా యెహోవా తన సందేశం పంపాడు. నాతాను వచ్చి సొలొమోనుకు యదీద్యా[a] అని నామకరణం చేశాడు. దేవుని ఆజ్ఞానుసారం నాతాను అలా చేశాడు.

ఎఫెసీయులకు 4:17-24

వెలుగు పిల్లలుగా జీవించటం

17 ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి. 18 వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. 19 వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. 20 కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు. 21 మీరు యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు. 22 మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. 23 మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. 24 దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International