Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు స్తుతి గీతం.
83 దేవా, మౌనంగా ఉండవద్దు!
నీ చెవులు మూసికోవద్దు!
దేవా, దయచేసి ఊరుకోవద్దు.
2 దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
3 నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
4 “ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.
9 దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరాను,
యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు.
వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.
17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
అని వారు తెలుసుకొంటారు.
పసివాడైన మోషే
2 లేవీ వంశానికి చెందిన ఒకడు ఉన్నాడు. లేవీ వంశానికి చెందినదాన్నే ఒకామెను అతడు పెళ్లి చేసుకొన్నాడు. 2 ఆమె గర్భవతియై ఒక కుమారుణ్ణి కన్నది. శిశువు చాలా అందంగా ఉండడం చూసి ఆ తల్లి మూడు నెలలపాటు ఆ శిశువును దాచి ఉంచింది. 3 అయితే మూడు నెలలు అయ్యాక ఆ శిశువు సంగతి తెలిసిపోతుందేమోనని ఆ తల్లి భయపడింది. అలా తెలిస్తే ఆ శిశువు మగపిల్లవాడు కనుక వాడ్ని చంపేస్తారు. అందుకని ఆమె జమ్ముతో ఒక బుట్టను తయారు చేసి, అది నీళ్లలో తేలడానికిగాను దానికి తారు పూసింది. శిశువును ఆ బుట్టలో పెట్టింది. ఆమె తర్వాత నది ఒడ్డున ఏపుగా పెరిగిన జమ్ములో ఆ బుట్టను పెట్టింది. 4 ఆ పసివాడి అక్క అక్కడే వుండి గమనిస్తూవుంది. ఆమె ఆ పసివాడికి ఏమి జరుగుతుందో చూడాలని అనుకొంది.
5 సరిగ్గా అదే సమయంలో ఫరో కూతురు స్నానం చేయడానికి నది దగ్గరకు వెళ్లింది. ఆమె పని మనుషులు నది గట్టు మీద తిరుగుతూ ఉన్నారు. జమ్ములో ఉన్న బుట్టను ఆమె చూసింది. వెళ్లి ఆ బుట్టను తీసుకు రమ్మని ఆమె తన పనికత్తెల్లో ఒక దానితో చెప్పింది. 6 రాజకుమారి ఆ బుట్ట తెరచి, అందులో ఉన్న మగ పిల్లాడ్ని చూసింది. ఆ పసివాడు ఏడుస్తూ ఉండడం చూసి, ఆమె జాలి పడింది. “వీడు హీబ్రూ పిల్లవాడని” ఆమె చెప్పింది.
7 ఇంకా అప్పటివరకు దాక్కొని ఉన్న ఆ పసివాని అక్క లేచి, “ఈ పసివాడ్ని పెంచటానికి మీకు సహాయం చేసేందుకు ఒక హీబ్రూ స్త్రీని వెదకి తీసుకొని రమ్మంటారా?” అని రాజకుమారిని అడిగింది.
8 “సరే అలాగే తీసుకురా” అంది రాజకుమారి.
ఆ పిల్ల వెళ్లి ఆ పసివాడి స్వంత తల్లినే తీసుకొచ్చింది.
9 “ఈ పసివాడ్ని తీసుకొని వెళ్లి పాలిచ్చి నాకోసం పెంచు. పసివాడ్ని జాగ్రత్తగా చూడు. నీకు నేను జీతం ఇస్తాను” అంది ఆ రాజకుమారి.
కనుక ఆ స్త్రీ తన పసివాణ్ణి తీసుకొని జాగ్రత్తగా పెంచింది. 10 ఆ పసివాడు పెద్దవాడయ్యాడు. కొన్నాళ్లకు ఆ స్త్రీ పిల్లవాడ్ని రాజకుమారి దగ్గరకు తీసుకొచ్చింది. రాజకుమారి ఆ పిల్లవాడ్ని తన సొంత కుమారుడుగా స్వీకరించింది. ఆ పిల్లవాడ్ని నీళ్లలోంచి బయటికి తీసింది కనుక ఆమె వానికి మోషే[a] అని పేరు పెట్టింది.
చివరి మాట
12 సోదరులారా! మేము ప్రస్తుతం కోరేదేమిటంటే, కష్టపడి పని చేస్తూ ప్రభువు సేవలో మీకు దారి చూపుతూ మీకు బోధిస్తున్న వాళ్ళను గౌరవించండి. 13 వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కనుక వాళ్ళను అందరికన్నా ఎక్కువగా ప్రేమించి గౌరవించండి.
శాంతంగా జీవించండి. 14 సోదరులారా! సోమరులను వారించండి. పిరికి వాళ్ళకు ధైర్యం చెప్పండి. అందరి పట్ల శాంతంగా ఉండండి. బలహీనుల్ని బలపర్చండి. ఇది మా విజ్ఞాపన. 15 కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర్ల పట్ల దయచూపుతూ ఉండండి.
16 ఎప్పుడూ ఆనందంగా వుండండి. విడువకుండా ప్రార్థించండి. 17 దైవ నియమాన్ని తప్పక పాటించండి. 18 అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక.
© 1997 Bible League International