Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 111

111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
    నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
    దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
    వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
    ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
    ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
    దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
    దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.

1 రాజులు 1:1-30

అదోనీయా రాజుగా ప్రకటించుకొనుట

దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. అందువల్ల అతను చలికి తట్టుకోలేకపోయాడు. తన సేవకులు ఎన్ని దుప్పట్లు కప్పినాగాని, అతను చలికి వణకి పోతూనే వున్నాడు. కావున అతని సేవకులు అతనితో, “నీ ఆలనాపాలనా చూడటానికి వయస్సులో ఉన్న ఒక అమ్మాయిని మేము చూస్తాము. ఆమె నీ పక్కలో పడుకొని నీకు తగిన వెచ్చదనం సమకూర్చుతుంది.” అని అన్నారు. అలా చెప్పి రాజు సేవకులు ఇశ్రాయేలు రాజ్యమంతా ఒక చిన్నదాని కొరకు వెదక నారంభించారు. రాజుకు వెచ్చదనాన్ని ఇవ్వగలిగే రూపం, యవ్వనం ఉన్న స్త్రీ కొరకు వారు వెదకసాగారు. చివరకు అబీషగు అనబడే షూనేమీయురాలిని చూచి, ఆమెను రాజు వద్దకు తీసుకొని వచ్చారు. ఆమె చాలా అందగత్తె, ఆమె రాజుపట్ల శ్రద్ధ తీసుకొని, అతనికి సేవలు చేయనారంభించింది. కాని రాజైన దావీదు ఆమెను కూడలేదు.

5-6 దావీదు కుమారుడు అదోనీయా “నేనే రాజునౌతానని” అనుకొన్నాడు. (అదోనీయా తల్లి పేరు హగ్గీతు) అదోనీయా చాలా అందమైనవాడు. అతడు రాజు కావాలని మిక్కిలి ఉబలాటపడ్డాడు. అందువల్ల తనకు తానే ఒక రథాన్ని, గుర్రాలను సమకూర్చుకున్నాడు. తన ముందు పరుగెత్తుటకు ఏభై మంది మనుష్యులను కూడా నియమించాడు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టాడు. దావీదు రాజు ఎప్పుడూ అదోనీయాను మందలించలేదు, విమర్శించలేదు. “ఏమి చేస్తున్నావు?” అని కాని, “అది ఎందుకు చేశావు?” అని కాని అతడు ఎప్పుడూ అడగలేదు.

సెరూయా కుమారుడైన యోవాబుతోను, యాజకుడైన అబ్యాతారుతోను అదోనీయా మాట్లాడాడు. అతడు రాజు అయ్యేలాగ వారు సహాయం చేయడానికి అంగీకరించారు. కాని అదోనీయా రాజు కావడానికి ఒప్పుకోని వారిలో యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, మరియు దావీదు రాజుయొక్క ప్రత్యేక అంగరక్షకుడైన రేయీ వుండిరి. అందువల్ల వీరు అదోనీయాతో కలియలేదు.

అదోనీయా కొన్ని జంతు బలులను అర్పించాడు. అతడు కొన్ని గొర్రెలను, ఆవులను, మరియు కొన్ని బలిసిన కోడెదూడలను సమాధాన బలిగా ఇచ్చాడు. అదోనీయా ఈ బలులన్నీ ఏన్‌రోగేలు దగ్గరవున్న జోహెలేతు అను శిలవద్ద సమర్పించాడు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అదోనీయా చాలామందిని ఆహ్వానించాడు. రాజైన దావీదుయొక్క ఇతర కుమారులను, యూదా పాలకులు, నాయకులందరినీ అదోనీయా ఆహ్వానించాడు. 10 కాని అదోనీయా ప్రవక్తయగు నాతానును గాని, బెనాయానును గాని, తన తండ్రియొక్క ప్రత్యేక అంగరక్షకుని గాని, లేక తన సోదరుడు సొలొమోనును గాని ఆహ్వానించలేదు.

నాతాను బత్షెబాకు సలహా ఇచ్చుట

11 ఇదంతా విన్న నాతాను, సొలొమోను తల్లియైన బత్షెబ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏమి చేస్తున్నాడో నీవు విన్నావా? తనకై తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. మన యజమానియైన దావీదు కూడ ఈ విషయం ఎరుగడు. 12 నీ జీవితం, నీ కుమారుడైన సొలొమోను జీవితం ప్రమాదంలో పడవచ్చు. మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే నీవు ఏమి చేయాలో నేను చెబుతాను. 13 దావీదు రాజు వద్దకు వెళ్లి, ‘నా ప్రభువైన రాజా, నీ తరువాత రాజ్యానికి వారసుడు నా కుమారుడైన సొలొమోను అవుతాడని నీవు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు. 14 నీవు అలా మాట్లాడుతూ వుండగా నేను లోపలికి వస్తాను. వచ్చి, నీవు అదోనీయా గురించి చెప్పినదంతా నిజమని రాజుతో నేను చెబుతాను.”

