Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు ధ్యాన గీతం.
78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
నేను చెప్పే విషయాలు వినండి.
2 ఈ కథ మీతో చెబుతాను.
ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
4 ఈ కథను మనము మరచిపోము.
మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.
5 యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు.
మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.
6 ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొంటారు.
క్రొత్త తరాలు పుడతాయి. వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబుతారు.
7 కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు.
దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు.
వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
ఆశీర్వాదాలు మరియు శాపాలను చదవటం
30 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఏబాలు కొండమీద ఆ బలిపీఠాన్ని అతడు కట్టాడు. 31 బలిపీఠాలు కట్టడం ఎలా అనేది యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసాడు. కనుక మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వివరించబడిన ప్రకారం యెహోషువ బలిపీఠాన్ని నిర్మించాడు. చెక్కబడని రాళ్లతో బలిపీఠం కట్టబడింది. ఆ రాళ్లమీద ఎన్నడూ ఏ పనిముట్టూ ప్రయోగించబడలేదు. ఆ బలిపీఠం మీద వారు యెహోవాకు దహనబలి అర్పణలు అర్పించారు సమాధాన బలులు కూడా వారు అర్పించారు.
32 ఆ స్థలంలోనే మోషే ధర్మశాస్త్రాన్ని యెహోషువ రాళ్లమీద చెక్కాడు. ఇశ్రాయేలు ప్రజలంతా చూసేందుకు వీలుగా అతడు ఇలా చేసాడు. 33 పెద్దలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇశ్రాయేలు ప్రజలందరూ పవిత్ర పెట్టె చుట్టూ నిలబడ్డారు. యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను మోస్తున్న లేవీ యాజకుల ఎదుట వారు నిలబడ్డారు. యూదా ప్రజలు, యూదులు కానివాళ్లు అందరూ అక్కడ ఉన్నారు. సగం మంది ప్రజలు ఏబాలు కొండ ఎదుటను, మిగిలిన సగం మంది ప్రజలు గెరిజీము కొండ ఎదుటను నిలబడ్డారు యెహోవా సేవకుడు మోషే ప్రజలను ఆశీర్వదించినప్పటిలానే ఉంది ఇప్పుడు కూడ. మోషే మొదటిసారి ఆశీర్వదించినప్పుడు ప్రజలు ఇలాగే నిలబడాలని అతడు చెప్పాడు.
34 అప్పుడు యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ చదివాడు. ఆశీర్వాదాలను, శాపాలను కూడ యోహోషువ చదివాడు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా అతడు చదివాడు. 35 ఇశ్రాయేలు ప్రజలంతా అక్కడ సమావేశం అయ్యారు. స్త్రీలు, పిల్లలు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన విదేశీయులందరూ అక్కడ ఉన్నారు. మరియు మోషే ఇచ్చిన ప్రతి ఆజ్ఞనూ యెహోషువ చదివాడు.
ఆరవ బూర ఊదబడింది
13 ఆరవ దేవదూత తన బూర ఊదాడు. దేవుని ముందున్న బంగారు ధూపవేదిక యొక్క నాలుగు కొనల నుండి నాకు ఒక స్వరం వినిపించింది. 14 ఆ స్వరం బూర ఊదుతున్న ఆరవ దూతతో, “యూఫ్రటీసు మహానది దగ్గర బంధింపబడిన నలుగురు దూతల్ని విడుదల చేయి” అని అనింది. 15 ఇదే గడియ, ఇదే రోజు, ఇదే నెల, ఇదే సంవత్సరము విడుదల చేయబడటానికి వాళ్ళు యింతవరకు బంధింపబడ్డారు. మనుష్యులలో మూడవ భాగాన్ని హతమార్చటానికి వాళ్ళు విడుదల చేయబడ్డారు. 16 ఆ రౌతుల సంఖ్య ఇరవై కోట్లు అన్నట్లు నేను విన్నాను.
17 నాకు కనిపించిన రౌతులు, గుఱ్ఱాలు ఈ విధంగా ఉన్నాయి. రౌతుల కవచాలు అగ్నివలె ఎరుపు, ముదురు నీలం, గంధకాన్ని పోలిన పసుపు రంగుల్లో ఉన్నాయి. గుఱ్ఱాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. వాటి నోళ్ళనుండి మంటలు, పొగ, గంధకము బయటికి వచ్చాయి. 18 వాటి నోళ్ళనుండి వచ్చిన ఈ మూడు పీడలు, అంటే మంటలు, పొగలు, గంధకాల వల్ల మనుష్యులలో మూడవ భాగం హతులై పోయారు. 19 ఆ గుఱ్ఱాల శక్తి వాటి నోళ్ళల్లో, తోకల్లో ఉంది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి. ఆ తోకలకు పాము తలలు ఉన్నాయి. వాటితో అవి కాటువేసి బాధిస్తాయి.
20 ఈ మూడు పీడలు యింత నాశనం చేసినా, మరణించని మానవ జాతి తాము చేసిన పాపాలకు పశ్చాత్తాప పడలేదు. వాళ్ళు దయ్యాల్ని పూజించటం మానుకోలేదు. బంగారము, వెండి, కంచు, రాయి, చెక్కతో చేసిన విగ్రహాలను పూజించటం వాళ్ళు మానుకోలేదు. ఈ విగ్రహాలు చూడకపోయినా, వినకపోయినా, కదలకపోయినా, వాటిని పూజించటం మానుకోలేదు. 21 అంతేకాక, వాళ్ళు తాము చేసిన హత్యలకు, మంత్రతంత్రాలకు, లైంగిక అవినీతికి, దొంగతనాలకు మారుమనస్సు పొందలేదు.
© 1997 Bible League International