Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 57

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.

57 దేవా, నన్ను కరుణించు
    నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
    నేను నీ శరణు జొచ్చియున్నాను.
మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
    దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
    నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
    నాకు చూపిస్తాడు.

నా జీవితం ప్రమాదంలో ఉంది.
    నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
    మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.

దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
    నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
    వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
    కాని వారే దానిలో పడ్డారు.

దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
    నేను నీకు స్తుతులు పాడుతాను.
నా ఆత్మా, మేలుకొనుము!
    స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
    ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
    ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.

2 సమూయేలు 18:19-33

యోవాబు దావీదుకు వార్తను పంపటం

19 సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “నన్ను పరుగున పోయి ఈ వార్తను రాజైన దావీదుకు చెప్పనీయండి. నీ కొరకు శత్రువును యెహోవా నాశనం చేశాడు” అని చెపుతానన్నాడు.

20 అహిమయస్సుతో యోవాబు ఇలా అన్నాడు: “వద్దు, దావీదుకు ఈ రోజు ఈ వార్తను తీసుకొని పోవటానికి వీలులేదు. ఇంకొక రోజు ఈ వార్తను చేర వేయవచ్చు. అంతేగాని ఈ రోజు మాత్రం వద్దు. ఎందుకంటావా? రాజు యొక్క కుమారుడు చనిపోయాడు గనుక.”

21 తరువాత కూషీయుడైన ఒకనిని యోవాబు పిలిచి, “అతను చూసిన విషయాలన్నీ రాజు వద్దకు వెళ్లి చెప్పమన్నాడు.”

కూషీయుడు యోవాబుకు నమస్కరించాడు. తరువాత కూషీయుడు దావీదుకు వార్త చెప్పటానికి పరుగెత్తాడు.

22 కాని సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “ఏమి జరిగినా పరవాలేదు. నన్ను కూడా కూషీయుని వెనుక పరుగెత్తుకు వెళ్లనీయండి!” అని ప్రాధేయపడ్డాడు.

“కుమారుడా! నీవెందుకు వార్త మోసుకొని పోవాలనుకుంటున్నావు? నీవు తీసుకొని వెళ్లిన ఈ వార్తకు నీకు ఏ బహుమానమూ లభించదు!” అని యోవాబు అన్నాడు.

23 “ఏమి జరిగినా పరవాలేదు; నేను వేగంగా వెళతాను,” అన్నాడు అహిమయస్సు.

“అయితే పరుగెత్తు!” అన్నాడు యోవాబు అహిమ యస్సుతో.

అప్పుడు యొర్దాను లోయగుండా అహిమయస్సు పరుగెత్తాడు. అతడు కూషీయుని దాటి వెళ్లాడు.

దావీదు వార్త వినటం

24 నగర రెండు ద్వారాల మధ్య దావీదు కూర్చుని వున్నాడు. కావలివాడు ద్వారం మీద వున్న గోడపైకి వెళ్లి పరిశీలించాడు. దూరాన ఒకడు ఒంటరిగా పరుగెత్తుకు రావటం చూశాడు. 25 ఈ విషయం చెప్పటానికి కావలివాడు రాజును పిలిచాడు.

“ఒక్కడే గనుక వస్తూవుంటే, వాడు ఏదో వార్త తెస్తూ వున్నాడన్నమాట!” అని దావీదు రాజు అన్నాడు.

ఆ వ్యక్తి క్రమేపీ నగరాన్ని సమీపించాడు. 26 కావలివాడు ఇంకొక వ్యక్తి రావటం కూడా చూశాడు. పైనున్న కావలివాడు ద్వారపాలకుని పిలిచి, “చూడు! ఇంకొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు!” అని చెప్పాడు.

“అయితే వాడు కూడా వార్త తెస్తున్నాడు!” అని అన్నాడు రాజు.

