Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
2 యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
నా మీద దయ చూపించుము.
3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.
6 యెహోవాను స్తుతించండి.
కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
7 యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
9 దేవా, నీ ప్రజలను రక్షించుము.
నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
కాపరిలా వారిని నిత్యం నడిపించుము.
4 దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “చంపటానికి పెంచబడ్డ గొర్రెల విషయం జాగ్రత్త తీసుకో. 5 వాటి నాయకులు యజమానులవలెను, వ్యాపారులవలెను ఉన్నారు. యజమానులు వారి గొర్రెలను చంపుతారు. అయినా వారు శిక్షింపబడరు. వ్యాపారులు గొర్రెలను అమ్మి, ‘దేవునికి జయం, నేను భాగ్యవంతుడనయ్యాను’ అని అంటారు. కాపరులు తమ గొర్రెల కొరకు విచారించరు. 6 ఈ దేశంలో నివసించే ప్రజల కొరకు నేను విచారించను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను ప్రతివాడినీ తన పొరుగువానిచేత, రాజుచేత దూషింపబడేటట్లు చేస్తాను. వారి దేశాన్ని నాశనం చేసేలాగు నేను వారిని వదులుతాను. నేను వారిని ఆపను!”
7 కావున చంపబడటానికి పెంచబడిన ఆ అభాగ్యపు గొర్రెలపట్ల నేను శ్రద్ధ తీసుకున్నాను. నాకు రెండు కర్రలు దొరికాయి. ఒక కర్రను “అభిమానం” అని, మరొక కర్రను “సమైక్యత” అని పిలిచాను. తరువాత నేను గొర్రెలపట్ల శ్రద్ధ తీసుకోవటం మొదలు పెట్టాను. 8 ముగ్గురు కాపరులను ఒక్క నెలలో సంహరించాను. నేను గొర్రెలపట్ల కోపించగా, వారు నన్ను ద్వేషించటం మొదలు పెట్టారు. 9 అప్పుడు నేను ఇలా అన్నాను: “నేను వదిలి వేస్తాను! నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకోను! చావు కోరేవారిని నేను చనిపోనిస్తాను. నాశనమైపోవాలని కోరుకొనేవారిని నేను నాశనం కానిస్తాను. ఇంకా మిగిలినవారు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు.” 10 తరువాత “అభిమానం” అనే కర్రను నేను తీసుకొని విరుగగొట్టాను. తన ప్రజలతోగల దేవుని ఒడంబడిక రద్దయినట్లు చూపటానికే నేనిది చేశాను. 11 కావున ఆ రోజున నిబంధన రద్దయింది. నన్ను గమనిస్తున్న ఆ నిర్భాగ్యపు గొర్రెలకు ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినదని తెలుసు.
12 అప్పుడు నేనిలా అన్నాను: “మీరు నాకు వేతనం ఇవ్వదలిస్తే ఇవ్వండి. వద్దనుకుంటే మానండి!” వారప్పుడు ముప్పై వెండి నాణెములిచ్చారు. 13 తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “అంటే నా విలువ అంత మాత్రమేనని వారనుకుంటున్నారన్నమాట. ఆ మహాధనాన్ని[a] ఆలయ ఖజానాలో పడవేయి.” కావున ఆ ముప్పై వెండి నాణాలను తీసుకొని యెహోవా ఆలయంలోని ఖజానాలో పడవేశాను. 14 పిమ్మట “సమైక్యత” అనే కర్రను తీసుకొని రెండుగా నరికాను. యూదా, ఇశ్రాయేలుల మధ్యగల ఐక్యతకు భంగం వాటిల్లిందని చూపటానికి నేనిది చేశాను.
15 పిమ్మట యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు గొర్రెలను కాయటానికి అసలు పనికిరాని ఒక కర్రను చూడు. 16 ఈ దేశానికి ఒక కొత్త కాపరిని నేను తెస్తానని ఇది చూపుతుంది. కాని ఈ యువకుడు నాశనం కాబడుతున్న గొర్రెలపట్ల జాగ్రత్త తీసుకోలేడు. గాయపడిన గొర్రెలను అతడు బాగు చేయలేడు. బతికివున్న వాటికి అతడు గ్రాసం[b] ఇవ్వలేడు. ఆరోగ్యంగా ఉన్నవి పూర్తిగా తినబడతాయి. కేవలం వాటి గిట్టలు మాత్రం వదిలివేయబడతాయి.”
17 పనికిమాలిన ఓ నా కాపరీ,
నీవు నా గొర్రెలను వదిలివేశావు.
అతనిని శిక్షించు!
అతని కుడి చేతిని, కుడి కంటిని కత్తితో కొట్టు.
అతని కుడిచేయి నిరుపయోగమవుతుంది.
అతని కుడి కన్ను గ్రుడ్డిదవుతుంది.
దేవుణ్ణి స్తుతించండి
19 ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి యిలా అన్నది:
“దేవుణ్ణి స్తుతించండి!
రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే.
2 ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు.
తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన
ఆ వేశ్యను ఆయన శిక్షించాడు.
తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.”
3 వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు:
“దేవుణ్ణి స్తుతించండి!
కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.”
4 ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు:
“ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!”
5 అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది:
“ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి.
ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.”
6 ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు యిలా అన్నారు:
“దేవుణ్ణి స్తుతించండి.
సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన
దేవుడు మనల్ని పాలిస్తున్నాడు.
7 మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం.
గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది.
ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది.
8 సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి యివ్వబడ్డాయి.
అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి.”
(సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి.)
9 ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొఱ్ఱెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని మాటలు.”
© 1997 Bible League International