15 తరువాత బత్షెబ రాజును చూడటానికి ఆయన పడకగదిలోనికి వెళ్లింది. రాజు ముసలివాడయ్యాడు. షూనేమీయురాలగు అబీషగు అక్కడ ఆయనకు సేవచేస్తూ వున్నది. 16 బత్షెబ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసింది. “నీకు ఏమి కావాలి?” అని రాజు ప్రశ్నించాడు.

17 బత్షెబ ఇలా చెప్పసాగింది, “మహారాజా! ప్రభువైన నీ దేవుని పేరు మీద నీవు నాకు ఒక ప్రమాణం చేశావు. ‘నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు. నా సింహాసనం మీద సొలొమోను రాజ్య పాలన చేస్తాడు’ అని అన్నావు. 18 కాని ఇప్పుడు అదోనీయా రాజయ్యాడు. అయినా ఆ విషయం నీకు తెలియదు. 19 సమాధానబలి ఇచ్చే నిమిత్తం అదోనీయా చాలా జంతువులను చంపాడు. అతడు ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. మరియు నీ కుమారులనందరినీ ఆహ్వానించాడు. యాజకుడైన అబ్యాతారును, సైన్యాధ్యక్షుడు యోవాబును కూడ అతడు ఆహ్వానించాడు. కాని అతడు నిన్ను సేవించే నా కుమారుడైన సొలొమోనును మాత్రం ఆహ్వానించ లేదు. 20 మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నిన్ను గమనిస్తూ వున్నారు. నీ తరువాత నీవు ఎవరిని రాజుగా నియమిస్తావో? అని వారు ఎదురు చూస్తూ వున్నారు. 21 నీ మరణానంతరం, నీ పితరులతో నీవు సమాధి చేయబడతావు. ప్రజలు మాత్రం నేను, సొలొమోను నేరస్థులమని భావిస్తారు.”

22 బత్షెబ ఇలా రాజుతో మాట్లాడుతూ వుండగా, ప్రవక్తయగు నాతాను రాజును చూడటానికి వచ్చాడు. 23 “ప్రవక్తయగు నాతాను ఇక్కడికి వచ్చాడు” అని సేవకులు రాజుతో చెప్పారు. నాతాను రాజువద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. 24 నాతాను రాజుతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, నీ తరువాత రాజ్య పాలనకు కొత్త రాజుగా అదోనీయాను ప్రకటించావా? నీ తరువాత ప్రజాపాలన చేయటానికి అదోనీయాను నియమించాలని నిర్ణయించావా? 25 ఈ రోజు అతను సమాధాన బలులు అర్పించాడు. అతడు చాలా ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. నీ యొక్క ఇతర కుమారులనందరిని, సైన్యాధ్యక్షుడిని, యాజకుడైన అబ్యాతారును అతడు పిలిచాడు. ఈ సమయంలో వారంతా అతనితో కలిసి తాగుతూ, తింటూ వేడుక చేసుకొంటున్నారు. పైగా, ‘రాజైన అదోనీయా వర్ధిల్లు గాక!’ అని వారంతా అంటున్నారు. 26 కాని అతను నన్నుగాని, యాజకుడైన సాదోకును గాని, యెహోయాదా కుమారుడైన బెనాయాను గాని, నీ కుమారుడైన సొలొమోనును గాని పిలువలేదు. 27 ఇదంతా చేసింది నీవేనా? మేము నిన్ను సేవిస్తూ నీకు విధేయులమైయున్నాము కదా, అయినను నీ తరువాత నీ వారసుడుగా ఎవరిని ఎన్నుకున్నదీ మాకు ఎందుకు చెప్పలేదు?”

28 ఇది విన్న రాజు బత్షెబను పిలువనంపాడు. రాజు ముందుకు బత్షెబ వచ్చింది.

29 అప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్రతి ఆపదనుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు నిత్యుడు. ఆ దైవశక్తితో నేను ప్రమాణం చేస్తున్నాను: 30 గతంలో నీకు నేనిచ్చిన మాటను ఈ రోజు నెరవేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా యొక్క శక్తితో నేనీ ప్రమాణం చేసియున్నాను. నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడని నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం మీద నా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.”

అపొస్తలుల కార్యములు 6:8-15

స్తెఫనును బంధించటం

దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. 10 కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.

11 ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు. 12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.

13-14 తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు. 15 సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International