27 “మొదటి వ్యక్తి సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెత్తుతున్నాడని నేను అనుకుంటున్నాను” అని కావాలివాడన్నాడు.

“అహిమయస్సు మంచి వ్యక్తి. అతడేదో మంచి వార్త తెస్తూ వుండవచ్చు!” అని రాజు అన్నాడు.

28 అహిమయస్సు రాజును పిలిచి, “అంతా బాగున్నది!” అన్నాడు. అహిమయస్సు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. “నీ ప్రభువైన దేవునికి స్తోత్రము. నా ఏలినవాడవైన రాజుకు వ్యతిరేకంగా వున్న వారిని యెహోవా ఓడించాడు,” అని అహిమయస్సు చెప్పాడు.

29 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని రాజు అడిగాడు.

“యోవాబు నన్ను పంపినపుడు అక్కడ పెద్ద కోలాహలం నేను చూశాను. కాని అది ఎందుకో నాకు తెలియదు” అని అహిమయస్సు సమాధానమిచ్చాడు.

30 “ఇటు పైకి వచ్చి, ఇక్కడ వుండు” అన్నాడు రాజు. అహిమయస్సు పైకి వెళ్లి ప్రక్కన నిలబడి వేచి వున్నాడు.

31 తరువాత కూషీయుడు వచ్చాడు. “నా ఏలినవాడవైన రాజుకు ఒక వార్త! నీకు వ్యతిరేకులైన ప్రజలను యెహోవా ఈ రోజు శిక్షించాడు” అని చెప్పాడు.

32 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా వున్నాడా?” అని రాజు కూషీయుని అడిగాడు.

“నీ శత్రువులు, నిన్ను గాయపర్చాలని నీకు వ్యతిరేకంగా వచ్చే ఇతర మనుష్యులు ఆ యువకునిలా (అబ్షాలోము) అయిపోతారని నేను అనుకుంటున్నాను” అని కూషీయుడు చెప్పాడు.

33 దానితో అబ్షాలోము చనిపోయాడని రాజుకు అర్థమయింది. రాజు మిక్కిలి కలతపడిపోయాడు. నగర ద్వారం మీద వున్న గది వద్దకు వెళ్లాడు. అక్కడ బాగా విలపించాడు. గదిలోకి వెళ్లాడు. గదిలోకి పోతూ, “నా కుమారుడా, అబ్షాలోమా! నా కుమారుడా, అబ్షాలోమా! నీ బదులు నేను చనిపోయి వుండవలసింది. ఓ అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా!” అని దుఃఖించాడు.

2 పేతురు 3:14-18

14 ప్రియ సోదరులారా! మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో ఏ దోషమూ, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి. 15 మన ప్రభువు యొక్క సహనము మనకు రక్షణను యిస్తుందని గ్రహించండి. దేవుడు యిచ్చిన విజ్ఞానంతో మన ప్రియమిత్రుడు పౌలు మీకు ఈ విషయాల్ని గురించి వ్రాసాడు. 16 అతడు వ్రాసిన ఉత్తరాలన్నీ యిదేవిధంగా వ్రాసాడు. వాటన్నిటిలోనూ ఈ విషయాల్ని గురించే మాట్లాడాడు. అతని ఉత్తరాల్లోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్ళు, చపల చిత్తం గలవాళ్ళు యితర లేఖనాలపై తప్పుడు వ్యాఖ్యానం చేసినట్లే దీనిమీద కూడ తప్పడు వ్యాఖ్యానం చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు నాశనమైపోతారు.

17 అందువల్ల ప్రియమైన సోదరులారా! ఇప్పుడీ విషయాలు మీకు తెలుసు. కనుక జాగ్రత్తగా ఉండండి. నీతికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తుల తప్పుడు మాటలకు మోసపోకండి. మీలో వున్న స్థిరత్వాన్ని వదులుకోకండి. 18 మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండండి. ఆయనకి ఇప్పుడూ, చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International