Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
2 యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
నా మీద దయ చూపించుము.
3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.
6 యెహోవాను స్తుతించండి.
కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
7 యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
9 దేవా, నీ ప్రజలను రక్షించుము.
నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
కాపరిలా వారిని నిత్యం నడిపించుము.
15 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: 16 “ప్రజల ఆలోచనలు తెలిసిన దేవుడు యెహోవా ప్రభువు, నీవే ఈ ప్రజలకోసం మరో నాయకుడిని ఎంచుకోమని మనవి చేస్తున్నాను. 17 ఈ దేశంలోనుండి వీరిని బయటకు నడిపించి, కొత్త దేశంలో చేర్చగల నాయకుడిని ఎంచవలసిందిగా నేను యెహోవాకు మనవి చేస్తున్నాను. అప్పుడు యెహోవా ప్రజలు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”
18 కనుక మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నూను కుమారుడైన యెహోషువ నాయకుడుగా ఉంటాడు. యెహోషువ ఆత్మను పొందినవాడు. అతడిని కొత్త నాయకునిగా చేయి. 19 యాజకుడైన ఎలియాజరు ఎదుటా, ప్రజలందరి ఎదుటా నిలబడమని అతనితో చెప్పు. అప్పుడు అతడిని కొత్త నాయకునిగా నీవు చేయి.
20 “అతడిని నీవు నాయకునిగా చేస్తున్నావని ప్రజలకు చూపెట్టు, అప్పుడు ప్రజలంతా అతనికి లోబడతారు. 21 ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా చేయాలంటే అతడు యాజకుడైన ఎలియాజరు దగ్గరకు వెళతాడు. యెహోవా జవాబు తెలుసుకొనేందుకు ఎలియాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. అప్పుడు యెహోషువ, ప్రజలందరూ దేవుడు చెప్పిన వాటిని చేస్తారు. ‘యుద్ధానికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు యుద్ధానికి వెళ్తారు. ఒకవేళ ‘ఇంటికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.”
22 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యాజకుడైన ఎలియాజరు ముందు, ప్రజలందరి ఎదుట నిలబడమని యెహోషువాతో చెప్పాడు. మోషే, 23 అప్పుడు అతడే కొత్త నాయకుడు అని చూపెట్టేందుకు అతనిమీద మోషే చేతులు పెట్టాడు. అతనితో యెహోవా చెప్పినట్టే అతడు చేసాడు.
8 దావీదు వంశానికి చెందిన యేసు క్రీస్తు బ్రతికింపబడ్డాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను బోధించే సువార్త. 9 ఈ సువార్త బోధించటం వల్ల నేను సంకెళ్ళతో నేరస్తునివలె కష్టాలు అనుభవిస్తున్నాను. కాని దేవుని సందేశానికి సంకెళ్ళు లేవు. 10 కనుకనే, దేవుడు ఎన్నుకొన్నవాళ్ళ కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ, వాళ్ళకు కూడా లభించాలని నా అభిలాష.
11 ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది:
మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం.
12 మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం!
మనం ఆయన్ని కాదంటే ఆయన మనల్ని కాదంటాడు.
13 మనం నమ్మతగనివాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు.
తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.
© 1997 Bible League International