Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 107:1-7

అయిదవ భాగం

(కీర్తనలు 107–150)

107 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
    ఆయన ప్రేమ శాశ్వతం.
యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి.
    వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు.
    తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల[a] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.

ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు.
    వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుచుండిరి.
    కాని వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు.
ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి
    బలహీనం అయ్యారు.
అప్పుడు వారు సహాయం కోసం ఏడ్చి, యెహోవాకు మొరపెట్టి వేడుకొన్నారు.
    యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు.
ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.

కీర్తనలు. 107:33-37

33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు.
    నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికిమాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు.
    ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు.
    ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు.
    ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు.
    వారికి మంచి పంట వచ్చింది.

యెహోషువ 2:15-24

15 ఆ స్త్రీ ఇల్లు పట్టణం ప్రహారీ గోడమీద కట్టబడింది. అది గోడలో ఒక భాగంగా ఉంది. కనుక ఆమె ఒక తాడు ప్రయోగించి కిటికీలోనుంచి వాళ్లిద్దర్నీ క్రిందికి దించింది. 16 అప్పుడు ఆమె వాళ్లతో ఇలా అంది: “పొరబాటున కూడా మీరు రాజుగారి మనుష్యులకు కనపడకుండా పడమటి కొండల్లోకి వెళ్లిపోండి. మూడు రోజులు అక్కడ దాక్కోండి. రాజుగారి మనుష్యులు తిరిగి వచ్చాక, మీ దారిన మీరు వెళ్లవచ్చు.”

17 ఆ మనుష్యులు ఇద్దరూ ఆమెతో ఇలా అన్నారు: “మేము నీకు వాగ్దానం చేసాము. అయితే నీవు ఒక పని చేయాలి. లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యులం కాదు. 18 మేము తప్పించుకోనేందుకు నీవు ఈ ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము ఈ దేశానికి తిరిగి వస్తాము. ఆ సమయంలో ఈ ఎర్రటి తాడును నీవు నీ కిటికీలో కట్టాలి. నీ తండ్రిని, తల్లిని, నీ సోదరులను, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంట్లో చేర్చాలి. 19 ఈ ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరినీ మేము క్షేమంగా కాపాడుతాము. నీ ఇంట్లో ఉన్న వాళ్లెవరైనా దెబ్బతింటే దానికి మేము బాధ్యులము. నీ ఇంట్లోనుంచి ఎవరైనా బయటకు వెళ్లి, చంపబడితే దానికి మేము బాధ్యులము కాము. అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది. 20 ఈ ఒడంబడిక మేము నీతో చేస్తున్నాము. మేము చేస్తోన్న పనిగూర్చి నీవు గనుక ఎవరితోనైనా చెప్పావంటే మేము ఈ ఒడంబడికకు కట్టుబడి ఉండనక్కర్లేదు.”

21 “ఇది నాకు సమ్మతమే” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది, వాళ్లు ఆమె ఇల్లు విడిచి బయల్దేరారు. అప్పుడు ఆమె ఆ ఎర్రటి తాడును కిటికీకి కట్టింది.

22 ఆ మనుష్యులు ఆమె ఇల్లు విడిచి, కొండల్లోకి వెళ్లిపోయారు. మూడు రోజులు వాళ్లు అక్కడే ఉన్నారు. రాజు మనుష్యులు మార్గం అంతా వెదికారు. మూడు రోజుల తర్వాత రాజు మనుష్యులు వెదకటం మానివేసి పట్టణానికి తిరిగి వెళ్లిపోయారు. 23 అప్పుడు ఆ మనుష్యులు ఇద్దరూ యెహోషువ దగ్గరకు ప్రయాణం మొదలుబెట్టారు. వాళ్లు కొండలు విడిచి, నది దాటారు. నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వారు వెళ్లారు. వారు తెలుసుకొన్న సమాచారం అంతా వాళ్లు యెహోషువకు చెప్పారు. 24 వారు యెహోషువతో, “నిజంగా ఆ దేశం అంతా యెహోవా మనకు ఇచ్చాడు. ఆ దేశ ప్రజలందరికీ మనమంటే భయంగా ఉంది” అని చెప్పారు.

మత్తయి 23:13-28

13 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. 14 [a]

15 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు.

16 “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 17 మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?

18 “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? 20 అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 21 అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 22 అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా!

23 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. 24 గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు.

25 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. 26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.

27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International