Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
3 యెహోవా, మా మీద దయ చూపించుము.
మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.
16 అప్పుడు యెహోవా న్యాయాధిపతులు అనే నాయకులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ఆస్తులను తీసుకున్న శత్రువులనుండి వారిని ఈ నాయకులు రక్షించారు. 17 కాని ఇశ్రాయేలు ప్రజలు వారి న్యాయాధిపతుల మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక ఇతర దేవుళ్లను అనుసరించారు.[a] పూర్వం ఇశ్రాయేలీయుల పూర్వీకులు యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యారు. కానీ ఇశ్రాయేలీయులు ఇప్పుడు మారిపోయి, యెహోవాకు విధేయులు కావటం లేదు.
18 ఇశ్రాయేలీయుల శత్రువులు ఇశ్రాయేలు ప్రజలకు అనేకసార్లు చెడు సంగతులు జరిగించారు. అందుచేత ఇశ్రాయేలీయులు సహాయం కోసం ఏడ్చేవారు. ప్రతీసారీ, ప్రజల విషయమై యెహోవా సంతాప పడ్డాడు. ప్రతీసారీ ప్రజలను వారి శత్రువుల నుండి రక్షించేందుకు ఆయన ఒక న్యాయమూర్తిని పంపించాడు. యెహోవా ఎల్లప్పుడూ ఆ న్యాయమూర్తులతో ఉండేవాడు. కనుక ప్రతిసారీ ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల నుండి రక్షించబడ్డారు. 19 అయితే ప్రతీ న్యాయమూర్తి చనిపోయినప్పుడూ, ఇశ్రాయేలీయులు మరల పాపం చేసి, బూటకపు దేవుళ్లను పూజించటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు చాలా మొండి వాళ్లు వారు తమ చెడు మార్గాలు విడిచి పెట్టేందుకు నిరాకరించారు.
20 అందుచేత ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపగించి, ఆయన చెప్పాడు: “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులతో చేసిన ఒడంబడికనే ఉల్లంఘించారు. వారు నా మాట వినలేదు. 21 కనుక నేను ఇంకెంత మాత్రం ఇతర రాజ్యాలను జయించి, ఇశ్రాయేలీయుల కోసం దారి సులభం చేయను. యెహోషువ చనిపోయినప్పుడు ఆ రాజ్యాలు ఇంకా ఈ దేశంలోనే ఉన్నాయి. మరియు ఆ రాజ్యాలను నేను ఈ దేశంలోనే ఉండనిస్తాను. 22 ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించేందుకు నేను ఆ రాజ్యాలను ప్రయోగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించినట్టుగా, పాటించగలరేమో నేను చూస్తాను.” 23 యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. ఆ రాజ్యాలు వెంటనే దేశం విడిచిపోయేట్టు యెహోవా బలవంతం చేయలేదు. వారిని ఓడించేందుకు ఆయన యెహోషువ సైన్యానికి సహాయం చేయలేదు.
8 నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ప్రజల్ని వేడితో మాడ్చివేయటానికి సూర్యునికి అధికారమివ్వబడింది. 9 తీవ్రమైన వేడివల్ల ప్రజలు మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ళ మీద అధికారమున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించటానికి నిరాకరించారు.
10 ఐదవ దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద క్రుమ్మరించాడు. వెంటనే వాని రాజ్యం చీకటిలో మునిగి పోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు. 11 తమ బాధలకు, తమ కురుపులకు పరలోకంలోవున్న దేవుణ్ణి దూషించారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారుమనస్సు పొందటానికి నిరాకరించారు.
12 ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది. 13 ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి. 14 అవి భూతాత్మలు. వాటికి మహత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని “మహాదినం” నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరకి వెళ్తాయి.
15 “జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది.”
16 ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో “హార్‌మెగిద్దోను” అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి.
17 ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది. 18 వెంటనే మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది. 19 మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత” అనబడే మద్యాన్ని పోసాడు. 20 ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి. 21 ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.
© 1997 Bible League International