Revised Common Lectionary (Semicontinuous)
యెహోషువ వీడ్కోలు చెప్పటం
24 అప్పుడు ఇశ్రాయేలీయుల వంశాలన్ని షెకెములో సమావేశం అయ్యాయి. వారందరినీ యెహోషువ అక్కడికి పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేలు నాయకులను, కుటుంబ పెద్దలను, న్యాయమూర్తులను యెహోషువ పిలిచాడు. వీళ్లంతా దేవుని ఎదుట నిలబడ్డారు.
2 అప్పుడు యెహోషువ ప్రజలందరితో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మీతో చెబుతున్నదే నేను మీతో చెబుతున్నాను. చాలకాలం క్రిందట మీ పూర్వీకులు యూఫ్రటీసు నదికి ఆవలిపక్క నివసించారు. అబ్రాహాము, నాహోరుల తండ్రి తెరహు వంటి మనుష్యులను గూర్చి నేను చెప్పుచున్నాను. అప్పట్లో వాళ్లు ఇతర దేవుళ్లను పూజించారు. 3 అయితే యెహోవానైన నేను మీ తండ్రి అబ్రాహామును నది ఆవలివైపు దేశంనుండి బయటకు రప్పించాను. నేను అతనిని కనాను దేశంగుండా నడిపించి, అతనికి అనేకమంది పిల్లల్ని ఇచ్చాను. అబ్రాహాముకు ఇస్సాకు అనే కొడుకును నేను ఇచ్చాను.
14 అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు మీరు యెహోవా మాటలు విన్నారు. కనుక మీరు యెహోవాను గౌరవించి, నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజించిన అసత్య దేవుళ్లను పారవేయండి. అది ఎప్పుడో చాలకాలం క్రిందట నదికి అవతల, ఈజిప్టులో జరిగిన విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి.
15 “అయితే ఒకవేళ యెహోవాను సేవించటం మీకు ఇష్టం లేదేమో. అది ఈ వేళే మీరు తేల్చుకోవాలి. మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ పూర్వీకులు నదికి ఆవల నివసించినప్పుడు సేవించిన దేవుళ్లను మీరు సేవిస్తారో? లేదా ఈ దేశంలో నివసించిన అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో? మీకు మీరే కోరుకోండి. అయితే, నేను, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము!”
16 అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “లేదు, యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ మానము. ఇక ఇతర దేవుళ్లను ఎన్నటికి మేము సేవించము. 17 మన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించినవాడు యెహోవాయే అని మాకు తెలుసు. ఆ దేశంలో మనం బానిసలం. అయితే అక్కడ యెహోవా మనకోసం మహాగొప్ప కార్యాలు చేసాడు. ఆయనే ఆ దేశంనుండి మనల్ని బయటకు రప్పించాడు, ఇతర దేశాలగుండా మనము ప్రయాణించినప్పుడు ఆయనే మనలను కాపాడాడు. 18 తర్వాత ఈ దేశాల్లో నివసించే ప్రజలను ఓడించటానికి యెహోవాయే మనకు సహాయం చేసాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ దేశంలో నివసించిన అమోరీ ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేసాడు. కనుక మేము ఆయననే సేవిస్తాం. ఎందుచేతనంటే ఆయనే మన దేవుడు గనుక.”
19 అప్పుడు యెహోషువ అన్నాడు, “(అది నిజం కాదు) మీరు యెహోవాను సరిగ్గా సేవించలేరు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజిస్తే దేవునికి అసహ్యం. అలా మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించడు. 20 మీరు యెహోవాను విడిచిపెట్టి, ఇతర దేవుళ్లను సేవిస్తారు మరియు భయంకర సంగతులను దేవుడు మీకు సంభవింపజేస్తాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవా దేవుడు మీ ఎడల దయగా ఉన్నాడు కానీ మీరు ఆయనకు విరోధంగా తిరిగితే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.”
21 అయితే ప్రజలు, “లేదు, మేము యెహోవానే సేవిస్తాము” అని యెహోషువతో చెప్పారు.
