Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
2 యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
నా మీద దయ చూపించుము.
3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.
6 యెహోవాను స్తుతించండి.
కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
7 యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
9 దేవా, నీ ప్రజలను రక్షించుము.
నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
కాపరిలా వారిని నిత్యం నడిపించుము.
10 “ఓ రాజ్యములారా (ప్రజలారా), యెహోవా యొక్క ఈ వర్తమానం వినండి!
ఈ సందేశాన్ని దూరసముద్రతీర వాసులందరికి తెలియజెప్పండి.
‘ఇశ్రాయేలు ప్రజలను చెల్లాచెదురు చేసిన ఆ సర్వోన్నతుడే
తిరిగి వారందరినీ ఒక్క చోటికి కూడదీస్తాడు.
గొర్రెల కాపరిలా తన మందను (ప్రజలను) కాచి రక్షిస్తాడు.’
11 యెహోవా యాకోబును తిరిగి తీసికొని వస్తాడు.
యెహోవా తన ప్రజలను వారి కంటె బలవంతుల బారి నుండి రక్షిస్తాడు.
12 ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు.
వారు ఆనందంతో కేకలు వేస్తారు.
యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా
వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి.
యెహోవా వారికి ఆహార ధాన్యాలను, క్రొత్త ద్రాక్షారసాన్ని,
నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు.
నీరు పుష్కలంగా లభించే
ఒక తోటలా వారు విలసిల్లుతారు.
ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట
ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు.
13 ఇశ్రాయేలు యువతులంతా
సంతోషంతో నాట్యం చేస్తారు.
యువకులు, వృద్ధులు నాట్యంలో పాల్గొంటారు.
వారి విచారాన్ని సంతోషంగా మార్చుతాను.
ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చుతాను! వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాను!
14 యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది.
నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు నిండిపోయి తృప్తి చెందుతారు!”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది!
యేసు దేవుని అధికారం కలిగియున్నాడు
19 యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు. 20 తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు. 21 తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు.
22 “అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు. 23 తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు.
24 యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట. 25 ఇది సత్యం. దేవుని కుమారుని స్వరం చనిపోయిన వాళ్ళు వినే కాలం రాబోతూవుంది. ఇప్పటికే వచ్చింది. ఆ స్వరం విన్నవాళ్ళు క్రొత్త జీవితాన్ని పొందుతారు. 26 ఎందుకంటే, జీవానికి తండ్రి ఏ విధంగా మూలపురుషుడో అదేవిధంగా కుమారుడు కూడా జీవానికి మూలపురుషుడు. కుమారుణ్ణి మూలపురుషుడుగా చేసింది తండ్రి! 27 కుమారుడు మానవావతారం పొందాడు కనుక తండ్రి ఆయనకు తీర్పు చెప్పే అధికారంయిచ్చాడు. ఆయన స్వరం వినే కాలం రానున్నది.
28 “ఆశ్చర్యపడకండి! సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం వినే కాలం రానున్నది. 29 వెలుపలికి రండి! మంచి చేసిన వాళ్ళు నిరంతరం జీవించటానికి బ్రతికి వస్తారు. కీడు చేసిన వాళ్ళు నిరంతరం శిక్షింపబడటానికి బ్రతికివస్తారు.
30 “నేను స్వయంగా ఏదీ చెయ్యలేను. నేను దేవుడు చెప్పమన్న తీర్పు చెబుతాను. అందువలన నా తీర్పు న్యాయమైనది. నెరవేర వలసింది నాయిచ్ఛ కాదు. నేను నన్ను పంపిన వాని యిచ్ఛ నెర వేర్చటానికి వచ్చాను.
యేసు యూదా నాయకులకు ఎక్కువ చెప్పటం
31 “నా పక్షాన నేను సాక్ష్యం చెబితే దానికి విలువ ఉండదు. 32 కాని నా పక్షాన సాక్ష్యం చెప్పేవాడు మరొకాయన ఉన్నాడు. నా విషయంలో ఆయన చెప్పే సాక్ష్యానికి విలువ ఉందని నాకు తెలుసు.
33 “మీరు మీ వాళ్ళను యెహాను దగ్గరకు పంపారు. అతడు న్యాయం పక్షాన మాట్లాడాడు. 34 మానవుని సాక్ష్యం నాకు కావాలని కాదు. మీరు రక్షింపబడాలని ఈ విషయం చెబుతున్నాను. 35 యోహాను ఒక దీపంలా మండుచూ. వెలుగు నిచ్చాడు. కొంతకాలం మీరా వెలుగు ద్వారా లాభంపొంది ఆనందించారు.
36 “నా దగ్గర యోహాను సాక్ష్యాని కన్నా గొప్ప సాక్ష్యం ఉంది. పూర్తి చెయ్యమని తండ్రి నాకు అప్పగించిన కార్యాల్ని నేను పూర్తి చేస్తున్నాను. ఈ కార్యాలు తండ్రి నన్ను పంపాడని నిరూపిస్తాయి. 37 నన్ను పంపిన తండ్రి స్వయంగా నన్ను గురించి చెప్పాడు. మీరాయన స్వరం ఎన్నడూ వినలేదు. ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. 38 అంతే కాక ఆయన పంపిన వాణ్ణీ మీరు నమ్మటంలేదు. కనుక, ఆయన బోధనలు మీ మనస్సులో నివసించటంలేదు. 39 లేఖనాల ద్వారా అనంత జీవితం లభిస్తుందని మీరు వాటిని పరిశోధిస్తారు. కాని ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెపుతున్నాయి. 40 అయినా మీరు నా దగ్గరకు వచ్చి నానుండి క్రొత్త జీవితాన్ని పొందటానికి నిరాకరిస్తున్నారు.
© 1997 Bible League International