22 అప్పుడు యెహోషువ, “మీ చుట్టూ, ఇక్కడ మీతో ఉన్న ప్రజల చుట్టూ చూడండి. మీరు యెహోవానే సేవించేందుకు నిర్ణయం చేసారని మీకు తెలుసా, మీరు ఒప్పుకొన్నారా? దీనికి మీరంతా సాక్షులేనా?” అన్నాడు.
ప్రజలు “అవును, ఇది సత్యం. మేము యెహోవానే సేవిస్తామని మేము నిర్ణయించు కొన్నట్టు మా అందరికీ తెలుసు” అని జవాబిచ్చారు.
23 అప్పుడు యెహోషువ, “అలాగైతే మీ మధ్య ఉన్న అసత్య దేవుళ్లను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి” అని చెప్పాడు.
24 అప్పుడు ప్రజలు “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాము. మేము ఆయనకే విధేయులమవుతాము” అని యెహోషువతో చెప్పారు.
25 కనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక ఒడంబడిక చేసాడు. ఈ ఒడంబడికను వారు పాటించాల్సిన ఒక చట్టముగా చేసాడు యెహోషువ. షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగింది.
ఆసాపు ధ్యాన గీతం.
78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
నేను చెప్పే విషయాలు వినండి.
2 ఈ కథ మీతో చెబుతాను.
ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
4 ఈ కథను మనము మరచిపోము.
మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.
5 యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు.
మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.
6 ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొంటారు.
క్రొత్త తరాలు పుడతాయి. వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబుతారు.
7 కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు.
దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు.
వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
ప్రభువు రాకడ
13 సోదరులారా! చనిపోయినవాళ్ళను గురించి మీకు తెలియాలని మా కోరిక. బ్రతుకుపై ఆశలేని వాళ్ళవలే దుఃఖించరాదని మా కోరిక. 14 యేసు చనిపోయి తిరిగి బ్రతికివచ్చాడని మనం నమ్ముతాము. అందుకే యేసును విశ్వసించినవాళ్ళు మరణించినప్పుడు దేవుడు వాళ్ళను ఆయనతో సహా బ్రతికిస్తాడని కూడా మనం విశ్వసిస్తాము.
15 ప్రభువు వచ్చేవరకు మనం బ్రతికి ఉంటే, యింతకు క్రితము చనిపోయినవాళ్ళకంటే ముందు వెళ్ళము. ఇది ప్రభువు స్వయంగా చెప్పాడు. 16 ప్రభువు పరలోకం నుండి దిగివచ్చినప్పుడు ప్రధాన దూతతో అధికార పూర్వకంగా వస్తాడు. అప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయినవాళ్ళు మొదటలేస్తారు. 17 ఆ తర్వాత యింకా బ్రతికి ఉన్న మనల్ని ప్రభువు వాళ్ళతో సహా ఆకాశంలో ఉన్న మేఘాల్లోకి తీసుకువెళ్తాడు. అప్పటినుండి మనం ఆయనతో చిరకాలం ఉండిపోతాము. 18 అందువల్ల వీటిని గురించి మాట్లాడుకొని పరస్పరం ధైర్యం చెప్పుకోండి.
పది మంది కన్యకల ఉపమానం
25 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు. 2 వాళ్ళలో ఐదుగురు తెలివిలేని వాళ్ళు; ఐదుగురు తెలివిగల వాళ్ళు. 3 తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. 4 తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకు వెళ్ళారు. 5 పెళ్ళి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు.
6 “అర్థరాత్రి వేళ, ‘అదిగో పెళ్ళి కుమారుడు! వచ్చి చూడండీ!’ అని ఎవరో బిగ్గరగా కేక వేసారు.
7 “వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు. 8 తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు.
9 “తెలివి గల కన్యలు, ‘ఈ నూనె మనకందరికి సరిపోదేమో! దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి’ అని సమాధానం చెప్పారు.
10 “కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది.
11 “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు.
12 “కాని అతడు, ‘నేను నిజం చెబుతున్నాను; మీరెవరో నాకు తెలియదు’ అని సమాధానం చెప్పాడు.
13 “మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి.
© 1997 Bible League International